ఒంటరిగా వెళుతున్నారా?

పర్యాటక ప్రాంతాలు, కొత్త ప్రదేశాలు చుట్టి రావాలి.. ప్రకృతిలో గడపాలని అనుకునేవారికి వేసవి సరైన సమయం. అయితే ఒంటరిగా వెళ్లాలనుకుంటున్నారా? కొన్ని చిట్కాలు, ముందస్తు జాగ్రత్తలు అవసరం అంటున్నారు నిపుణులు.

Updated : 24 Apr 2023 00:25 IST

పర్యాటక ప్రాంతాలు, కొత్త ప్రదేశాలు చుట్టి రావాలి.. ప్రకృతిలో గడపాలని అనుకునేవారికి వేసవి సరైన సమయం. అయితే ఒంటరిగా వెళ్లాలనుకుంటున్నారా? కొన్ని చిట్కాలు, ముందస్తు జాగ్రత్తలు అవసరం అంటున్నారు నిపుణులు.

ఎంచుకున్న ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ముందుగానే తెలుసుకోవాలి. వస్త్రధారణ నియమాలనూ తెలుసుకొని దానికి అనుగుణంగా దుస్తులను ఎంచుకోవాలి. వేడి ప్రాంతమా? తేలికగా, దూర ప్రాంతాలకు ప్రయాణించినా సౌకర్యవంతంగా ఉండేలా వస్త్రాలకు ప్రాధాన్యమివ్వాలి. పర్వతారోహణ, ఈత వంటివి ఏం చేయాలనుకున్నా తగ్గవి తీసుకెళ్లాలి.

ఆరోగ్యం.. పర్యటించే ప్రాంతాల్లోని ప్రత్యేక వంటకాలను రుచి చూడొచ్చు. అయితే ఎంత రుచిగా ఉన్నా నియంత్రణ తప్పదు. ఇంకా పోషకాలు అందుతున్నాయో లేదో కూడా చెక్‌ చేసుకోవాలి. ఎండలకు డీహైడ్రేట్‌ కాకుండా నీరు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే తిరిగొచ్చాక అనారోగ్యం పాలవకుండా ఉంటారు. చర్మ పరిరక్షణకీ ప్రాధాన్యమివ్వాలి. సన్‌స్క్రీన్‌ లోషన్‌, సన్‌గ్లాసెస్‌ వంటివి తీసుకెళ్లండి.

సురక్షితంగా.. ఆనందంలో పడి అప్రమత్తత మరవొద్దు. పరిసర ప్రాంతాలను నిత్యం గమనించుకోవాలి. తెలియని ప్రాంతంలో రాత్రిళ్లు ఒంటరిగా తిరగొద్దు. పర్యటన ఏదైనా పగలే సాగేలా చూసుకుంటేనే సురక్షితం. వెళ్లే ప్రాంతంలో రక్షణ గురించి తెలుసుకోవాలి. అత్యవసర నంబర్లనూ సేకరించుకుంటే ఇంకా మంచిది. అపరిచితుల సాయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మరీ తప్పదనుకుంటే ఇంట్లో వాళ్లకి వాళ్ల ఫొటో, నంబరు వంటివి పంపడం లాంటివి చేస్తే అవతలి వాళ్లూ జాగ్రత్తగా ఉంటారు.

రవాణా.. ప్రభుత్వ రవాణాకే ప్రాధాన్యతనివ్వాలి. ఆ అవకాశం లేకపోతే యాప్స్‌లో రైడ్‌ షేరింగ్‌ను ఎంచుకోవచ్చు. వెళ్లబోయే ప్రాంతాల మ్యాప్‌లను సిద్ధం చేసుకుంటే ఎంత సమయం పడుతుందన్న వాటిపై అవగాహన ఉంటుంది. స్థానికంగా నమ్మదగ్గ రవాణా సంస్థల గురించీ ముందుగానే పరిశోధించుకోవాలి. ఇందుకు రివ్యూలు సాయపడతాయి. విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లొద్దు. అనవసర ప్రమాదాలుండవు. కాస్త జాగ్రత్త, ముందస్తు సంసిద్ధతతో వెళితే.. మీ ప్రయాణం మధురమైన జ్ఞాపకంగా మారడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్