మొదటి ఒప్పందానికి ఏడునెలలు పట్టింది!

అమ్మకొచ్చిన క్యాన్సర్‌... ఆమె ఆలోచనల్ని మార్చింది... భవిష్యత్తులో తనకూ ఆ ముప్పు పొంచి ఉందన్న విషయం... పర్యావరణహిత అలవాట్లను నేర్పించింది. అయినా తను మారితే సరిపోదు... వ్యవస్థలోనూ అది కావాలనుకుంది.

Updated : 07 Aug 2023 06:55 IST

అమ్మకొచ్చిన క్యాన్సర్‌... ఆమె ఆలోచనల్ని మార్చింది... భవిష్యత్తులో తనకూ ఆ ముప్పు పొంచి ఉందన్న విషయం... పర్యావరణహిత అలవాట్లను నేర్పించింది. అయినా తను మారితే సరిపోదు... వ్యవస్థలోనూ అది కావాలనుకుంది.

అందుకే వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ సంస్థను నెలకొల్పి... సంస్థలు ఉత్పత్తి చేసే ప్లాస్టిక్‌ని రీసైక్లింగ్‌ చేయడమే కాదు...ప్రత్యామ్నాయాలను పాటించేలా చేస్తోంది. ఆమే దిల్లీకి చెందిన భాగ్యశ్రీ భన్సాలీ. అదెలాగో తెలుసుకుందామా!

భాగ్యశ్రీది దిల్లీ. నోయిడాలోని గల్గోతియా యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు. ‘ఉన్నత చదువులకు వెళ్లాలన్న ఆలోచనల్లో ఉన్నప్పుడే తల్లి క్యాన్సర్‌ బారిన పడి కోలుకోవడం, తనకూ భవిష్యత్తులో ఆ ముప్పు పొంచి ఉంటుందన్న హెచ్చరికలు....ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ ఆలోచనలకు కారణమయ్యాయి’ అంటారామె. అప్పటి నుంచి వాడే ప్రతి వస్తువునీ పర్యావరణహితంగా ఎంచుకోవడం ఆరంభించారు. పెళ్లయ్యాక జయపురలోని అత్తింటికి మకాం మార్చారామె. ఆపై వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ గురించి తెలిసింది భాగశ్రీకి. అప్పటికి ఆ రాష్ట్రంలో ఒక్క ఆథరైజ్డ్‌ రీసైకిలర్‌ కూడా లేరన్న విషయం తెలిసింది. దాంతో ఆ పని తానే చేయాలనుకున్నారు. ఇందుకోసం వ్యర్థాలను మెరుగ్గా నిర్వహించే మార్గాలపై అధ్యయనం చేశారు. ఆ నగరంలోని వేస్టేజ్‌ నిర్వహణ గురించి తెలుసుకోవడానికి, దాన్ని వ్యాపారంగా మార్చుకోవడానికి ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి, కాలుష్య నియంత్రణ మండలిని సంప్రదించి వ్యాపార ప్రణాళికలు వేసుకున్నారు. ఈలోగా కొవిడ్‌ విజృంభించడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కొవిడ్‌ వ్యర్థాల నిర్వహణ కష్టతరంగా మారడం, కొత్తగా పుట్టుకొస్తోన్న కంపెనీలు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌లతో పోగవుతోన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు తనని కలవరపెట్టాయి. మరోపక్క పర్యావరణహిత ఉత్పత్తుల కొనుగోలుపై అందరూ ఆసక్తి చూపించడమూ మొదలయ్యింది. ఈ అవసరాలన్నింటినీ తీర్చడానికీ 2020లో ‘ది డిస్పోజల్‌ కంపెనీని’ ప్రారంభించారు భాగ్యశ్రీ.

ఏం చేస్తారంటే...

ఉత్పత్తి సంస్థలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్యాకేజింగ్‌ విధానాలను తీసుకొస్తుందీ సంస్థ. సాధ్యమైన చోట ప్లాస్టిక్‌ను ఎలా తొలగించాలనే విషయంపై అవగాహన కల్పించడం, వారు వాడే వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడం, వాటిని వివిధ ఉత్పత్తుల తయారీలో వినియోగించడం వంటివెన్నో చేస్తుందిది. భాగ్యశ్రీ ఇలా వివిధ సంస్థలకు పర్యావరణ, సామాజిక, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ (ఈఎస్‌జీ) కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇలా ఏటా 750 టన్నుల ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేస్తున్నారు. వాటిని గ్రాన్యూల్స్‌గా మార్చి ఫోటో ఫ్రేమ్‌లు, బొమ్మలు వంటి ఉత్పత్తులెన్నో తయారు చేస్తున్నారు. ఇక్కడ రీసైకిల్‌ చేయలేని మిక్స్‌డ్‌ ప్లాస్టిక్‌ను ఎనర్జీగా మార్చే ప్లాంట్‌కు పంపుతారు.

ప్రముఖ సంస్థలెన్నో...

ఈ సంస్థ ప్రారంభ పెట్టుబడి రూ.75లక్షలు. తర్వాత యాక్సెంచర్‌ సస్టైనబిలిటీ యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌లో ఎంపికవడంతో రూ.60 లక్షల సీడ్‌ ఫండ్‌ లభించింది. ఐదుగురు వర్కర్లతో మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు 500 మంది పనిచేస్తున్నారు. ‘ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్‌ విషయంలో పర్యావరణహిత అనుకూల విధానాలతో ఆయా సంస్థలు మార్కెట్‌ పోటీని తట్టుకోగలిగేలా చేయడం అంత సులువేం కాదు. మొదటి క్లయింట్‌ ‘ఎంకెఫీన్‌’ను పొందడానికి నాకు ఏడునెలలు పట్టింది అంటారామె. ప్రస్తుతం ఈ సంస్థకు భారతదేశంతో పాటు సింగపూర్‌ యూకే వంటి పలు దేశాలకు చెందిన  70 బ్రాండ్‌లతో పనిచేస్తోంది. ఖాతాదారులుగా మెకాఫీన్‌, స్లర్ఫ్‌ ఫార్మ్‌, ద సాలెడ్‌ స్టోర్‌, బోంబే షేవింగ్‌ కంపెనీ, బ్లూ, టోకాయ్‌ కాఫీ, స్లే కాఫీ వంటివెన్నో ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని