Updated : 17/09/2021 05:58 IST

ఆ ఇళ్లకు అమ్మాయిల పేర్లు

ఆడపిల్ల పుట్టిందంటే నట్టింట్లోకి మహాలక్ష్మి వచ్చిందనుకోవడం భారతీయ సంప్రదాయం. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో మరొక అడుగు ముందుకేసి, పుట్టిన ఆడపిల్లల పేర్లను ఆ ఇంటికి పెట్టి మరింత గౌరవాన్ని ఇస్తున్నారు.

ముడ్‌ఖేడ్‌, లోహా తదితర తాలూకాల్లోని పలు గ్రామాల్లో ఇంటి ‘నేమ్‌ప్లేట్‌’ చూస్తే చాలు. ఆ ఇంట్లోని కూతుళ్లు లేదా కోడళ్ల పేర్లు ఏంటో తెలిసిపోతాయి. మహిళల గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న ఆ ప్రాంతాల్లో ఈ తరహా సంప్రదాయం గత కొన్నేళ్లగా కొనసాగుతోంది. లింగవివక్షరహితంగా గ్రామాన్ని మార్చాలనే స్థానిక అధికారుల లక్ష్యమే మొత్తం 452 ఇళ్ల నేమ్‌ప్లేట్స్‌పై కూతుళ్లు లేదా కోడళ్ల పేర్లను ఉండేలా చేసింది. దాంతో కొందరికి కూతురు లేకపోయినా, వారింటికి వచ్చిన కోడలి పేరు రాసేలా అందరిలో తెచ్చిన అవగాహన ఇప్పుడు ప్రతి ఇంట్లో సంప్రదాయంగా మారింది. గ్రామాల్లోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రతి ఇంటికి గతంలో తండ్రి లేదా ఇంటిపెద్ద పేరు ఉండేది అని చెబుతుంది నాందేడ్‌జిల్లా పరిషత్‌ సీఈవో వర్షా ఠాకుర్‌. ‘మహిళాసాధికారతతోపాటు అమ్మాయిలకు అందించే గౌరవంలోనే అసలైన పరమార్థం ఉందంటూ అందరిలో అవగాహన తేవడానికి కృషి చేశాం. కూతురు పుడితే దాన్ని పండగలా చేసుకోవడం, అలాగే వారి పేరుకు ఇంటి నేమ్‌బోర్డులో స్థానాన్ని కల్పించడం వంటి అంశాలను అక్కడ ప్రచారం చేశాం. ఇది మహిళలను గౌరవించినట్లు అవుతుందని చెప్పేవాళ్లం. దీనికోసం ‘మై డాటర్‌...మై ప్రైడ్‌’ పేరుతో ప్రాజెక్టు చేపట్టాం.

నా గౌరవం నా కూతురు అని అర్థం వచ్చేలా మొదలుపెట్టిన ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ నిర్వహించాం. అవసరమైనవారికి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. అంతేకాదు, అలా పేర్లు పెట్టడానికి నేమ్‌బోర్డులను ఉచితంగా అందించాం. ప్రస్తుతం ఈ జిల్లాలోని తొమ్మిది తాలూకాల్లో దాదాపు 18 గ్రామాల్లో ఈ సంప్రదాయాన్ని పాటించేలా చేయగలిగాం. విజయవంతమైన ఈ ప్రాజెక్టు మరిన్ని మంచి ప్రయోజనాలకు కారణమైంది. గతంలో బాలికలు విద్యకు దూరంగా ఉండటం, బాల్యవివాహాలు, వరకట్న దురాచారం వంటివాటికి ఇక్కడ ఇప్పుడు చోటు లేదు. అంతగా వీరందరిలో అవగాహన పెరిగింది. అమ్మాయిలనూ మగపిల్లలతో సమానంగా చదివించడానికి వీరంతా ముందుకొస్తున్నారు. అయితే ఇది అంత సులభంకాలేదు. మొదట గ్రామ సర్పంచి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపెద్దలను కలిసి చర్చించాం. ఈ ప్రాజెక్టుపై అవగాహన కల్పించాం. మొదట అంగీకరించకపోయినా, క్రమేపీ అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజలను చేరుకోవడం తేలికైంది’ అని చెబుతున్న వర్షా లక్ష్యం... రాష్ట్రవ్యాప్తంగా ఈ పద్ధతిని తీసుకురావడం. బాల్యం నుంచి అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఈ సంప్రదాయం మరిన్ని గ్రామాల్లో విస్తరించాలని ఆశిద్దాం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని