Updated : 08/02/2022 04:39 IST

ఒక్క ఉత్పత్తితో.. లాభసాటి వ్యాపారం!

సంస్థ అనగానే ఏం తడుతుంది? బోలెడు ఉత్పత్తులు కదా! కానీ ఆమె ఒకే ఉత్పత్తితో సంస్థను ప్రారంభించింది. మూడేళ్లపాటు కేవలం దాంతోనే వ్యాపారం చేసి.. కోటిన్నర టర్నోవర్‌ సాధించింది. ఈ విజయం తర్వాత ఇప్పుడిప్పుడు కొత్తవాటిని జోడించుకుంటూ వెళుతోంది. ఆమెవరో.. తనవ్యాపారమేంటో చదివేయండి.

నేహా టాండన్‌ది ఛత్తీస్‌గఢ్‌. ఎన్‌ఐటీ సూరత్‌కల్‌ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌, ఆపై ఓ ప్రముఖ విద్యాసంస్థ నుంచి ఎంబీఏ పూర్తిచేసింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా అనుభవం సాధించాక దుబాయ్‌కు చెందిన ఓ ఏవియేషన్‌ సంస్థలో కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాకు ఎంపికైంది. నిరంతరం వివిధ దేశాలు పర్యటించాల్సి వచ్చేది. ఈమె భర్త డాక్టర్‌ జయేష్‌ శర్మ క్యాన్సర్‌ సర్జన్‌. కొన్నాళ్ల తర్వాత స్వదేశంలో స్థిరపడాలని రాయ్‌పుర్‌కు మకాం మార్చారు. కొన్నాళ్లు ఈవిడ దుబాయ్‌కీ, రాయ్‌పుర్‌కీ మధ్య రాకపోకలు సాగించింది. తర్వాత కష్టమనిపించి ఉద్యోగానికి రాజీనామా చేసింది. జయేష్‌ సొంత ఆసుపత్రి కడదామనుకున్నారు. దానికోసం స్థలం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ కుదరడం లేదు. నేహా తన అనుభవంతో సాయం చేద్దామనుకుంది. అయితే దుస్తుల విషయంలో ఆమెకు సమస్య ఎదురైంది. గతంలో బిజినెస్‌ మీటింగ్‌లేవైనా ఆమె సూట్‌ వంటి బిజినెస్‌ వేర్‌ వేసుకునేది. ఇక్కడ తప్పక చీర కట్టుకోవాల్సిన పరిస్థితి. చూడ్డానికి అందంగా ఉన్నా కట్టుకోవడానికే ఎక్కువ సమయం తీసుకుంటుండటం, వేగంగా కదిలే వీల్లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. మార్కెట్‌లో సులువుగా ధరించే వీలున్నవి ఏమైనా ఉన్నాయేమోనని వెతికితే ప్రయోజనం లేదు. ఏం చేయాలా అనుకుంటున్నప్పుడు ఓ ఆలోచన వచ్చింది.

ఓ చీరను తీసుకుని టైలర్‌ దగ్గరకు వెళ్లింది. తనకు నచ్చినట్టుగా మార్పులు చేయించింది. దాంతో ఒక్క నిమిషంలోనే చీరని కట్టుకోవచ్చు. రూపులోనూ ఏ మార్పూ లేదు. దీంతో మరిన్నింటిని అలాగే మార్పించుకుంది. దీంతో ఆమె పని సులువైంది. ఓసారి తనలాగే ఇంకెవరైనా ఇబ్బంది పడుతున్నారా అని పరిశీలించింది. చాలామందికి ఈ సమస్య ఉందని తెలిసి వివిధ రకాలవి 150 చీరలు తెప్పించి, ఇలాగే మార్పించింది. వాటి ఫొటోలు తీసి, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. మంచి స్పందన వచ్చింది. నెలలోనే చీరలన్నీ అమ్ముడయ్యాయి. దీన్నే వ్యాపారంగా మలచుకుంటే బాగుంటుందని భావించి 2019 జులైలో ‘ఇసాడోరా లైఫ్‌- రాప్‌ ఇన్‌ 1 మినిట్‌ శారీ’ బ్రాండ్‌ ప్రారంభించింది. దానికి ఆమె పెట్టిన పెట్టుబడి రూ. 3 లక్షలు. మొత్తం ఏడుగురితో ప్రారంభమైన ఈ సంస్థ వార్షికాదాయం నేడు రూ.కోటిన్నర.

‘ఫేస్‌బుక్‌లో కొంత ప్రాచుర్యం రావడంతో.. సంస్థతోపాటే సొంత వెబ్‌సైట్‌నీ రూపొందించాం. వేరే ఈకామర్స్‌ సంస్థల సాయమేమీ తీసుకోలేదు. ప్రారంభించిన మూడు నెలల్లోనే పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తుంటాయి. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అమ్మ టీచర్‌. ఇంకా టైలరింగ్‌ కూడా చేసేది. వాళ్లిద్దరూ మాకు మెరుగైన జీవితాన్నివ్వడానికి రేయింబవళ్లూ కష్టపడటం చూస్తూ పెరిగా. అలాంటిది ఇప్పుడు నేనే 40 మందికి ఉపాధిని ఇస్తుండటం చాలా ఆనందంగా ఉంది. మూడేళ్లలోపే మంచి విజయం సాధించాం. మొదట్నుంచీ నిమిషంలో కట్టుకునే చీరలపైనే దృష్టి. ఇటీవల ఇతర సంప్రదాయ వస్త్రాలపైనా దృష్టిపెట్టాం’ అంటోంది నేహా. అవసరం ఎన్నో అవకాశాలనిస్తుంది. వాటిని అందుకుని జాగ్రత్తగా అడుగులేస్తే.. రాణించడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని