ఆమె... డాక్టర్‌ క్యుటరస్‌  

మీ స్నేహితురాలిని ఆర్గాసమ్‌ గురించి ఎప్పుడైనా ప్రశ్నించండి... మీ ప్రశ్న పూర్తికాక ముందే ‘దయచేసి టాపిక్‌ మారుస్తావా?’ అనేవాళ్లే ఎక్కువ. ఎవరూ మాట్లాడుకోవడానికి ఇష్టపడని  ఈ అంశాలపై అవగాహన తీసుకొస్తోంది డాక్టర్‌ తాన్యా నరేంద్ర ఉరఫ్‌ ‘డాక్టర్‌ క్యుటరస్‌’. ప్రతిష్ఠాత్మక రాయల్‌ సొసైటీలో సభ్యురాలైన ఈ డాక్టరమ్మ చెబుతున్న ఆసక్తికరమైన విషయాలేంటో మనమూ తెలుసుకుందాం...

Updated : 22 Oct 2021 13:19 IST

మీ స్నేహితురాలిని ఆర్గజం గురించి ఎప్పుడైనా ప్రశ్నించండి... మీ ప్రశ్న పూర్తికాక ముందే ‘దయచేసి టాపిక్‌ మారుస్తావా?’ అనేవాళ్లే ఎక్కువ. ఎవరూ మాట్లాడుకోవడానికి ఇష్టపడని  ఈ అంశాలపై అవగాహన తీసుకొస్తోంది డాక్టర్‌ తాన్యా నరేంద్ర ఉరఫ్‌ ‘డాక్టర్‌ క్యుటరస్‌’. ప్రతిష్ఠాత్మక రాయల్‌ సొసైటీలో సభ్యురాలైన ఈ డాక్టరమ్మ చెబుతున్న ఆసక్తికరమైన విషయాలేంటో మనమూ తెలుసుకుందాం...

‘వెజైనల్‌ డిశ్చార్జ్‌...’ చాలామంది అమ్మాయిలు దీన్నో అనారోగ్య సమస్య అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. నిజానికి మీ వెజైనా చాలా గొప్పది. మీరు దాని ఆరోగ్యం గురించి పట్టించుకోకపోయినా అది మాత్రం నిర్లక్ష్యం చేయదు. స్వీయ శుభ్రత చేసుకుంటూనే ఉంటుంది. ఎలా అంటే... ఇల్లు శుభ్రం చేసిన తర్వాత మీరు ఆ మురికి నీళ్లను బయటకు ఒంపేస్తారు కదా! వెజైనా చేసే పని కూడా అదే! డిశ్చార్జ్‌ రూపంలో బయటకు వస్తుంది. అయితే ఆ డిశ్చార్జ్‌ వల్ల మంట, దురద వంటివి ఉంటే మాత్రం అది ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కావొచ్చు. అప్పుడు డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే భయమే లేదు. ఎంతో సులభంగా మనకు అర్థమయ్యే రీతిలో శారీరక ఆరోగ్యం గురించి తాన్యా చెప్పిన సోషల్‌ మీడియా పాఠాల్లో ఇదీ ఒకటి. ఇదే కాదు... మనం మాట్లాడ్డానికి బిడియపడే అనేక విషయాలను ఎంతో తేలిక భాషలో సులభంగా, అర్థమయ్యేట్టు చెబుతుంది తాన్యా. అందుకే ఆమెను నెటిజన్లంతా డాక్టర్‌ క్యుటరస్‌ అంటారు. యాంబ్రియాలజిస్టు అయిన తాన్యా ప్రతి స్త్రీకి క్లిటోరిస్‌ లిటరసీ (జననేంద్రియాలపై అవగాహన) తప్పనిసరిగా ఉండాలంటుంది. సోషల్‌మీడియా వేదికగా పబ్లిక్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రంగంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన రాయల్‌సొసైటీ ఆమెకి సభ్యత్వాన్ని అందించింది. 2020కి ‘సెక్సువల్‌ హెల్త్‌ ఇన్‌ఫ్లుయన్సర్‌’గా గుర్తింపునీ సాధించింది. తాన్యా ప్రత్యేకించి ఈ రంగాన్నే ఎంచుకోవడానికి కారణం ఉంది.

