సరికొత్త ఉగాదులు.. కావాలి!

ఉగాది పచ్చడిలో తీపి, కారం, చేదు, వగరు, పులుపు, ఉప్పు ఉన్నట్టే... మన జీవితాల్లోనూ ఆనందాలు, అలకలు, కోపాలు, తాపాలు కలగలసి ఉంటాయి. అందుకే ఆ పచ్చడిలోని షడ్రుచుల మర్మాన్ని

Updated : 02 Apr 2022 06:40 IST

ఉగాది పచ్చడిలో తీపి, కారం, చేదు, వగరు, పులుపు, ఉప్పు ఉన్నట్టే... మన జీవితాల్లోనూ ఆనందాలు, అలకలు, కోపాలు, తాపాలు కలగలసి ఉంటాయి. అందుకే ఆ పచ్చడిలోని షడ్రుచుల మర్మాన్ని గ్రహించాలి. అన్ని రుచులూ కలిసిందే జీవితం అని గుర్తెరగాలి. అప్పుడే చిన్నకష్టాలకే కుంగిపోకుండా... తాత్కాలిక ఆనందాలకే పొంగిపోకుండా అసలైన జీవితాన్ని ఆకళింపు చేసుకుంటాం. అలా మనం ఎదుర్కొనే ఉగాది రుచులేంటో చెబుతోన్న ఓ ఆడపిల్ల అంతరంగం ఇదీ...

* నేను పుట్టినప్పుడు ఇల్లంతా ఆనందమే! మహాలక్ష్మి పుట్టిందంటూ అపురూపమే. కాస్త బరువూ ఎత్త నివ్వలేదు. ఎండపొడ తాకనివ్వలేదు. నాకోసమంటూ కొత్త వస్త్రాలు. భవిష్యత్‌కు పనికొస్తుందని బంగారు ఆభరణాలు. నా బాల్యమంతా తీపే. ఎంతైనా ‘ఆడ’పిల్లననే ఆలోచన. మరి ఒక ఇంటి బాధ్యత భుజానికెత్తుకోవాలంటే.. చిన్నప్పటి నుంచే బరువు తెలియాలి కదా! అయినా అందం చూసుకోవడానికీ, బంగారు బొమ్మలా కూర్చోవడానికే నేనెందుకు పరిమితమవ్వాలి? అన్నీ ముందే అమర్చడం కాకుండా ఏదైనా సాధించమని ప్రోత్సహించి... దానిలోని ఆనందాన్ని నాకు పరిచయం చేయండి. సుకుమారిని కాక నాయకురాలిని చేయండి. అదే నిజమైన తీపి.

* యవ్వనంలోకి అడుగుపెడతానా... అప్పటిదాకా ఉన్న గారాబం ఆవిరైపోతుంది. నడక, మాట, దుస్తులు, స్నేహితులు.. అన్నింటా ఆంక్షలే. ఇంటి పనులు అలవాటు చేసుకోమంటారు. బయటికి వెళ్లాలంటే బోలెడు ఆంక్షలు... అనుమతులు...
ఇప్పటిదాకా అరచేతిలోనే కదా పెరిగాను. ఇంట్లోనే ఉండిపోతే సమాజాన్ని ఇంకెప్పుడు అర్థం చేసుకోగలను? సవాళ్లను ఎలా అధిగమించగలను? నిజమే.. తడబడే వయసే! తప్పటడుగులకు ఆస్కారమెక్కువ. కానీ అడుగే వేయకపోతే నేర్చుకునేదెలా? మార్గం మూయక.. మార్గనిర్దేశం చేయండి. ఉగాది పచ్చడిలో పులుపు మర్మమదే కదా! సమాజాన్ని అర్థం చేసుకునే నేర్పు, సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం.. నేర్పండి... నేర్చుకోనివ్వండి.

* నీకేనంటూ దాచేదంతా కట్నం కోసమే! దాని కోసం నచ్చిన చదువు ఖరీదైతే దాన్ని మార్చుకోవాలి. అదే అబ్బాయి విషయంలో ఎంత కష్టపడైనా చేర్పించేస్తారు.

నా గమ్యం మరో ఇంటికి చేరడమేనా? సమానత్వం ఇంట్లోనే కరవైతే.. బయట నా హక్కుల కోసం ఎలా పోరాడగలను? మీరు చూపే భేదభావమనే చేదు మరెవరూ పోగొట్టలేరని తెలుసా? పెళ్లి కోసమో, కట్నకానుకల కోసమో కాదు.. నా భవిష్యత్‌ కోసం కేటాయించండి. నేనూ మీరు గర్వపడే వారసురాలినవుతా.

* చదువు పూర్తవగానే ఉద్యోగం.. ఆ వెంటనే పెళ్లి. ఇక స్వేచ్ఛ కాస్తా ఆవిరి. పిల్లలతో పెరిగే బాధ్యతలు. పిల్లలకు, భర్త అడుగు బయటపెట్టే వరకూ అన్నింటినీ సమయానికి అందించాల్సిందే. మరి నాకంటూ నేను గడిపిన సమయమేది? పైగా పెళ్లి పేరుతో కొత్త ఇల్లు, వాతావరణం, మనుషుల మధ్యకు వచ్చా. కొంత మమకారం పంచండి... అత్తాకోడళ్లకు పడదన్నమాటనే తుడిపేద్దాం. తల్లీకూతుళ్లలా గడిపేద్దాం. మామగారి గాంభీర్యం పక్కన పెట్టి, నాన్నలా మాట కలపండి. మనమే ఓ జట్టు అవ్వొచ్చు. అలాకాక ఎవరికివారు ‘మీ ఇల్లు’ అంటూ వేరు చేయకండి. ఆ చిన్న మాట చేసే గాయం మాటల్లో చెప్పలేనిది. అప్పుడప్పుడూ పనులు పంచుకోండి... నాకూ కాస్త సులువవుతుంది! అలసిపోయి చేరడానికి రెండు ఇళ్లు, కుటుంబాలు ఉన్నాయన్న భరోసా ఇవ్వండి. అయినా తాలింపులో చిటపటల్లా చిన్న పొరపొచ్చాలొస్తాయి. వాటినీ వంటలో ఉప్పులా... ఆస్వాదిద్దాం!

* వ్యాపారంలో అనుకోని నష్టం. ఆర్థిక ఇబ్బందులు. ఫర్లేదు నేనున్నా కదా అంటాన్నేను. మీరేమో ‘నీ మీద ఆధారపడాలా’ అంటారు. ఆలుమగలు బంధంలో మనిద్దరం సమానమేగా. కాదా అన్న శంక నిరాశపరుస్తుంది. నేనూ చదువుకున్నా, సంపాదించగలను. భర్త మాత్రమే తేవాలన్న నియమమేమీ లేదు కదా! రెంటికి మరో రెండు చేతులు కలిస్తే పని సులువవుతుందన్న ప్రయత్నమే. ఆర్థిక విషయాలు నాకేం తెలుస్తాయన్న అనుమానం ఎందుకు? నెలవారీ బడ్జెట్‌ తప్పకుండా ఇల్లు నడపడమూ ఓ కళే. నా దారంతా వగరంటి సవాళ్లే.. దాటడం లేదూ. చర్చించి చూడండి.. అప్పుడేగా నా సలహా విలువ తెలిసేది!

* పనిలో ఉండి కాస్త అసహనం చూపానా.. ఆయన గారికి కోపమొస్తుంది. అభిప్రాయంతో ఏకీభవించలేదూ.. పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వలేదనే పేరు. కాస్త గట్టిగా చెప్పానా.. పిల్లలకు ఓ లేడీ హిట్లర్‌ని. గృహిణిని అయితే ఇంట్లో పనులేగా అనేస్తారు. ఉద్యోగిని అయితే ఆఫీసువి అదనం. నిరంతర పని, అలసట, ఒత్తిడి దీనికి తోడు శారీరక మార్పులు. నా అసహాయతనీ, అసహనాన్నీ ఇంకెక్కడ ప్రదర్శించను? నా అన్నవాళ్ల దగ్గరే కదా. ఇక్కడ గౌరవ మర్యాదల ప్రస్తావనెందుకు? ఆ క్షణం కాస్త ఓపిక పట్టండి. కారం లాంటి ఆ క్షణాన్ని దాటితే రెట్టింపు ప్రేమాభిమానాలు అందించనూ!


నేను లేకపోతే క్షణం గడవనిది మీకే! మరి నాకూ కొంత తిరిగివ్వాలి కదా! ఉగాది అంటే కొత్త ప్రారంభం.. ఇప్పటి నుంచి నాకూ ఓ కొత్త మార్పును ఇవ్వండి. ఉగాది పచ్చడిలోని రుచుల పరమార్థాన్ని జీవితంలోనూ ఆస్వాదించనివ్వండి. అందరికీ శుభకృత్‌ ఉగాది శుభాకాంక్షలు...


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్