సామాన్యుల కోసం.. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌

‘రష్మీ రాకెట్‌’ సినిమాలో తాప్సీ ఎంత సన్నగా కనిపించిందో గమనించారా? ఆ ఫిట్‌నెస్‌ పది వారాల్లోనే సాధించిందట! నోరు కట్టేసుకుని ఉంటుంది, కఠినమైన వ్యాయామాలు చేసుంటుంది

Published : 17 Sep 2022 00:17 IST

‘రష్మీ రాకెట్‌’ సినిమాలో తాప్సీ ఎంత సన్నగా కనిపించిందో గమనించారా? ఆ ఫిట్‌నెస్‌ పది వారాల్లోనే సాధించిందట! నోరు కట్టేసుకుని ఉంటుంది, కఠినమైన వ్యాయామాలు చేసుంటుంది అనుకుంటున్నారా! అంత లేదు... ఆరోగ్యకరమైన జీవనశైలితోనే ఇది సాధ్యమైదంటుంది ఆమె న్యూట్రిషనిస్ట్‌ మున్‌మున్‌ గనేరివాల్‌. ఆ సూత్రాలను సామాన్యులకూ అర్థమయ్యేలా పంచుకుంటోంది కూడా.

న్యూట్రిషనిస్ట్‌గా మున్‌మున్‌కు 19 ఏళ్ల అనుభవం ఉంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నయనతార, ఏక్తాకపూర్‌, మంజిమా మోహన్‌ వంటి ఎందరో తారలతోపాటు ప్రముఖ క్రీడాకారులు, వ్యాపారులు ఆమె క్లయింట్లే. ఆరోగ్యకరమైన ఆహారం, రోజు వారీ వ్యాయామాలతో ఫిట్‌నెస్‌ సాధించేలా చేయడం తన ప్రత్యేకత. 2019లో అమెరికాలో నిర్వహించిన అమెరికన్‌ సొసైటీ ఫర్‌ న్యూట్రిషన్‌ సదస్సుకు వెళ్లింది. దీనిలో జీర్ణాశయంలో మేలు చేసే సూక్ష్మజీవులపై చర్చ జరిగింది. 60 దేశాల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. జీర్ణక్రియ, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించే వీటి గురించి మనదేశంలో ఎలాంటి చర్చా జరగడం లేదని మున్‌మున్‌ గ్రహించింది. అందుకే సామాన్యులకూ దీనిపై అవగాహన కల్పించాలనుకొని ‘యుక్తాహార్‌: ద బెల్లీ అండ్‌ బ్రెయిన్‌ డైట్‌’ పుస్తకాన్ని రచించింది.

‘భగవద్గీతలో ‘యుక్తాహార్‌’ గురించిన ప్రస్తావన ఉంది. అంటే.. సరైన సమయం, సరైన మొత్తంలో నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడమని అర్థం. జీర్ణవ్యవస్థ సరిగా లేనపుడు ఎంత ఆర్యోగకరమైన ఆహారం తీసుకున్నా ఒంటబట్టదు. జీవనశైలీ దెబ్బ తింటుంది. దాన్నే మార్చాలనుకున్నా. శాస్త్రీయ అంశాలనూ తేలికైన భాషలో మామూలు వాళ్లకీ అర్థమయ్యేలా తీసుకొచ్చా. ఇదో పదివారాల ప్రోగ్రామ్‌. రుతువుల వారీగా తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామం, నిద్ర, యోగా వంటివి ఉంటాయి. పాటించిన వారికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడాలనేదే నా ఉద్దేశం’ అని చెబుతోన్న మున్‌మున్‌ కొన్ని సూచనలూ చేస్తోంది.


1. వేడుకల సమయాల్లో నోరు కట్టుకోవడం కాస్త కష్టమే. అంతమాత్రాన ‘గిల్టీ’ ఫీలింగ్‌తో ఉండిపోవడమో, మరింత కష్టపడటమో చేయనక్కర్లేదు. అనుకున్న డైట్‌ను 80 శాతం అనుసరించగలిగితే చాలు. అప్పుడప్పుడూ నచ్చినవి తింటేనే మనసూ ఆనందంగా ఉంటుంది.


2. అల్పాహారం తేలిగ్గా ఉండాలి. మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తీసుకోవాలి. సాయంత్రం సులభంగా జీర్ణమయ్యే వాటికి ప్రాధాన్యమివ్వాలి. నిర్ణీత సమయాలకే తినాలన్న తొందరొద్దు. ఆకలవ్వనివ్వండి. అప్పుడే త్వరగా వంటబడుతుంది.


3. ఇంట్లో చేసుకున్నవాటికే ప్రాధాన్యమివ్వండి. ఆరోగ్యకరమైనవి అని చెప్పినంత మాత్రాన నిజమని నమ్మొద్దు. గ్లుటెన్‌ లేనివి అని చెబుతారు కానీ వాటిల్లో టాపియోకా, మొక్కజొన్న, బంగాళాదుంప పొడులను ఉపయోగిస్తారు. కృత్రిమ చక్కెరలు, ఫుడ్‌ డై, నిల్వకారకాలూ వాడతారు. తక్కువ ఫ్యాట్‌ ఉండే వాటిలోనూ రసాయనాలుంటాయి. ఇవన్నీ జీర్ణాశయ ఆరోగ్యాన్నే కాదు మెదడు పనితీరుని దెబ్బతీస్తాయి. అధిక బరువుకూ కారణమవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్