ఆ నగ... ఓ జ్ఞాపకం

తన కొడుకు బుడిబుడి అడుగులు వేస్తూ.. ఎదుగుతున్న క్రమంలో ఆ జ్ఞాపకాలను పదిలపరుచు కోవాలనుకుందామె. అలా తన చనుబాలను నగగా మార్చు కుంది. బాబుకు మొదటి సారి  ఊడిన పన్ను, తొలిసారి తీసిన వెంట్రుకలు, గోరు వంటి వన్నీ

Updated : 07 Jan 2022 05:19 IST

తన కొడుకు బుడిబుడి అడుగులు వేస్తూ.. ఎదుగుతున్న క్రమంలో ఆ జ్ఞాపకాలను పదిలపరుచు కోవాలనుకుందామె. అలా తన చనుబాలను నగగా మార్చు కుంది. బాబుకు మొదటి సారి  ఊడిన పన్ను, తొలిసారి తీసిన వెంట్రుకలు, గోరు వంటి వన్నీ ఆభరణాలుగా చేయగలిగింది. ఈ వ్యాపకాన్నే ఉపాధిగా మార్చుకుని ఎందరో తల్లులకూ వారి తీపి జ్ఞాపకాలను నగలుగా చేసిస్త్తోన్న నమితా నవీన్‌ వైవిధ్య ప్రయాణాన్ని చదవండి...

బెంగళూరుకు చెందిన నమిత, నవీన్‌ దంపతులకు బాబు పుట్టాడు. ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ చదివిన నమితకు తన కొడుకు బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాల్ని దాచుకోవాలనిపించింది. బాబుకిస్తున్న తన పాలు, వాడికి మొదటి సారి తీసిన వెంట్రుకలు, గోరు, పాలదంతం వంటి వాటిని నగగా మార్చుకుంటే ఎలా ఉంటుందనిపించింది. అయిదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆలోచనతో అంతర్జాలంలో అధ్యయనం చేసింది. 8 నెలల పరిశోధన తర్వాత ప్రయోగాలు ప్రారంభించి, తన చనుపాలతో చిన్న నగను రూపొందించింది. అలాగే వెంట్రుకలు, గోరు, పాల దంతాలు వంటి వాటినీ నగలుగా చేసింది.

ఆర్డర్లు పెరిగాయి...

నమిత తను చేసిన నగల వివరాలను సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచేది. అవి చూసి మరికొందరు తల్లులు తమకూ అలా చేసిమ్మని కోరేవారు. వారి చనుబాలను సేకరించి వారికి నచ్చిన ఆకృతుల్లో నగలు రూపొందించేది. నాలుగేళ్ల క్రితం ‘మమ్మాస్‌ మిల్కీటేల్‌’ సంస్థను స్థాపించింది. ‘పసిపిల్లలకు సంబంధించినవి చాలా మంది దాచుకుంటారు. ఆ స్థానంలో ఈ తరహా నగలొచ్చాయి. జ్ఞాపకాన్ని నగగా చేయించుకుంటే ఎప్పటికీ మనతోనే ఉంటుంది. బొడ్డుతాడుతోనూ నగలు తయారు చేస్తున్నా. మొదట తల్లి పాలకు ప్రత్యేక రసాయనాన్ని కలిపి భద్రపరుస్తా. దీన్ని తిరిగి మెత్తగా పొడిగా మార్చి ఆరబెట్టాలి. ఆ తర్వాత నగగా తీర్చిదిద్దాలి. చాలా సున్నితమైన వ్యవహారం ఇది. ఈ ప్రక్రియను సొంతగా రూపొందించుకున్నా. మొదట్లో ఆ పాల పొడి గోధుమ రంగులోనో, నల్లగానో, ఆకుపచ్చగానో మారిపోయేది. చాలా పరిశోధన అనంతరం దాన్ని ఎప్పటికీ తెల్లగానే ఉండేలా చేయగలిగా. ఈ విషయంలో నా చదువు చాలా ఉపయోగపడింది. నన్ను సంప్రదించే వారిలో కొందరిని జీవితంలో మరవలేను. ఓ ముంబయి జంట తమ పాపకు గుర్తుగా బొడ్డుతాడుతో ఉంగరాలు చేయించుకున్నారు. ఆ పాప చనిపోవడంతో ఇలా తన జ్ఞాపకాన్ని పదిలపరుచుకున్నారు. ఇటువంటి సందర్భాలు కంట తడి పెట్టిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయి. పాలు, పాలదంతాలు వంటి వాటికన్నా బొడ్డుతాడుతో నగలకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అది గాజుబాల్‌లో తేలియాడుతున్నట్టు పెండెంట్‌ చేసిస్తున్నా’ అని వివరించింది నమిత.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్