Updated : 12/11/2021 03:55 IST

చిన్నారుల కోసం.. తల్లీకూతుళ్ల వార్తాప్రసారం

దిల్లీకి చెందిన ఈ తల్లీ కూతుళ్లు దేశంలోనే తొలి సారిగా చిన్నారుల కోసం వార్తా ప్రసారాల్ని ప్రారంభించారు. ఈ ఛానెల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశాన్నుంచైనా పిల్లలు వార్తలు, విశేషాలను అందించే సౌకర్యాన్ని కూడా కల్పించారు. కొవిడ్‌ సమయంలో 49 ఏళ్ల లిండీ ప్రికిట్ట్‌కు వచ్చిన ఓ ఆలోచనే ఇందుకు కారణం. తన తొమ్మిదేళ్ల కూతురు లీలాతో కలిసి నడుపుతున్న ఈ ‘న్యూసీ పూలూజీ’ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

లాక్‌డౌన్‌తో ఇంటిల్లిపాదీ ఒకేచోట ఉన్నాం, ఉద్యోగాలన్నీ ఇంటి నుంచే చేశాం. ఆ నేపథ్యంలో బయటికి అడుగుపెట్టలేని పరిస్థితులతో అందరికీ బోర్‌గా అనిపించింది. తనకూ సమయాన్ని అలా గడపడం కష్టంగా తోచింది అంటుంది లిండీ ప్రికిట్ట్‌. విలేకరి అయిన ఈమెకు కొవిడ్‌ సమయంలో చిన్నారుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. అదే ఈ వార్తాప్రసారం ప్రారంభించడానికి కారణమైంది. తన ఒక్కగానొక్క కూతురు లీలా శివశంకర్‌ను ఇందులో భాగస్వామిని చేసింది. బాల్యం నుంచి తల్లి లిండీ, తండ్రి శివశంకర్‌ను విలేకరులుగా చూస్తూ పెరిగిన లీలాకు కూడా ఈ రంగం పట్ల ఆసక్తి ఎక్కువే.

వారానికోసారి... ఇంటినుంచే వారంలో ఒకసారి వార్తలను ప్రసారం చేసేలా ‘న్యూసీ పూలూజీ’ ప్రారంభించారు లిండీ, లీలా. ‘నేను అమెరికా వాసిని. ఇండియాకు చెందిన శివశంకర్‌ను వివాహం చేసుకున్నా. మాపాప లీల అమెరికాలోనే పుట్టింది. గతేడాది మేం దిల్లీలో నివసిస్తున్న సమయంలో కొవిడ్‌తో లాక్‌డౌన్‌ అయ్యింది. ఇంట్లో ఏమీ తోచేది కాదు. నాతోపాటు లీలకూ వార్తలు వినడం చాలా ఇష్టం. ఇద్దరం గంటలతరబడి టీవీకి అతుక్కుపోయాం. కొవిడ్‌ సమయంలో చాలామంది వారి పిల్లలను టీవీలకు దూరంగా ఉంచేవారు. నేను మాత్రం మాపాపకు అన్నీ తెలియాలని అనుకునేదాన్ని. మనమూ ఒక ఛానెల్‌ ప్రారంభిద్దామా అని ఓ రోజు తనను అడిగా. అంతే తను సంతోషాన్ని పట్టలేక పోయింది. వరల్డ్‌ న్యూస్‌ పాడ్‌కాస్ట్‌గా దీన్ని రూపొందించి, ప్రపంచవ్యాప్తంగా జరిగే విశేషాలను దీని ద్వారా వారానికొకసారి అందరికీ చేరుస్తున్నాం’ అని ఉత్సాహంగా వివరించింది లిండీ.

దేశదేశాల్లో.. రాజకీయ వార్తల నుంచి కరెంట్‌ ఎఫైర్స్‌ వరకు, అలాగే సైన్స్‌, క్రీడలు, జంతువుల నుంచి అంతరిక్షం వరకు విశేషాలను ఈ తల్లీకూతుళ్లు అందిస్తున్నారు. ఆయా దేశ సంప్రదాయాలు, పండుగలు, ప్రత్యేక దినాలు వంటివన్నీ చిన్నారులకు తెలిసేలా చేస్తోంది లీలా. ‘వీటన్నింటినీ ఒక చోట నోట్‌ చేసుకుని అమ్మ, నేను కలిసి చర్చిస్తాం. ఆ తర్వాత అమ్మ సాయంతో స్క్రిప్టు తయారవుతుంది. వాటిని ఎలా చదవాలో సాధన చేస్తా. నా బెడ్‌రూంలోని మంచం కిందకు వెళ్లి వార్తలను రికార్డు చేస్తా. అక్కడయితేనే స్పష్టంగా రికార్డు అవుతాయి. ఇప్పటి వరకు 70 ఎపిసోడ్స్‌ పూర్తయ్యాయి’ అంటోంది లీల. ఈ న్యూస్‌ పాడ్‌కాస్ట్‌కు మన దేశంలోనే కాక స్పెయిన్‌, దుబాయి, సౌదీ అరేబియా, తైవాన్‌, అమెరికా, ఇంగ్లండ్‌, కెన్యా, మెక్సికో వంటి దేశాల్లోనూ శ్రోతలుండటం విశేషం. అంతేకాదు... ప్రపంచవ్యాప్తంగా పాతిక మందికి పైగా కరెస్పాండెంట్స్‌ దీనికోసం పని చేయడం మరింత ప్రత్యేకం!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని