సేంద్రియ సేద్యంలో ‘ప్రతిభా’వని

ఒకప్పుడు వ్యవసాయంలో ఓనమాలే తెలియదామెకు. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడమే కాదు.. వాళ్ల పంటను ఎలా మార్కెట్‌ చేసుకోవాలో కూడా నేర్పిస్తోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 1200 మందికిపైగా రైతులను సేంద్రియ బాట పట్టించింది.. ప్రతిభా తివారి.

Updated : 21 Dec 2021 05:35 IST

ఒకప్పుడు వ్యవసాయంలో ఓనమాలే తెలియదామెకు. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడమే కాదు.. వాళ్ల పంటను ఎలా మార్కెట్‌ చేసుకోవాలో కూడా నేర్పిస్తోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 1200 మందికిపైగా రైతులను సేంద్రియ బాట పట్టించింది.. ప్రతిభా తివారి.

ప్రతిభది మధ్యప్రదేశ్‌. మేథమేటిక్స్‌లో మాస్టర్స్‌ చదివింది. వ్యవసాయంపై కనీస అవగాహన లేదు. కానీ అత్తగారిది వ్యవసాయాధారిత కుటుంబం. దీంతో దగ్గర్నుంచి చూసే అవకాశమొచ్చింది. ఆసక్తి కలిగి సంబంధిత సబ్జెక్టులు, కొత్త టెక్నాలజీలను అధ్యయనం చేసింది. ఈ క్రమంలోనే రసాయనాల వల్ల కలిగే అనర్థాలూ తెలిశాయి. ఇవి మనద్వారా రాబోయే తరాలపైనా ప్రభావం చూపుతాయని తెలుసుకున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెదికింది. సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకుని ముందు తను ప్రయత్నించి, నమ్మకం కలిగాక ఇతర రైతులనూ ఈ మార్గంలో నడిపించింది.

రైతులు నష్టపోతోంది దిగుబడి రాక కాదు.. సరైన ధర రాక అని ఆమెకు అర్థమైంది. వాళ్లకి సాయమందించడానికి 2016లో ‘భూమిష ఆర్గానిక్స్‌’ సంస్థను ప్రారంభించి, వారిని అనుసంధానం చేసింది. దీని ద్వారా సేంద్రియ సాగు పద్ధతులపై శిక్షణ నుంచి వారి పంట మార్కెటింగ్‌ మొదలైవన్నీ ప్రతిభనే చూసుకునేది. మధ్యతరగతి వారికీ సేంద్రియ పదార్థాలను దగ్గర చేయాలని అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఇప్పుడా సంస్థ టర్నోవర్‌ ఏడాదికి రూ. 50 లక్షలకు పైమాటే. 1200 మందికిపైగా రైతులు ఆమె చూపిన బాటలో నడిచి లాభాల్ని పొందుతున్నారు.

‘ఈ ప్రయాణం చెప్పినంత సులువుగా జరగలేదు. సేంద్రియ పద్ధతులవైపు నడిపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ముందు నలుగురో, అయిదుగురో ముందుకొచ్చారంతే. పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేయాల్సి వచ్చింది. మార్కెటింగ్‌ కూడా నేనే చూసుకునేదాన్ని. మూడేళ్ల పాటు సంస్థలు, స్టోర్స్‌ అన్నింటికీ వెళ్లేదాన్ని. సరకు నేరుగా అందించేలా ఒప్పందం చేసుకునేదాన్ని. అలా మెల్లగా ఆదాయ మార్గం ఏర్పడటమే కాకుండా లాభాలూ చూశారు. ఇప్పుడు సొంతంగా హోల్‌సేల్‌ మార్కెట్లను ఏర్పాటు చేశా. సేంద్రియ ఆహార పదార్థాలకు ఆదరణ ఎక్కువ. లాభాల కోసం ఎక్కువ ధర పెడుతుంటారు. దీంతో మధ్యతరగతి వాళ్లు వీటికి దూరంగా ఉంటారు. వాళ్లకోసం లోకల్‌ మార్కెట్‌లోనే అమ్మేలా చూశా. చిన్న రైతులు తక్కువ పొలంలో ఎక్కువ ఆదాయం పొందే మార్గాలను సూచిస్తుంటా. ఇప్పుడు వేలమంది రైతులు నన్ను అనుసరిస్తున్నారు’ అంటోంది ప్రతిభ.

రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రలకూ తన సేవలు విస్తరించింది. 70 రకాల ఉత్పత్తులతో 2020లో ప్రాసెసింగ్‌ యూనిట్‌నూ ప్రారంభించింది. పప్పులు, మిల్లెట్స్‌, సుగంధ ద్రవ్యాలు, హెర్బ్స్‌, పిండ్లు, పచ్చళ్లు మొదలైనవన్నీ ప్యాకింగ్‌ చేసి అమ్ముతారు. దీన్ని ఆడవాళ్లే చూసుకుంటారు. వీటన్నింటినీ దిల్లీ, ముంబయి, దెహ్రాదూన్‌, భోపాల్‌లకు సరఫరా చేస్తోంది. తన సేవలను, స్టోర్లను దేశవ్యాప్తం చేసి ప్రజలకు ఆరోగ్యం, ఎక్కువమంది రైతులకు ఆదాయం వచ్చేలా చేయడమే ధ్యేయమని చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్