Published : 23/02/2022 00:35 IST

పేద పిల్లల.. కలెక్టరు ‘అమ్మ’

ఆ మారుమూల ప్రాంత గిరిజన చిన్నారులకు వారాంతాలంటే ఇష్టం. ఆ సమయంలో వాళ్లకి అందే చాక్లెట్లు, దుస్తులు, పుస్తకాల కోసం ఆశగా ఎదురు చూస్తారు. వాటినందించే ఆమెకీ అంతే! అందుకే వంద కిలోమీటర్ల ప్రయాణాన్ని భారమనుకోదు. తల్లిలా ప్రేమను పంచుతుంది. కాబట్టే పిల్లలంతా ముద్దుగా ‘మాయ్‌’ అని పిలుచుకుంటారు. ఓ కలెక్టరు.. అమ్మగా ఎలా మారింది?

సుచిత్రసిన్హా 1996లో జంషెడ్‌పుర్‌లో ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అక్కడ సబర్‌ ఆదివాసీల  సంక్షేమం కోసం భారత్‌ సేవా సంఘం తరఫున కొందరు వలంటీర్లు ఈమెను కలిశారు. అప్పుడే మొదటిసారిగా వారి గురించి తెలిసిందీమెకు. అది నక్సల్స్‌ ప్రాంతం. అయినా వెరవక ధైర్యంగా అక్కడికెళ్లారీమె. వారంతా ఎంత పేదరికంలో మగ్గుతున్నారనేది ఆవిడకి అర్థమైంది. కనీసం నాలుగు అడుగుల ఎత్తు కూడా లేని పూరి గుడిసెల్లో నిలబడటానికీ అవకాశం లేదు. పాకుతూనే లోపలికెళ్లాలి. కనీస మౌలిక సదుపాయాలూ లేక వారు పడుతున్న ఇబ్బందులను చూసి చలించి పోయారు సుచిత్ర. 216 కుటుంబాలు నివసించే ఆ ప్రాంతం మారుమూలగా ఉండటంతో వారి సమస్యలు బయటి ప్రపంచానికి తెలియలేదు. పూర్తిగా అటవీ సంపదపై ఆధారపడి బతికే వారి జీవనోపాధి గడ్డితో అల్లే బ్యాగులే. వాటినీ దళారులు అతి తక్కువ ధరకు తీసుకుంటుండటంతో ఎంత పని చేసినా వారి జీవితాలు అంతంతమాత్రమే.

ఉపాధి కల్పించి... రెండేళ్లకే అక్కడి నుంచి తిరిగి దిల్లీ చేరుకున్నారు సుచిత్ర. తాను కలిసిన ఆ ఆదివాసీలకు ఉపాధి కల్పించాలనుకున్నారు. వారు అల్లే గడ్డి బ్యాగులను హస్తకళల అభివృద్ధి విభాగం అధికారికి చూపించి వారి సృజనాత్మకతను వివరించారు. అలా అయిదు ప్రాజెక్టులకు అనుమతిని పొందడమే కాదు.. వారి సంప్రదాయ హస్తకళలను ఆధునిక కాలానికి తగినట్లుగా మార్చడానికీ కృషి ప్రారంభించారు. ఇందుకోసం దిల్లీ నిఫ్ట్‌ డిజైనర్లను కలిసి, ఆదివాసీలకు కొత్త డిజైన్లపై శిక్షణ అందేలా చేశారు. మొదట భంగత్‌, మకుల, సమన్‌పుర్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ప్రారంభించి తర్వాత 12 గ్రామాలకు విస్తరించారు. బ్యాగులతోపాటు టేబుల్‌ ల్యాంప్స్‌, ప్లాంటర్స్‌, అలంకరణ సామాగ్రి వంటి పలురకాల ఉత్పత్తుల్లో శిక్షణనిప్పించారు.

ఆ బంధం ఇప్పటికీ... సుచిత్ర 2002లో ‘అంబాలికా’ అనే సేవా సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా గిరిజన మహిళలను చిరు వ్యాపారులుగా మార్చడానికి కృషి చేశారు. వారి పిల్లలకు విద్యనందించడానికి పాఠశాల, వైద్య సౌకర్యాలందేలా చూశారు. కలెక్టరుగా పదవీ విరమణ పొందినా, తన సేవలను మాత్రం కొనసాగించారీమె. 2011లో ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ను గిరిజనుల ఉత్పత్తుల ప్రదర్శనకు వేదికగా మార్చారు. ఈమె ప్రోత్సాహం, కృషి అక్కడి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు పలురకాల ఉత్పత్తులను తయారుచేసి, ఆన్‌లైన్‌లో విక్రయించి, ఒక్కొక్కరు నెలకు రూ.7000కు పైగా ఆర్జించగలుగుతున్నారు. ఇప్పటికీ రాంచీ నుంచి ప్రతి వారాంతంలో పుస్తకాలు, మిఠాయిలు, దుస్తులు, పాఠశాల బ్యాగులు వంటివాటితో దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ ఝార్ఖండ్‌, సారైకేలా జిల్లాలోని గిరిజన ప్రాంతాల చిన్నారులను కలుసుకుంటారీమె. వారితో రోజంతా ప్రేమగా గడిపి, వారికి అందుతున్న నిత్యావసరాలన్నింటినీ పరిశీలించి మరీ వస్తారు. స్థానిక మహిళల సమస్యలపై చర్చించి, సలహాలను అందించడమే కాదు, వారికి వైద్యసేవలూ చేరేలా చూస్తున్నారు. వాళ్ల జీవితాల్లో మార్పుకు కారణమైన ఈమెని అక్కడి వారంతా ‘మాయ్‌’ అని ప్రేమగా పిలుచుకుంటారు. పదవీ విరమణ చేసినా పేద ఆదివాసీల సంక్షేమం కోసం ఇంతగా తపిస్తున్న ఈవిడ కథ మరెందరికో స్ఫూర్తిని కలిగిస్తుంది కదూ.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని