నా గొంతు బాగాలేదన్నారు...

అతను... ప్రపంచమంతా అభిమానుల్ని సంపాదించుకున్న స్వరమాంత్రికుడు ఏ.ఆర్‌. ·రెహమాన్‌ అయితే... ఆమె... తన ప్రత్యేకమైన గొంతుతో రెహమాన్‌తోనే శభాష్‌ అనిపించుకున్న గాయని. పేరు సాషా తిరుపతి. పది భాషల్లో పాడి, ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె...

Updated : 09 Dec 2022 13:03 IST

నా గొంతు బాగాలేదన్నారు...

అతను... ప్రపంచమంతా అభిమానుల్ని      సంపాదించుకున్న స్వరమాంత్రికుడు ఏ.ఆర్‌. ·రెహమాన్‌ అయితే... ఆమె... తన ప్రత్యేకమైన గొంతుతో రెహమాన్‌తోనే శభాష్‌ అనిపించుకున్న గాయని.  పేరు సాషా తిరుపతి. పది భాషల్లో పాడి, ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె...ఉత్తమగాయనిగా 2017కి గానూ 65 వ జాతీయ అవార్డును అందుకుంది.  ఆమె తన గురించి వసుంధరకు చెప్పుకొచ్చిందిలా..నేను పుట్టింది కశ్మీరు. అయితే నాన్న ఉద్యోగరీత్యా నా చిన్నవయసులోనే కెనడా వెళ్లిపోయాం. అక్కడే నా పాఠశాల చదువు పూర్తయింది. నాన్నకు సంగీతమంటే ఇష్టం. ఆయన వల్ల చిన్నప్పటి నుంచీ లతామంగేష్కర్‌, రఫీ పాటలు వింటూ పెరిగా. క్రమంగా నేనూ పాడటం మొదలుపెట్టా. అది గమనించి, నాన్న రోజూ పండిట్‌ జస్‌రాజ్‌ కచేరీలు వినిపించేవారు. ఓ రోజు నాన్న ‘గొంతు బాగుంది. సంగీతం నేర్చుకుంటావా...’ అని అడిగారు. నాకూ ఇష్టమని చెప్పడంతో ఇండియా తీసుకొచ్చారు.  అలహాబాద్‌లో ప్రముఖ హిందుస్థానీ కళాకారిణి కమలాబోస్‌, ఆ తరువాత పద్మవిభూషణ్‌ గ్రహీత, హిందుస్థాని కళాకారిణి గిరిజాదేవి దగ్గర శిక్షణ ఇప్పించారు. అయిదేళ్ల తరువాత ఉన్నత చదువుల కోసం మళ్లీ కెనడా వెళ్లిపోయా. రెహమాన్‌ సంగీతం సమకూర్చిన ‘గురు’ సినిమా పాటలు విన్నప్పుడల్లా... జీవితంలో ఒక్కసారైనా ఆయన దగ్గర పాడాలనుకునేదాన్ని. ఆ లక్ష్యంతో ముంబయి వచ్చేశా.

మూడేళ్లు పాడలేదు... ముంబయి వచ్చి సంగీతంలో శిక్షణ తీసుకుంటూనే వాణిజ్య ప్రకటనలకు జింగిల్స్‌ పాడేదాన్ని. ఆ సమయంలోనే బాలీవుడ్‌లో ‘బమ్‌బమ్‌బోలే’  సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఆ తరువాత దాదాపు ముప్ఫై పాటలు పాడా. ఓసారి బాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు ఒకరు... నా పాట విని ‘గొంతు బాగోలేదు. పాడటానికి పనికిరావు’ అన్నారు. అంతే నాలో నిరాశ మొదలైంది. నిజంగానే నా గొంతు బాగోలేదేమో అనే ఆత్మన్యూనతతో పాటలు పాడటం మానేశా. అప్పటివరకూ రోజుకి 10 గంటలు సాధన చేసిన నేను, ఆ సమయాన్ని తగ్గించేశా. మూడేళ్లపాటు అసలు పాడలేదు. తరువాత కోక్‌ స్టూడియో కోసం రెహమాన్‌... గాయకులను ఎంపిక చేస్తున్నారని ఓ రోజు నా స్నేహితురాలు చెప్పింది. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చెన్నై వెళ్లా. అక్కడ 30 మందికి పైగా ఉన్నారు. నాకు అవకాశం రాదనుకున్నా. ఎందుకంటే పూర్తిగా పాడటం తగ్గించేశా. గొంతు సరిగ్గా లేదనే భయం. అయితే ఆయన ఎదుట పాడే అవకాశం వచ్చింది. అదే చాలనుకుని వెళ్లి, ఆయన చెప్పింది పాడి, తిరిగి ముంబయి వెళ్లిపోయా. నెలరోజుల తరువాత ఆయన స్టూడియో నుంచి ఫోను.. ‘ఎంపికయ్యావు. వెంటనే చెన్నైకి రావాలి’ అని. అప్పుడు ఆయన ‘నీ గొంతు అరబిక్‌ వాద్యంలా ఉంది’ అన్నారు. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. అంతకన్నా ప్రశంస ఏముంటుంది. అక్కడి నుంచే నా కెరీర్‌ మలుపు తిరిగింది.
10కి పైగా భాషల్లో...  ‘వాడావాడా’ పాటతో నాకు బోలెడు అవకాశాచ్చాయని చెప్పాలి. ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కొచ్చడియాన్‌’ సినిమాలో పాట ఇది. అలా రెండోసారి మొదలైన నా ప్రయాణంలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ... ఇలా 10కి పైగా భాషల్లో పాడే అవకాశాలొచ్చాయి. హ్యారిస్‌ జయరాజ్‌, జీవీ ప్రకాశ్‌, డి.ఇమ్మాన్‌, ఇళయరాజా, అనిరుధ్‌.. వంటి  సంగీత దర్శకులతో పనిచేశా. దాదాపు 300 పాటలు పాడా. తెలుగులో ‘జెండా పై కపిరాజు’, ‘ప్రేమాలయ’, ‘ఓకే బంగారం’, ‘గుప్పెడంత ప్రేమ’, ‘24’, ‘పోలీసోడు’, ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘చెలియా’, ‘వివేకం’ సినిమాల్లో పాడా. రజనీకాంత్‌, అక్షయకుమార్‌ నటించిన ‘2.0’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అందులో కూడా మూడు భాషల్లోనూ ఓ పాట పాడా. సాధారణంగా ఒక పాట రికార్డు చేయడానికి అరగంట లేదా గంట పడుతుంది. ‘ఓకే బంగారం’ సినిమాలో ఒకపాట, అలాగే తమిళంలో ‘నానే వరిగిరేన్‌’ పాటకు మాత్రం దాదాపు ఆరు గంటలు పట్టింది. రెహమాన్‌కు అప్పటికప్పుడు కొత్తకొత్త ఆలోచనలు వస్తాయి. స్వరాల ఆలాపనలను మధ్యలో కలుపుతూ ఉంటారు. వాటిని సాధన చేసి, పాడటమే దానికి కారణం. ‘నిన్ను కోరి ఉన్నానురా’ పాట కూడా అలాంటిదే. శ్రుతి ఎక్కువ. నేను అప్పుడు ముంబయిలో ఉన్నా. రెహమాన్‌ ఫోన్‌ చేసి, ‘నిన్ను కోరి’ అనే బిట్‌ను వీలైనన్ని రకాలుగా పాడి మెయిల్‌ చేయమన్నారు. 25 రకాల్లో పాడి పంపించా. అందులోంచి ఒకదాన్ని తీసి పాటలో కలిపారు. ఇప్పుడు తాజాగా ‘కాట్రు వెలియిడై’ అనే సినిమాలో ‘వాన్‌ వరువాన్‌’ అనే పాటకే జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా అవార్డు వచ్చింది. అదే పాట తెలుగులో ‘మై మరుపా’. అదీ నేనే పాడా. మామ్‌లో ‘ఓ సోనా తేరే లియే’ని రెహమాన్‌తో కలిసి పాడటం ఓ అదృష్టంగా భావిస్తా. సమయపాలన, క్రమశిక్షణ ఆయన నుంచి నేర్చుకున్నా. ఈ గుర్తింపూ ప్రశంసలన్నీ గురువు రెహమాన్‌, మా అమ్మానాన్నలకే అందుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్