చదువులో బంగారు ప్రేరణ

44 ఏళ్ల వయసులో చదువుని తిరిగి మొదలుపెట్టడం అంటేనే గొప్ప! అలాంటిది... ఫస్ట్‌ర్యాంకు సాధించి బంగారు పతకం అందుకోవాలంటే ఇంకెంత పట్టుదల ఉండాలి? వైజాగ్‌కి చెందిన ప్రేరణ అటువంటి గొప్ప విజయాన్నే సాధించారు. ఐఐఎం వైజాగ్‌ నుంచి రెండు బంగారు పతకాలు సొంతం చేసుకున్న ఆమె పేరుకు తగ్గట్టుగా ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తిని నింపుతున్నారు...

Updated : 10 Aug 2021 04:52 IST

44 ఏళ్ల వయసులో చదువుని తిరిగి మొదలుపెట్టడం అంటేనే గొప్ప! అలాంటిది... ఫస్ట్‌ర్యాంకు సాధించి బంగారు పతకం అందుకోవాలంటే ఇంకెంత పట్టుదల ఉండాలి? వైజాగ్‌కి చెందిన ప్రేరణ అటువంటి గొప్ప విజయాన్నే సాధించారు. ఐఐఎం వైజాగ్‌ నుంచి రెండు బంగారు పతకాలు సొంతం చేసుకున్న ఆమె పేరుకు తగ్గట్టుగా ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తిని నింపుతున్నారు...

దివితే ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ (ఐఐఎం)లోనే చదవాలన్నది ప్రేరణ బైద్‌ చిన్ననాటి కల. కానీ దాన్ని సాకారం చేసుకోవడానికి రెండున్నర దశాబ్దాలు పట్టిందామెకు. పెళ్లైన తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే కాలం గడిచిపోయినా... ఆ భర్త, పిల్లల సహకారంతోనే తిరిగి ఐఐఎమ్‌లో అడుగుపెట్టానంటారామె. ‘నా స్వస్థలం రాజస్థాన్‌. జేెఈఈ రాయడం కోసం మూడేళ్లు కష్టపడ్డాను. వ్యక్తిగత కారణాల వల్ల ఆ పరీక్షలు రాయలేకపోయాను. బీబీఎమ్‌ డిగ్రీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంతలో పెళ్లి కావడంతో వైజాగ్‌ వచ్చేశా. మా వారు స్థాపించిన ఏసీఎన్‌ ఇన్ఫోటెక్‌లో డైరెక్టర్‌గా పాలుపంచుకున్నా. దానికోసం మూడేళ్లు పనిచేశా. తర్వాత ఇద్దరు అబ్బాయిలు... వాళ్ల పెంపకం, అత్తమామల బాగోగులు.. ఇంటి పనుల్లో పడి చదువుకోవాలన్న నా కల వాయిదా పడుతూ వచ్చింది. ఎంత పని ఉన్నా నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. బహుశా నా కలని ముందుకు నడిపించింది ఆ అలవాటేనేమో’ అని చెప్పుకొచ్చారు ప్రేరణ.

44 ఏళ్ల వయసులో తరగతిలో అడుగుపెట్టి... యువతరంతో పోటీపడుతూ మొదటి ర్యాంకు తెచ్చుకోవడం మాటలు కాదు. కానీ సాధించాలనే తపన ఉంటే వయసు ఆటంకం కాదంటారు ప్రేరణ. ‘మా పెద్దబ్బాయి అమెరికాలో ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్నాడు.. రెండో వాడు ఇంటర్‌ రెండో సంవత్సరం. 2018లో మా పెదబాబు కోసం కాలేజీలు తిరుగుతున్నప్పుడే నాకో విషయం తెలిసింది. ఐఐఎమ్‌ వైజాగ్‌... ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ని నిర్వహిస్తోందని. అది తెలిశాక చాలా సంతోషంగా అనిపించింది. టాప్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలన్న నా కలని నెరవేర్చుకోవాలని అనుకున్నాను. ఇంట్లో చెబితే... అత్తామామలు, ఆయన, పిల్లలు కూడా ప్రోత్సహించారు. అలా ఎగ్జిక్యూటివ్‌ కోటాలో పీజీ సీటు సాధించాను. వారాంతాల్లో మాత్రమే క్లాసులు ఉండేవి. ఆయన ఇంటి పనులు చూసుకుంటేే, నేను చదువుకునే దాన్ని. పేరుకు వారాంతపు క్లాసులే అయినా అసైన్‌మెంట్లు, పూర్తి చేయాల్సిన ఇతర ప్రాజెక్టులు వారంలో మిగిలిన ఐదు రోజులకూ సరిపడా ఉండేవి. క్షణం కూడా తీరికుండేది కాదు. ప్రొఫెసర్లు కూడా నేనే సమయంలో సందేహాలు అడిగినా ఓపిగ్గా సమాధానాలు చెప్పేవారు. రెండేళ్లు విరామం లేకుండా చదివా. తక్కిన వాళ్లతో పోలిస్తే నేనెక్కువ కష్టపడాలని నాకు తెలుసు. అందుకే చదువుని యజ్ఞంలా భావించాను. సరదాలు.. సంతోషాలు లేవు. కుటుంబ వేడుకలని తగ్గించేసుకున్నా.

నిజమే... ఈ వయసులో ఎవరికైనా చదువంటే కష్టమే. కానీ ఇష్టమైన పని కష్టంగా అనిపించదని నా అనుభవంలోంచే తెలుసుకున్నాను. ఆ ఇష్టమే నాకు రెండు బంగారు పతకాలను తెచ్చిపెట్టింది. ఒకటి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మొదటి ర్యాంకు సాధించినందుకు... మరొకటి స్కాలస్టిక్‌ (ఓవరాల్‌)పెర్‌ఫార్మెన్స్‌కు లభించింది. పిల్లల సహకారం లేనిదే ఈ విజయాన్ని సాధించలేకపోయేదాన్ని’ అనే ప్రేరణ త్వరలో ఒక స్టార్టప్‌ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ‘అనుభవం కోసం కొన్నాళ్లు ఏదైనా సంస్థలో పనిచేసి మంచి ఆలోచన రాగానే నా స్టార్టప్‌ కలని సాకారం చేసుకుంటా’ అంటున్నారు ప్రేరణ.

- ఎం.వి.కూర్మరాజు, ఈటీవీ, విశాఖపట్నం


విజయాలు సాధించినంత కాలమే అభినందనలు పొందగలుగుతావు. నువ్వు నిలబడిపోతే గతంలో నీ సాధనలను ప్రస్తావించరు. కనీసం కన్నెత్తికూడా ఎవరూ చూడరు. జీవితమూ అంతే. అందుకే ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉండాలి. మహిళ అంటే ఏదైనా సాధించగలదని చేసి చూపించాలి.

-  జులాన్‌ గోస్వామి, క్రికెట్‌ క్రీడాకారిణి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్