‘మా అమ్మది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతం. ఐదు తర్వాత చదువుకోవడానికి అక్కడ అవకాశం లేదు. రోజూ 20 కిలోమీటర్లు నడిచివెళ్లి చదువుకునేది. అలా మెడికల్‌ సీటు సాధించింది. మా అమ్మమ్మ షూటింగ్‌లో నిపుణురాలు. మరి నేను వాళ్లను దాటి మరో అడుగు ముందుకు వెయ్యాలి కదా! మా నాన్న మేల్‌ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌. అమ్మా, నాన్న డాక్టర్లే కాబట్టి నేను గైనకాలజీని ఎంచుకుంటానని అనుకున్నారు. కానీ సంతాన సాఫల్యత గురించిన విషయాలు నన్ను ఆకర్షించాయి. అలహాబాదులో మాకో ఐవీఎఫ్‌ సెంటర్‌ ఉండేది. నాకు ఏడేళ్లుండగా నాన్న ఓ పిండాన్ని చూపించారు. అది తలవెంట్రుకలో వందోవంతు పరిమాణంలో ఉంది. ఆ క్షణమే నన్ను యాంబ్రియాలజీ అంశం ఆకట్టుకుంది. అందులోనే ఆక్స్‌ఫర్డ్‌ నుంచి మాస్టర్స్‌ చేశాను. లండన్‌లో క్లినికల్‌ యాంబ్రియాలజీ చదువుకున్నా. ఇండియాలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న సమయంలో సంతానం కోసం ఒక్క పూటలో మా ఆసుపత్రికి 200 మంది వచ్చారు. లండన్‌లో రోజంతా కలిసి ఏడుగురు వస్తే ‘అబ్బో ఈ రోజు చాలా బిజీ’ అనే వారు డాక్టర్లు. అప్పుడే నాకో విషయం అర్థమైంది. భారతీయుల్లో చాలామందికి సంతాన సాఫల్యత గురించిన పరిజ్ఞానం లేదని. ఫైబ్రాయిడ్స్‌ ఉంటే శరీరం రంగు మారుతుందనో, అవాంఛిత రోమాలు వస్తాయనో అనుకుంటారు తప్ప అసలు ఫైబ్రాయిడ్‌ అంటే ఏంటని ఎవరూ ఆలోచించరు. ముఖ్యంగా వాళ్ల అండాలు, వీర్యకణాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అంశాల గురించి అవగాహనే లేదు. ఇవన్నీ చూశాక ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్‌ క్యుటరస్‌ పేరుతో ఒక ఛానెల్‌ని ప్రారంభించాను. లక్షలమంది ఈ వీడియోలని చూడటం, సంతాన సాఫల్యత గురించి అవగాహన పెంచుకోవడం సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా స్పెర్మ్‌, అండాలకి హానిచేస్తున్న విషయాలేంటో తెలియచెప్పాలని అనిపించింది’ అనే తాన్యా... అలహాబాద్‌లో అభిలాష పేరిట ఆసుపత్రిని నిర్వహిస్తోంది. సాహసాలంటే ఇష్టపడే ఈ డాక్టరమ్మ బాడీ పాజిటివిటీపైనా అవగాహన కల్పిస్తోంది. ‘నా పెళ్లప్పుడు నాకు నచ్చిన ఓ ప్రముఖ డిజైనర్‌ స్టోర్‌కి వెళ్లాను. వాళ్లు నా బరువుని వెక్కిరిస్తూ ‘మా దగ్గర మీకు సరిపడే లెహెంగాలు లేవు అనడం బాధ కలిగించింది’. పెళ్లికూతురు ఒక నెలలో బరువు తగ్గడానికి అనేక చిట్కాలు చెబుతుంటారు మనవాళ్లు. అవన్నీ సాధ్యమేనా? మనం చూడాల్సింది మానసిక ఆనందాన్ని అంటోంది’ తాన్యా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్