ఫోర్బ్స్‌ జాబితాలో ఆశా కార్యకర్త
close
Published : 30/11/2021 02:06 IST

ఫోర్బ్స్‌ జాబితాలో ఆశా కార్యకర్త

ఫోర్బ్స్‌ జాబితాలో అత్యంత సంపన్నులు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ క్రీడాకారులు... ఇలానే ఉంటుంది. దానిలో స్థానాన్ని సంపాదించిందో గ్రామీణ ఆశా కార్యకర్త. కొవిడ్‌ సమయంలో నిరుపమాన వైద్యసేవలందించిందంటూ ఒడియా ఆశా కార్యకర్త మతిల్దా కుల్లును ‘ద ఫోర్బ్స్‌ ఇండియాస్‌ డబ్ల్యూ-పవర్‌ 2021’లో చేర్చింది. ఎస్బీఐ తొలి మహిళా ఛైర్‌పర్సన్‌ అరుంధతి భట్టాచార్య, ప్రముఖ క్రీడాకారిణులు అవని లేఖరా, రాణి రాంపాల్‌ తదితరుల సరసన తనూ చేరడం విశేషమే కదా.

ఒడిశా రాష్ట్రం, సుందర్‌గఢ్‌ జిల్లా, గర్గద్‌బహల్‌ గ్రామానికి చెందిన మతిల్దా 2005లో ఆశా కార్యకర్తగా చేరింది. భర్త అనిల్‌ వ్యవసాయ కూలీ. వీరికిద్దరు పిల్లలు. బార్గోన్‌ బ్లాక్‌ సమీపంలోని గ్రామాల ప్రజలకు వైద్య సేవలందించడం తన విధి. అప్పట్లో స్థానికులకు ఎన్నో మూఢనమ్మకాలుండేవి. వాటిని పారదోలి, ఆధునిక వైద్యం వైపు మళ్లించే పనిలో మతిల్దా ఎన్నో అవమానాలు, హేళనలు, బెదిరింపులను ఎదుర్కొంది. అయినా అవేవీ లెక్కచేయకుండా ఇంటింటికి తిరుగుతూ చైతన్యాన్ని కలిగించేది. ఇంజెక్షన్‌ అంటేనే పారిపోయే ఆ ఆదివాసీలకు అవగాహన కలిగించి, చికిత్స చేయించుకునేలా చేసిందీమె. ఊరూరా సైకిల్‌పైనే తిరుగుతూ కరోనాపై అవగాహన కలిగిస్తూ, జాగ్రత్తలు చెప్పేది. రోజూ కనీసం 25, 30 కిలోమీటర్లు తిరిగేది. హెల్త్‌ చెక్‌అప్‌లు, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ, వారికి వ్యాక్సిన్లు వంటివన్నీ క్రమం తప్పకుండా చూసేది. హెల్త్‌వర్కర్‌గానే కాకుండా కౌన్సెలర్‌, మోటివేటర్‌గానూ ఇరవై నాలుగ్గంటలూ అందరికీ అందుబాటులో ఉండేది. కొవిడ్‌ సెకండ్‌వేవ్‌లో మతిల్దాకు కరోనా సోకినా, చికిత్స తీసుకుని కోలుకోగానే విధుల్లో చేరింది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు గంటలు కూడా పని చేసింది. తనకు ఆర్థిక సమస్యలెన్ని ఉన్నా, వాటి కన్నా, ప్రజల గురించే ఎక్కువగా ఆలోచించేది. ఆశా ఉద్యోగంలో తనకొచ్చేది 4.5 వేలు. అది చాలక కుటుంబ పోషణ కోసం చిన్న టైలరింగ్‌ దుకాణం పెట్టి, నలుగురు మహిళలకు ఉపాధినిస్తూ తనూ కొంత అదనపు ఆదాయాన్ని పొందుతోంది.

నా బాధ్యత ఇది... ‘ఇంటింటికీ తిరిగి కరోనా పరీక్షలు నిర్వహించి, వైరస్‌ సోకిన వారికి చికిత్స అందేలా చేసే దాన్ని. కౌన్సిలింగ్‌ ఇచ్చి వారిలో ధైర్యాన్ని నింపేదాన్ని. పరిశుభ్రతపై అవగాహన కలిగించే దాన్ని. ఫోర్బ్స్‌ పత్రికలో చోటు దక్కినందుకు గర్వంగా ఉంది. నా లక్ష్యాన్ని నెరవేర్చినట్లుగా అనిపిస్తోంది. ‘కొవిడ్‌ సమయంలో ప్రజాసేవలో ఆరోగ్య కార్యకర్తలందరికీ ప్రతీకగా నిలిచావు’ అంటూ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రశంసించడమూ మరింత సంతోషాన్ని కలిగించింది. ప్రజారోగ్య పరిరక్షణ ఉద్యోగం కాదు, నా బాధ్యత అనుకుంటున్నా’ అంటోంది మతిల్దా వినమ్రంగా.

Tags :

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని