బకెట్‌లో ఎరువులు.. బాల్కనీలో పూలు

ఇంట్లో పెంచుకునే మొక్కలకు అవసరమయ్యే సహజ ఎరువును బకెట్‌ కంపోస్టింగ్‌ విధానం ద్వారా సులువుగా తయారు చేసుకోవచ్చు.

Published : 09 Aug 2023 00:25 IST

ఇంట్లో పెంచుకునే మొక్కలకు అవసరమయ్యే సహజ ఎరువును బకెట్‌ కంపోస్టింగ్‌ విధానం ద్వారా సులువుగా తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే...

ఏరోబిక్‌ కంపోస్టింగ్‌గా పిలిచే బకెట్‌ కంపోస్టింగ్‌కు ముందుగా మూత ఉన్న బకెట్‌ను ఎంచుకోవాలి. దీనికి అడుగున, చుట్టుపక్కల మూతకు చిన్నచిన్న రంధ్రాలు చేయాలి. ఇందులో బ్రౌన్‌, గ్రీన్‌, యాక్సిలరేటర్‌, మాయిశ్చర్‌ అంటూ నాలుగు పొరలుగా ఎరువుకు కావాల్సిన పదార్థాలు వేయాలి. మొదటి పొర బ్రౌన్‌కు ఎండిన ఆకులు, పాతమట్టి, కొబ్బరిపీచు, దినపత్రికలు, కార్డ్‌బోర్డు వేయాలి. గ్రీన్‌ పొర కోసం కూరగాయలు, ఆకుకూరల వృథా, పండ్ల తొక్కలు, తోటలో రాలిన ఆకులు, కోడిగుడ్డు పెంకులు సర్దాలి. మూడో పొర యాక్సిలరేటర్‌ కోసం పెరుగు, పులియబెట్టిన కడుగుతోపాటు పాతమట్టి వేయాలి. దీనిపై రాలిన ఆకులు వేసి కొంచెం నీటిని చల్లితే మాయిశ్చర్‌ అవుతుంది. ఆపై బకెట్‌కు మూత పెట్టేయాలి.

ఆరనిచ్చి..

వారానికొకసారి బకెట్‌ లోపలి పదార్థాలను కలుపుతూ తిరగేస్తూ.. గాలి తగిలేలా చేయాలి. బకెట్‌ మూతను తెరిచిన ప్రతిసారీ రాలిన ఆకులు, కూరగాయల వ్యర్థాలను వేసి నీటిని చల్లుతుండాలి. పూర్తిగా నీడలోనూ, అలాగే ఎండలోనూ ఉంచకుండా, బాల్కనీ మూలల్లో ఉంచితే చాలు. బకెట్‌ చుట్టూ కీటకాలున్నట్లైతే మరిన్ని రాలిన ఆకులు వేసి నీటిని తక్కువగా చిలకరించాలి. అప్పుడు వాటి బెడద ఉండదు. రెండున్నర నెలలకు ఎరువు సిద్ధమవుతుంది. దీన్ని జల్లెడపట్టి.. పుల్లలు, ఆకులు వంటి వాటిని రెండోసారి చేసే బకెట్‌ కంపోస్టింగ్‌కు వినియోగించుకోవచ్చు. వడకట్టగా వచ్చిన సేంద్రియ ఎరువును రెండు రోజులపాటు నీడలో తడి లేకుండా ఆరనిచ్చి భద్రపరుచుకోవాలి. దీన్ని మట్టిలో కలిపి మొక్కలకు ఎరువుగా వేస్తే సరి. బాల్కనీ గార్డెన్‌కు పోషకాలు అంది ఆకుకూరలు, పూలు కూరగాయలతో కళకళలాడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని