రోగుల బాధలు విని ఏడ్చేదాన్ని...

‘క్యాన్సర్‌’ పేరు వినగానే చనిపోతామనే భయం. నిరాశ, నిస్పృహలతో నిండిపోయేవారు కొందరైతే.. చికిత్సను తీసుకోవడానికే నిరాకరించేవారు ఇంకొందరు. ఇంకెన్ని రోజులు మిగిలున్నాయోనని రోగులూ.. ఎప్పుడు ఏం వినాల్సొస్తుందోనని కుటుంబసభ్యులు భయంతో బతికేస్తుంటారు. అలాంటివారిలో ధైర్యం నింపుతున్నారు గంగా కన్యాకుమారి. భర్తను క్యాన్సర్‌ మహమ్మారి పొట్టనపెట్టుకుంటే.. ఆ బాధను

Published : 13 Jul 2021 02:14 IST

‘క్యాన్సర్‌’ పేరు వినగానే చనిపోతామనే భయం. నిరాశ, నిస్పృహలతో నిండిపోయేవారు కొందరైతే.. చికిత్సను తీసుకోవడానికే నిరాకరించేవారు ఇంకొందరు. ఇంకెన్ని రోజులు మిగిలున్నాయోనని రోగులూ.. ఎప్పుడు ఏం వినాల్సొస్తుందోనని కుటుంబసభ్యులు భయంతో బతికేస్తుంటారు. అలాంటివారిలో ధైర్యం నింపుతున్నారు గంగా కన్యాకుమారి. భర్తను క్యాన్సర్‌ మహమ్మారి పొట్టనపెట్టుకుంటే.. ఆ బాధను పక్కనపెట్టి, 16 ఏళ్లుగా బాధితులకు ఉచితంగా సేవలందిస్తున్నారు. ఆమె సేవా ప్రస్థానమిది!!

గంగా కన్యాకుమారిది నెల్లూరు. భర్త రామ్మూర్తి న్యాయవాది. ఆర్బిట్రేటర్‌గా పని చేసేవారు. రెండేళ్లు క్యాన్సర్‌తో పోరాడి ఆయన 2004లో మృతిచెందారు.  17 ఏళ్ల వయసులో పెళ్లి, తర్వాత బీఏ పూర్తి చేసినా గృహిణిగానే కొనసాగారామె. క్యాన్సర్‌ మరెంతో మందినీ కబళిస్తోందని తెలిసి, ఆ బాధితులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. తన వద్దనున్న రూ.10 లక్షలను నెల్లూరు రెడ్‌క్రాస్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి విరాళంగా అందజేశారు. అదే సమయంలో ఆ ఆసుపత్రి డైరెక్టర్‌ అరుణా చంద్రశేఖరన్‌తో పరిచయం ఏర్పడింది. ఆసుపత్రిలోని బాధితులకు సేవలు అందించాలన్న తన నిర్ణయాన్ని డైరెక్టర్‌తో చెప్పారు. ఆవిడ సంతోషించి, ముందుగా ‘పెయిన్‌ అండ్‌ పాలియేటివ్‌ కోర్సు’ చేయమని సూచించారు. 45 ఏళ్ల వయసులో కన్యాకుమారి హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో మూడు నెలలు ఆ కోర్సులో శిక్షణ పొందారు. 2005 నుంచి కౌన్సెలర్‌గా రోగులకు ఉచితంగానే సేవలు అందిస్తున్నారు. తన సేవలు, చిత్తశుద్ధి గమనించి రెడ్‌క్రాస్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి కమిటీ సభ్యురాలిగా తీసుకున్నారు.

