చేయందించాలి..
అనన్య భర్త కొన్ని రోజులుగా మాట్లాడటం తగ్గించాడు. కారణం తెలియక, ఏం చేయాలో అర్థంకాక ఆందోళనకు గురవుతోందామె.
అనన్య భర్త కొన్ని రోజులుగా మాట్లాడటం తగ్గించాడు. కారణం తెలియక, ఏం చేయాలో అర్థంకాక ఆందోళనకు గురవుతోందామె. దంపతుల్లో ఏ ఒక్కరు ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుకు గురైనా.. రెండో వారు చేయి అందించి నేనున్నాననే భరోసా ఇస్తేనే ఆ దాంపత్యం సంతోషంగా సాగుతుందంటున్నారు నిపుణులు.
కుటుంబ విషయాలే కాకుండా స్నేహితులు, ఆఫీస్ ఒత్తిడి కూడా దంపతుల్లో ఎవరో ఒకరిని బాధించొచ్చు. సన్నిహితుల నుంచి సమస్యలెదురవ్వొచ్చు. వాటిని పరిష్కరించుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతారు. భాగస్వామితో పంచుకుంటే వారెలా తీసుకుంటారో అనే భయం పైకి చెప్పనివ్వదు. భరించే స్థాయి దాటినప్పుడు కొన్ని సందర్భాల్లో కుంగుబాటుకు దారి తీస్తుంది. ఈ వాతావరణాన్ని వెంటనే దంపతుల్లో ఎదుటివారు గుర్తించగలగాలి. తనకు సంబంధించిన విషయం అయ్యుంటుందని వదిలేయకుండా అనునయంగా తెలుసుకోవాలి. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందని ధైర్యం చెప్పాలి. నేనున్నానే భరోసా కల్పించాలి. అప్పుడే మనసులోని ఇబ్బందిని బయటికి చెప్పే ధైర్యం వారికి వస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి చర్చించుకుని, పరిష్కరించు కోవడానికి ప్రయత్నిస్తే చాలు.
వదిలేయకూడదు..
మహిళలకు కుటుంబ బాధ్యతలతోపాటు శారీరక సమస్యలెన్నో వస్తుంటాయి. నెలసరిలో ఒత్తిడి, ఆందోళన, గర్భం దాల్చినప్పుడు, ప్రసవం తర్వాత, మెనోపాజ్, పిల్లల పెంపకంలో రకరకాల శారీరక, మానసిక సమస్యలెదురవుతాయి. ఇవన్నీ కలిపి ఏదో ఒక సమయంలో కుంగుబాటుకు దారితీస్తాయి. సాధారణ ప్రవర్తనకు భిన్నంగా భాగస్వామి ఒంటరిగా, ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే చూసీచూడనట్లు వదిలేయకూడదు. ఆ సమస్యకు మీరెలా సహాయపడగలరో అడగాలి. వారు చెప్పేది పూర్తిగా విని, ఏ సహాయం కావాలో తెలుసుకొని వెంటనే చేయూతనందించాలి. ఆ సాయంతో వారు తిరిగి మామూలు మనిషి అవుతారు. శారీరక అనారోగ్యానికి చికిత్సనిప్పించి వదిలేయకుండా భాగస్వామి మానసిక స్థితినీ అంచనా వేసి భరోసా అందించాలి. అప్పుడే ఆ దంపతుల అనుబంధం మరింత గట్టిపడుతుంది.
కెరియర్‌లో..
ఉద్యోగ బాధ్యతల్లో ఎదురయ్యే సమస్యలెన్నో ఆందోళన కలిగిస్తుంటాయి. దంపతుల్లో ఏ ఒక్కరైనా ఇలా ఒత్తిడికి గురవుతుంటే ఎదుటివారు గుర్తించాలి. నీదే తప్పు అయ్యుంటుందని ఆరోపించకుండా సమస్యను రెండు వైపుల నుంచి ఆలోచించాలి. ఏది ఏమైనా భాగస్వామిగా తోడున్నాననే నమ్మకాన్ని అవతలివారిలో కలిగించాలి. ఎక్కువ సమయం వారికి కేటాయిస్తే చాలు. ఆ దాంపత్యం సంతోషంగా సాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.