Published : 21/01/2022 00:41 IST

వాళ్ల వేదన... 1000 గంటల వీడియో!

ఆ ఇంట్లో సృష్టిభక్షి అడుగుపెట్టిన వెంటనే ఆమెకెదురొచ్చిందోమహిళ. అత్యాచారానికి గురైన తన కూతురి గురించి చెబుతుంటే సృష్టికి కన్నీరాగలేదు. ఇటువంటి అకృత్యాలపై అందరికీ గొంతెత్తి చెప్పాలనుకుంది. కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు 3,800 కి.మీ దూరం కాలినడకతో దేశపర్యటన చేసింది. అత్యాచార బాధితులను కలుసుకొని వారి వేదనను ‘ఊంబ్‌ (ఉమెన్‌ ఆఫ్‌ మై బిలియన్‌)’ పేరుతో లఘుచిత్రంగా మలిచింది..

ముంబయికి చెందిన 32 ఏళ్ల సృష్టి చిన్నప్పటి నుంచి పెద్ద సంస్థకు సీఈవో అవ్వాలని కలలు కనేది. చదువైన తర్వాత హాంకాంగ్‌లో అనుకున్నట్లుగానే ఓ సంస్థకు సీఈఓగా అవకాశాన్ని అందుకుంది. స్నేహితులతో ఈ సంతోషాన్ని పంచుకునే ఓ సందర్భం ఆమె మార్గాన్నే మార్చేసింది. సెలవులప్పుడు ఏయే దేశాలకు పర్యటించొచ్చు అనే అంశంపై అందరూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్న సమయంలో ప్రతిఒక్కరూ భారతదేశాన్ని ఎంచుకోవడానికి సంకోచించారు. మహిళలకు భద్రత లేదంటూ వారు చెప్పిన కారణం సృష్టిని ఆలోచించేలా చేసింది. అంతే... ఆ ఉద్యోగాన్ని వదిలేసుకుని, తిరిగి స్వదేశానికి చేరుకుంది.

తనను తాను సిద్ధం చేసుకుని...

మహిళలపై దాడి, గృహహింస, అత్యాచారం వంటివి  ఆగాలంటే సామాజికపరంగా మార్పు రావాలి అనేది సృష్టి అభిప్రాయం. దీనికోసం ప్రజల్లో అవగాహన తీసుకొస్తే క్రమేపీ ఇటువంటి అఘాయిత్యాలు తగ్గుతాయి అని భావించిందీమె. దేశమంతా కాలినడకన పర్యటించి, అందరిలో అవగాహన తేవాలనుకుంది. దీనికన్నా ముందు తనను శారీరకంగా సిద్ధం చేసుకోవడానికి వ్యాయామాలు, వెయిట్‌లిఫ్టింగ్‌, క్రాస్‌ఫిట్‌ వంటివన్నీ సాధన చేసింది. ఎన్నిరోజులు పడుతుంది, ఎక్కడెక్కడి ప్రజలతో మాట్లాడాలి, ఏయే ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లి అవగాహన తరగతులు చెప్పాలి, వర్క్‌షాపులు నిర్వహించాలి అనేదానిపై కసరత్తు చేసింది. ఇందులో 12మంది వలంటీర్ల సాయాన్ని తీసుకుంది. అంతా సిద్ధం చేసుకుని, 2017లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

వారే హీరోలు..

సృష్టి తాను పర్యటించిన ప్రాంతాల్లో మహిళలను, బాలికలను కలుసుకునేది. రోజుకి 30 కిలోమీటర్ల దూరం నడిచేది. ప్రతిచోట అక్కడివారి కథలు, వేదనలు, అనుభవాలు, సమస్యలు వినేది. చాలా ప్రాంతాల్లో గృహసింస, లైంగిక వేధింపులు, పేదరికం, బాల్యవివాహాలు వంటివెన్నో కనిపించాయి అని చెబుతుంది సృష్టి. ‘దేశవ్యాప్తంగా పర్యటించా. ఎనిమిదినెలలపాటు నడుస్తూనే ఉన్నా. నా ప్రయాణంలో ఎందరో అభాగ్యులను కలుసుకున్నా. వారి వేదనలను జయించి జీవితాలను ప్రారంభించిన వారి నుంచి స్ఫూర్తి పొందేదాన్ని. నా కళ్లకు వారే అసలైన హీరోలుగా కనిపించేవారు. మొత్తం నా ప్రయాణంలో 75వేలమందితో మాట్లాడా. నేను కలిసి మాట్లాడిన ప్రతి మహిళ అంతరంగాన్నీ వీడియోగా చిత్రీకరించా. మొత్తం 1000 గంటల నిడివి ఉన్న వీడియోను తీశా. నా అనుభవాలను, నేను కలిసిన హీరోల్లాంటి మహిళల కధలు, వారెంచుకున్న మార్గాలను అందరికీ చెప్పాలనిపించింది. అందుకే మొత్తం వీడియో నుంచి 90 నిమిషాల నిడివిని తీసి ఓ లఘుచిత్రంగా మలిచా. అదే.. ‘ఊంబ్‌(ఉమెన్‌ ఆఫ్‌ మై బిలియన్‌)’. ఇందులో నలుగురి స్ఫూర్తిదాయకమైన మహిళల జీవిత కథలుంటాయి. జూన్‌ 17న లండన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2021లో ఈ చిత్రం ప్రదర్శించడానికి అర్హతను దక్కించుకోవడం ఓ మహిళగా గౌరవంగా భావిస్తున్నా.’ అని అంటుంది సృష్టి. బెంగళూరు, హైదరాబాద్‌, నాగ్‌పుర్‌, గ్వాలియర్‌, దిల్లీ వంటి నగరాల్లో సృష్టి నైట్‌వాక్స్‌ను నిర్వహించింది.  నగరాలు, పట్టణాలు మహిళలకు భద్రనివ్వాలనే ఉద్దేశంతో ఈమె చేపట్టిన ఈ కార్యక్రమాల్లో దియామిర్జా, సుస్మితాసేన్‌ వంటి బాలీవుడ్‌ తారల నుంచి పలురంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని