Published : 04/10/2021 01:45 IST

లడ్డూ బాక్స్‌తో లక్షల ఆదాయం!

అమెరికాలో ఉన్నత చదువు.. మంచి కొలువు. ఇక్కడి యువత కల. డాలర్‌ దేశంలో స్థిరపడాలని ఉవ్విళ్లూరుతుంటారు. కష్ట నష్టాలకు ఓర్చుకుని మరీ స్వప్నం సాకారం చేసుకుంటారు. అయితే అలాంటి అవకాశాన్ని తన కల నేరవేర్చుకోవడానికి కాదనుకున్నారామె. వ్యాపార రంగంలోని ఒడుదొడుకులను తట్టుకుని విజయం దిశగా అడుగులేస్తున్నారు. ఆమే హైదరాబాద్‌కి చెందిన గోపు కవిత.  ఆ వివరాలను వసుంధరతో పంచుకున్నారిలా...

‘ఆలోచనల్లో స్థిరత్వం, లక్ష్యం చేరుకోగలమనే నమ్మకం’ ఉంటే...చాలు మనల్ని మనం నిరూపించుకోవడం సాధ్యమే. మాది సిద్ధిపేట. ఓయూలో ఎంటెక్‌ చేశా. ఎంఎస్‌ పూర్తిచేసి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సాందీప్‌తో పెళ్లయ్యాక అమెరికా వెళ్లిపోయా. దేశం కాని దేశం. రెండేళ్లపాటు అక్కడ నాలుగ్గోడల మధ్య ఉంటున్నామనే ఆలోచన. ఉద్యోగంలో కొనసాగితే అనుకున్నది సాధించలేమోననే భయం నన్ను వెంటాడేది. చదువుకున్నప్పటి నుంచీ వ్యాపారం చేయాలనేది నా లక్ష్యం. అక్కడే ఉంటే అది కలగానే మిగిలిపోతుందనే ఆలోచనతో తిరిగి హైదరాబాద్‌ వచ్చేశాం. ఆహార రంగంలోకి అడుగుపెట్టాలనుకున్నాం. తీపి పదార్థాలంటే అందరికీ ఇష్టమే. మేమిద్దరం కూడా వాటినే ఎక్కువగా తినేవాళ్లం. కానీ చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మలు చేసిపెట్టిన వంటకాల రుచి ఎక్కడా లేదు. మారిన జీవనశైలితో ఆరోగ్య స్పృహ పెరిగింది. ప్రజలు తిరిగి భారతీయ సంప్రదాయ రుచులను ఇష్టపడుతున్నారు. దీన్నే ఎందుకు ఆచరణలో పెట్టకూడదనే ఐడియాతో... కొద్దికాలం ప్రజల ఇష్టాయిష్టాలు.ఆహారపు అలవాట్లను అధ్యయనం చేశాం.

లడ్డూబాక్స్‌.. వచ్చిందిలా!

అమెరికాలో ఉద్యోగాలు వదలి వచ్చేశాం. ఎందుకీ వ్యాపారం బుద్దిగా కొలువు చేసుకోకుండా అంటూ పెద్దల సలహాలు. చేతిలో ఆరు నెలల పసికందు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా వెనకడుగు వేయకూడదనున్నాం. రంగులు, రసాయనాలు కలపకుండా పప్పుదినుసులు, తృణధాన్యాలు, నాణ్యమైన నెయ్యి, బెల్లంతో తీయటి పదార్థాలను అందించాలనే నిర్ణయానికి వచ్చాం. 2019 డిసెంబరులో ‘లడ్డూబాక్స్‌’ పేరుతో వ్యాపారం ప్రారంభించాం. పోచారం వద్ద రూ.లక్ష ఖర్చుతో లడ్డూల తయారీ ప్రారంభించాం. ఇన్ని చేసినా మార్కెటింగ్‌ పెద్ద సవాల్‌. షాపింగ్‌మాల్స్‌, రిటైల్‌ దుకాణాలు, ప్రదర్శనశాలల వద్దకెళ్లి మా లడ్డూబాక్స్‌ను పరిచయం చేసే ప్రయత్నం చేశాం. అదే సమయంలో నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో తొలిసారి స్టాల్‌ ఏర్పాటు చేశాం. ఒక గృహిణి.. మా స్టాల్‌ వద్దకు వచ్చి రుచి చూసి.. రెండు బాక్స్‌లు కొనుగోలు చేశారు.. మీరు ఇదే నాణ్యత అనుసరిస్తూ.. రుచిని అందిస్తే విజయం సాధిస్తారంటూ అభినందించటం మాకు మరింత ప్రోత్సాహం ఇచ్చింది. తర్వాత వెబ్‌సైట్‌ను రూపొందించి ఆన్‌లైన్‌ ఆర్డర్లూ తీసుకుంటున్నాం.

సంప్రదాయ ఆహారమే మేలు

కొవిడ్‌ సమయంలో ప్రొటీన్‌ ఆహారానికి డిమాండ్‌ పెరిగింది. అది మాకు బాగా కలిసొచ్చింది. ఐటీ, కార్పొరేట్‌ సంస్థల నుంచి కూడా ఆర్డర్లు రావటం మొదలైంది. కొరియర్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని చెన్నై, బెంగళూరు, ముంబయి, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. ఐటీ ఉద్యోగాలు వదిలేసి మిఠాయి కొట్టు పెట్టారంటూ విమర్శలు మొదలయ్యాయి. మరోవైపు వ్యాపారం కూడా విస్తరిస్తూ వస్తోంది. సుమారు 6000 మంది వినియోగదారులు రోజువారీ కొనుగోలుదారుల జాబితాలో చేరారు. రూ.60 లక్షల టర్నోవర్‌కి చేరుకున్నాం. ప్రస్తుతం యూనిట్‌లో 15 మంది పనిచేస్తున్నారు. వీరిలో 12 మంది మహిళలు.  ఉద్యోగిగా ఉన్నట్టయితే ఇంతమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉండేది కాదు కదా!  ఆహార ఉత్పత్తుల తయారీకోసం మిషనరీ తెచ్చినా.. వాటిని పక్కన పడేసి సంప్రదాయ పద్ధతినే అమలు చేస్తున్నాం.  మా రెండేళ్ల బాబు వివాన్‌ బాధ్యతను మా పెద్దలు తీసుకుని మాకు ప్రోత్సాహం అందిస్తున్నారు.

- గణాది సాంబశివరావు, హైదరాబాద్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని