వెలుగులు చిమ్ముతోన్న అరటినార

అర్ధరాత్రి ఆకాశంలో వెలిగే నక్షత్రాల్లా ఈ దీపాలు కాంతిని వెదజల్లుతాయి. ఆడంబరంగా కనిపిస్తూ మెరుస్తుంటాయి. ఆకర్షణీయంగా కనిపించే ఇవన్నీ ఏదో ప్రత్యేకమైన మెటీరియల్‌తో తయారయ్యాయి అనుకుంటే పొరపాటే.

Published : 19 Oct 2021 01:57 IST

అర్ధరాత్రి ఆకాశంలో వెలిగే నక్షత్రాల్లా ఈ దీపాలు కాంతిని వెదజల్లుతాయి. ఆడంబరంగా కనిపిస్తూ మెరుస్తుంటాయి. ఆకర్షణీయంగా కనిపించే ఇవన్నీ ఏదో ప్రత్యేకమైన మెటీరియల్‌తో తయారయ్యాయి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీటిని అరటినారతో చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వృథాతో వెలుగులు పూయిస్తోంది బెంగళూరుకు చెందిన జెన్నీ పింటో.

ముంబయిలోని సినీ ప్రపంచంలోకి డిజైనర్‌గా అడుగుపెట్టింది జెన్నీ. ఇరవై ఏళ్లు అక్కడే పనిచేసి... బెంగళూరులో స్థిరపడింది. హస్తకళలపై ఆసక్తితో కుండల తయారీ శిక్షణా తరగతులకు హాజరయ్యేది. ఓ రోజు హ్యాండ్‌మేడ్‌ పేపర్‌తో పలు రకాల కళాకృతులు చేయడమెలాగో ఎవరో చెబుతుంటే చూసింది. నచ్చి ఆ కోర్సులో చేరి నైపుణ్యాన్ని సంపాదించింది. కాగితంతో కాదు... వృథాని పునర్వినియోగిస్తే పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుంది కదా అనుకుంది జెన్నీ. అలా పంటవ్యర్థాలపై దృష్టిసారించింది. అరటితోటను తీసేసే సమయంలో అరటిమొక్కలన్నీ వృథాగా మట్టిలో కలిసిపోవడం గుర్తించింది. వీటిని రీసైకిల్‌ చేసి కాగితం తయారు చేయడమెలాగో నేర్చుకుంది జెన్నీ. రసాయనాల్లేకుండా, అరటినారను తన డిజైన్లకు ఎలా వినియోగించాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది.

వృథా నుంచి... ఈ నారతో ఎన్నో రకాల వస్తువులు రూపొందించవచ్చని అప్పుడే తెలుసుకుంది. వీటితో ఆధునికంగా, అందంగా కనిపించేలా కొన్ని దీపాల్ని తయారుచేసి అమ్మింది. ఇవి వినియోగదారులనెంతో మెప్పించాయి. ‘2000లో పోర్ట్‌ల్యాండ్‌లో కొన్ని నెలలు ఉండి మరీ ఈ రీసైక్లింగ్‌ నేర్చుకున్నా. అప్పట్లో అక్కడ ఈ తరహా ఫర్నిచర్‌ తయారీ ఎక్కువగా ఉండేది. దాంతో పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత ఇండియాకు వచ్చి ‘ఊర్జా డిజైన్స్‌’ మొదలుపెట్టా. చెట్టు సెల్యులోజ్‌ నుంచి తయారయ్యే ఈ కాగితం సహజసిద్ధమైంది. ఎటువంటి రసాయనాలు కలపకుండా అరటిగుజ్జును నీళ్లు, వాషింగ్‌షోడాలో ఉడకబెట్టి అచ్చులుగా తయారుచేస్తాం. దాన్నుంచి కావాల్సిన ఆకారానికి మలుచుకుంటాం. మా స్టూడియోలో వినియోగించిన నీటిని కూడా వృథా కాకుండా గార్డెన్‌కు తరలిస్తాం. అంతేకాదు లైట్స్‌ తయారీకి కావాల్సిన యంత్రాల డిజైనింగ్‌ నుంచి సిబ్బందికి శిక్షణనందించేవరకు ఎన్నో సవాళ్లనెదుర్కొన్నా. మా వినూత్న లైట్లను వినియోగదారులకు చేరువ చేయడానికి చాలా కష్టపడ్డా. అప్పట్లో సోషల్‌మీడియా ప్రభావం తక్కువే. ఎగ్జిబిషన్‌లలో మా ఉత్పత్తులను ప్రదర్శించేదాన్ని. ఇంటీరియర్‌ డిజైనర్లను కలిసి మా ప్రొడక్ట్‌ గురించి చెప్పేదాన్ని. అలా రెండు దశాబ్దాలు గడిచేసరికి ఊర్జా లైట్స్‌ అంటే సాధారణ స్థాయి నుంచి కార్పొరేట్‌, నక్షత్ర హోటళ్ల వరకూ చేరింది. మా లైట్స్‌కు ఫాటీబో, యాజూ, గో నేటివ్‌, లింక్డిన్‌, గూగుల్‌ వంటి ప్రముఖ సంస్థలు వినియోగదారులుగా మారడం గర్వంగా ఉంది. ఇప్పుడు నా దగ్గర 100 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు’ అని చెబుతున్న జెన్నీ సృజనాత్మకత ఎల్లలూ దాటేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్