విహంగ సోయగాలు...

ఇల్లు అందంగా ఉండాలంటే ఖరీదైన ఫర్నిచరో, వస్తువులో ఉండక్కర్లేదు. కాస్త సమయం, ఓపిక ఉంటే చాలు... చిన్న చిన్న వస్తువులతో కూడా కళాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు.

Updated : 25 Mar 2022 05:59 IST

ఇల్లు అందంగా ఉండాలంటే ఖరీదైన ఫర్నిచరో, వస్తువులో ఉండక్కర్లేదు. కాస్త సమయం, ఓపిక ఉంటే చాలు... చిన్న చిన్న వస్తువులతో కూడా కళాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎలా అంటారా?... ఇలా చేస్తే... పిట్ట చూడు.. పిట్ట అందం చూడు అంటారు మీరే!

ఎండిన కొమ్మలతో... ఒక పెద్ద ఎండిన కొమ్మ, వృథా అట్టలు, ఫ్యాన్సీగా పక్షుల బొమ్మలుంటే చాలు. గోడకు అందమైన పక్షి గూళ్లను తయారు చేసి అలంకరణగా తీర్చిదిద్దొచ్చు. ముందుగా అట్టతో గూళ్లను తయారు చేసి రంగులద్దాలి. ఫ్యాన్సీగా కొన్న పిచ్చుకలు సహా రకరకాల పక్షులను ఆ గూళ్లలో, కొమ్మపై సర్దాలి. ముందుగా గూళ్లను గోడకు జిగురుతో అంటించి, వాటికి పైన వచ్చేలా కొమ్మను కూడా గోడకు అటాచ్‌ చేస్తే చాలు. ఇంట్లో రకరకాల పక్షులు వచ్చి వాలినట్లుగా అనిపిస్తూ గదికి కొత్త అందాన్ని తెస్తుంది.  

గది మధ్యలో... వృథా అట్టతోపాటు ముఖ్‌మల్‌లా అనిపించే మెత్తని వస్త్రాన్ని రంగు రంగుల్లో తీసుకోవాలి. చిలకల బొమ్మలను తెచ్చుకోవాలి. అట్టతోపాటు ముఖమల్‌ షీటును కలిపి పక్షి గూళ్లు చేసుకోవాలి. వీటి ముంగిట పక్షుల బొమ్మలను అతికించాలి. గూడుపై రంగు రంగుల పూలనూ అలంకరించొచ్చు. వీటికి అడుగున కూడా అట్ట అంటించాలి. ఈ గూళ్లకు పైన రెండుమూడు వర్ణాల లేసులు కట్టి గది మధ్యలో వేలాడదీస్తే గాలికి ఊగుతూ ఎంత బాగుంటాయో.

వేలాడుతూ... 10, 15 అంగుళాలు పొడవుండే మూడు కర్రలు తీసుకోవాలి. కాగితంతో చిలక, మైనా, గోరింక వంటి పక్షులను చేసుకుని రంగులద్దాలి. కాగితం పూలు, ఆకులను సిద్ధం చేసుకోవాలి. చిత్రంలో చూపినట్లుగా కర్రలను అడ్డంగా ఉంచి, రెండు అంగుళాల ఎత్తు తేడాతో ఒకే తాడుకు వరుసగా కట్టాలి. మిగిలిన తాడును మేకుకు తగిలించేలా త్రికోణంగా ముడివేసుకోవాలి. ఇప్పుడు ఆ కర్రలపై పక్షులను జిగురుతో అతికించాలి. పూలను కూడా కొమ్మల చివర అతికిస్తే చాలు. గోడకు వేలాడే అందమైన ఫ్రేం సిద్ధం. పిట్టలన్నీ కబుర్లు చెప్పుకొంటున్నట్లుగా చూడముచ్చటగా ఉంటుంది. ఇది ముందుగదికైతే మరింత అందాన్నిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్