బియ్యప్పిండితో బోల్డంత అందం...

ముఖారవిందాన్ని మరింత మెరిపించాలంటే బియ్యప్పిండి చాలంటున్నారు నిపుణులు. అందంతోపాటు ఆరోగ్యవంతమైన ముఖ చర్మాన్ని దీంతో సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.

Published : 16 Sep 2022 00:27 IST

ముఖారవిందాన్ని మరింత మెరిపించాలంటే బియ్యప్పిండి చాలంటున్నారు నిపుణులు. అందంతోపాటు ఆరోగ్యవంతమైన ముఖ చర్మాన్ని దీంతో సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.

నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌, ఎండవల్ల ఏర్పడిన నల్లదనం, మొటిమలు, పొడారే చర్మం, కళ్ల కింద నల్లని వలయాలు, ముడతలను బియ్యప్పిండి లేపనాలతో దూరం చేయొచ్చు. అందుకేం చేయాలంటే... ముందు జల్లించిన మెత్తని పిండిని సిద్ధం చేసుకోవాలి. అరకప్పు నీటిని మరిగించి ఇందులో బ్లాక్‌టీ బ్యాగును మూడు నిమిషాలుంచి తీసేయాలి. ఈ నీటిలో చెంచా చొప్పున బియ్యప్పిండి, తేనె వేసి పేస్టులా చేసి ముఖానికి లేపనంలా రాస్తూనే వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. పావుగంట ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేస్తే, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ముఖచర్మంలో నిల్వ ఉన్న ట్యాక్సిన్లను బయటకు పంపి, నల్లని మచ్చలు, మొటిమలను తగ్గేలా చేస్తాయి.

పొడిచర్మానికి.. రెండు చెంచాల చొప్పున బియ్యప్పిండి, కలబంద గుజ్జు, తురిమిన కీరదోస గుజ్జు ఒక గిన్నెలో వేసి పేస్టులా కలపాలి. దీన్ని ముఖానికి రాసి, 20 నిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. ఈ లేపనం వేసే ముందు ముఖాన్ని తడిపొడిగా చేస్తే చర్మం బాగా పీల్చుకుంటుంది. పొడిచర్మం ఉన్నవారు ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేస్తే చర్మం తేమగా మారుతుంది. సాగే గుణాన్ని తెచ్చుకుంటుంది. వారానికొకసారి ఇలా చేస్తే ముఖం మృదువుగా మారుతుంది.

క్రీంతో.. చెంచా చొప్పున బియ్యప్పిండి, తాజా క్రీంకు పావుచెంచా ఆర్గానిక్‌ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి, పావుగంట ఆరనిచ్చి, చల్లని నీటితో శుభ్రం చేస్తే చాలు. వారానికొకసారి వేసే ఈ ప్యాక్‌తో ముఖంపై ఏర్పడే పిగ్మెంటేషన్‌ దూరమవుతుంది. కాంతిమంతంగా కనిపిస్తుంది. అలాగే చెంచా చొప్పున బియ్యప్పిండి, శనగ పిండికి ఒక టమాటా నుంచి తీసిన రసం, పావు చెంచా పసుపు కలిపి దాన్ని ముఖానికి, మెడకు లేపనంలా రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. ఈ లేపనాన్ని రోజూ వేసుకుంటే కళ్లకింద నల్లని వలయాలు మటుమాయమవుతాయి.

పండ్లను కలిపి.. సగం యాపిల్‌ గుజ్జులో చెంచా కమలా పండు రసం, చెంచా తేనె, రెండు చెంచాల బియ్యప్పిండిని వేసి బాగా కలపాలి. దాన్ని ముఖానికి లేపనంలా రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి కడగాలి. ఇలా వారానికొకసారి వేస్తే ముఖచర్మం బిగుతుగా మారుతుంది. గీతలు, ముడతలు దూరమవుతాయి. తేమగా, మెరుపును సంతరించుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్