తన ఈ-రిక్షా... కరోనా బాధితులకు సురక్ష...

పశ్చిమబంగలోని సిలిగురిలో తొలి ఈ రిక్షా డ్రైవర్‌గా నిలిచిన 49 ఏళ్ల మున్‌మున్‌ సర్కార్‌... తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కింది. కరోనా రోగులను తన వాహనంలో ఉచితంగా ఆసుపత్రులకు తరలిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. 

Published : 05 Jul 2021 00:41 IST

పశ్చిమబంగలోని సిలిగురిలో తొలి ఈ రిక్షా డ్రైవర్‌గా నిలిచిన 49 ఏళ్ల మున్‌మున్‌ సర్కార్‌... తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కింది. కరోనా రోగులను తన వాహనంలో ఉచితంగా ఆసుపత్రులకు తరలిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

మున్‌మున్‌ సర్కార్‌ కుటుంబ పోషణ కోసం ఈ-రిక్షా నడపడం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నం ఆమెను సిలిగురి తొలి మహిళా ఈ-రిక్షా డ్రైవరుగా నిలిపింది. ఆమే కరోనా మొదటి వేవ్‌లో రోగులపై సామాజిక వివక్షను చూసి చలించింది. ముఖ్యంగా అత్యవసర సర్వీసులకు వేల రూపాయలు చెల్లించాల్సి రావడంతో పేద, మధ్యతరగతి వర్గాలు పడుతోన్న ఇబ్బందులు ఆమెను ఆలోచింపజేశాయి. దాంతో తన ఈ-ఆటోరిక్షాను అంబులెన్స్‌గా మార్చి రోగులను ఉచితంగానే ఆసుపత్రులకు తరలించడం మొదలుపెట్టింది. దాతల సాయంతో శానిటైజేషన్‌ యంత్రం కొని రోగుల ఇళ్లు, పోలీస్‌స్టేషన్లు, శ్మశానాలు, ప్రార్థనా మందిరాలను ఉచితంగా శుద్ధి కూడా చేసేది.

రెండో దశలోనూ వ్యాధి లక్షణాలున్న వారిని నిర్ధారణ పరీక్షాకేంద్రాలకు తీసుకెళ్లడం, అలాగే రోగులను ఆసుపత్రికి తరలించడం, వ్యాధి తగ్గినవారిని ఇళ్లకు చేరుస్తోంది. ఇదంతా ఉచితంగా చేస్తూ, సమయం ఉన్నప్పుడు సాధారణ ప్రయాణికులను వారి గమ్యాలకు చేరుస్తోంది. అయితే కరోనా రోగులను తరలిస్తున్నానని తన ఆటోలో ప్రయాణించడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదని వాపోతోందీమె. ‘ఎప్పటికప్పుడు ఆటోను శానిటైజ్‌ చేస్తున్నా కూడా చాలామంది ప్రయాణికులు భయంతో వెనుకడుగు వేస్తున్నారు. దీంతో నెలకు రెండుమూడు వేలు కూడా రావడం లేదు. అయినా నా సేవలను మాత్రం ఆపలేదు. ఇవన్నీ చేయడానికి ముందు మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నెమ్మదిగా వారికి నచ్చజెప్పగలిగా. ఇప్పుడు మావారు, మా ఇద్దరు పిల్లలు నన్ను ప్రోత్సహిస్తున్నారు. పీపీఈ కిట్‌ ధరించి, కరోనా రోగులను దింపిన ప్రతిసారీ ఆటోను శానిటైజ్‌ చేస్తా. జాగ్రత్తలు పాటించడంతో ఇప్పటివరకు నేను కొవిడ్‌ బారిన పడలేదు. సిలిగురిలో నాలుగేళ్లకిత్రం తొలి ఆటో రిక్షాడ్రైవరుగా మారిన సమయంలో చాలా విమర్శలెదుర్కొన్నా. మహిళలు అనుకున్న దాన్ని సాధించగలరని నేను నిరూపించాను. ఆ తరువాత దాదాపు 130 మంది మహిళలు ఈ రిక్షాలు నడుపుతూ కుటంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.. మాకందరికీ మార్గదర్శకురాలివని ఆ మహిళా డ్రైవర్లు అంటుంటే చాలా సంతోషంగా, గర్వంగా ఉంటుంది. ఏ మార్గంలోనైనా ధైర్యం చేసి ముందడుగు వేయాలి’ అంటోంది మున్‌మున్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్