అవగాహన సదస్సులు.. క్యాన్సర్‌ అనగానే చనిపోతామనే భయం ఉంటుంది. తీవ్ర నిరాశకు గురవుతారు. చికిత్స అనవసరమనే భావనకొస్తారు. అలాంటి వారితో మాట్లాడి ధైర్యం నింపడంతో పాటు చికిత్స తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారీమె. ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 2 గం.వరకు ఆసుపత్రిలోనే గడుపుతారు. రోగులు, వారి  బంధువులతో మాట్లాడతారు. వారితో ఎలా ప్రవర్తించాలి, అందించాల్సిన ఆహారం మొదలైన అంశాలపై బంధువులు, కుటుంబ సభ్యులకు సూచనలిస్తారు. ‘బాధితులకు కావాల్సింది జాలి కాదు. ఉన్న కొద్ది సమయాన్నీ ఆనందంగా గడపడం. కాబట్టి వారితో ప్రేమగా, జాగ్రత్తగా ఉండాలి’ అంటారు 61 ఏళ్ల కన్యాకుమారి. ఆసుపత్రి తరఫున ప్రతి మంగళ, శుక్ర వారాల్లో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలనీ ఆవిడ నిర్వహిస్తున్నారు. మొదట గ్రామాల్లో నిర్వహించగా పెద్దగా స్పందన లేకపోవడంతో కళాశాలలు, పాఠశాలల్లో ప్రారంభించారు. పిల్లల ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలన్నది ఉద్దేశం. అలా వందల సదస్సులు నిర్వహించారు. క్యాన్సర్‌ కారకాలు, నివారణాంశాలు, ఆహారం, చికిత్స మొదలైన అంశాలపై వీటిలో అవగాహన కల్పిస్తారు. అమ్మాయిలు చేయించుకోవాల్సిన పరీక్షలు, తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించీ చెబుతారు. ఫేస్‌బుక్‌లో ట్రెయిన్‌మేట్స్‌ పేరిట ఉన్న ఒక గ్రూపుతో ఈమెకి పరిచయం ఏర్పడింది. వారి ఆహ్వానం మేరకు కేరళలో సదస్సు నిర్వహించారు. అది విజయం సాధించడంతో బెంగళూరు, హైదరాబాద్‌ మొదలైన చోట్ల కూడా క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో రొమ్ము కోల్పోయిన వారికి అయిదేళ్లుగా మాస్టిక్టమీ బ్రాలను అందిస్తున్నారు. మొదట కొద్దిమొత్తాన్ని తీసుకుని ఇచ్చేవారు. తర్వాత జైన్‌ ట్రస్టు, విజయలక్ష్మి లేడీస్‌ క్లబ్‌, తన అక్క పిల్లలు నడుపుతున్న ‘ఫీడ్‌ ది హంగ్రీ ఫౌండేషన్‌’ సాయానికి ముందుకొచ్చాయి. వారి ఆసరాతో ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు. నెలకు 20 నుంచి 30 మంది వరకు వీటిని అందిస్తున్నారు. కన్యాకుమారి సేవలకు మెచ్చి పలు సంస్థలు పురస్కారాలనూ ప్రదానం చేశాయి. అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. రెడ్‌క్రాస్‌ నుంచి విశిష్ట సేవా పురస్కారం వంటివెన్నో అందుకున్నారు.

ఊపిరి ఉన్నంత వరకూ...: కన్యాకుమారి
నా భర్త చనిపోయాక డిప్రెషన్‌కు గురయ్యా. తోబుట్టువులు, స్నేహితుల సాయంతో దాన్నుంచి బయటపడ్డా. ఆయనకి ఈ ఊరంటే చాలా ఇష్టం. నేను పుట్టిందీ, మెట్టిందీ కూడా ఇదే. అందుకే ఇక్కడే సేవ చేయాలని నిర్ణయించుకున్నా. మొదట్లో రోగుల గాథలు విని ఏడ్చేసేదాన్ని. క్యాన్సర్‌ సోకిందని భార్యలను వదిలేసే వాళ్లు కొందరైతే.. విరక్తితో చిక్సితనూ పక్కన పడేసేవారు కొందరు. వారితో మాట్లాడి ధైర్యాన్ని నింపుతూ ఉంటా. చివరి దశలో ఉన్న వారికి మాత్రమే ప్రాణాపాయం. వారినీ ప్రేమగా ఆదరిస్తే జీవితకాలం పెంచొచ్చు. అదే బాధితుల కుటుంబాలకు చెబుతుంటా. ఈ భయం, నిరాశలను తొలగించాలని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ టి.లక్ష్మితో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నా ఊపిరున్నంత వరకూ వీటిని కొనసాగిస్తా.

ఓసూరి మురళీకృష్ణ, నెల్లూరు


నిన్ను నువ్వు నిత్యం ఉత్సాహపరుచుకుంటూ ముందడుగు వేయాలి. ఎందుకంటే నీ కోసం ఎవరూ నడవరు.

- కాజల్‌ అగర్వాల్‌, నటి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్