వయసంటే అంకె మాత్రమే!

సాధించాలనే పట్టుదల, తగిన కృషి ఉంటే చాలు.. సమస్యలెన్నెదురైనా విజయాన్ని ఆపలేవు. పిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతిని పొందేవారి నుంచి ఎనభైల్లో అడుగుపెట్టినా... అనుకున్నది సాధిస్తున్న వారంతా మన శక్తికి నిర్వచనాలే. అందుకు నిదర్శనమే వీళ్లంతా...

Published : 10 Mar 2022 02:31 IST

సాధించాలనే పట్టుదల, తగిన కృషి ఉంటే చాలు.. సమస్యలెన్నెదురైనా విజయాన్ని ఆపలేవు. పిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతిని పొందేవారి నుంచి ఎనభైల్లో అడుగుపెట్టినా... అనుకున్నది సాధిస్తున్న వారంతా మన శక్తికి నిర్వచనాలే. అందుకు నిదర్శనమే వీళ్లంతా...

జాతీయస్థాయిలో మహిళా ఎయిర్‌పిస్తోల్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకాన్ని అందుకున్నప్పుడు ఇషా సింగ్‌ వయసు 13 ఏళ్లే. తొమ్మిదేళ్ల వయసులో షూటింగ్‌లో శిక్షణ ప్రారంభించిన ఈమె ఏడాదికే, 10 ఎం.ఎం. ఎయిర్‌ పిస్తోల్‌ క్యాటగిరీలో తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది. ఈ హైదరాబాద్‌ షూటర్‌ ప్రస్తుత వయసు 17 ఏళ్లు. కైరో షూటింగ్‌ ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో రజతం గెలుచుకుంది. 2019లో జర్మనీలో జరిగిన జూనియర్‌ వరల్డ్‌ కప్‌ పోటీలో రజతం, ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాలను సొంతం చేసుకుంది. 18ఏళ్లలోపు వారికి అందించే ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌’ను అందుకొంది.

తెలంగాణాకు చెందిన 21ఏళ్ల మాలావత్‌ పూర్ణ 13వ ఏటనే ఎవరెస్ట్‌ అధిరోహించి అతి పిన్నవయసున్న పర్వతారోహకురాలిగా రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల... అరుణారెడ్డి జిమ్నాస్టిక్స్‌లో వరల్డ్‌కప్‌ను సాధించిన తొలి భారతీయురాలు. తెలంగాణా ప్రభుత్వం నుంచి రూ.2 కోట్లు నగదు బహుమతినీ అందుకుంది. 

వైకల్యాన్ని ఓడించి.. హైదరాబాద్‌కు చెందిన 38 ఏళ్ల మల్లవరపు బాలలతను వైకల్యం ఓడించలేకపోయింది. 22వ ఏట సివిల్స్‌ రాసి 399వ ర్యాంకును తెచ్చుకుంది. రక్షణ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయిలో విధులు నిర్వహించారు. ఇప్పుడు ఆసక్తి ఉన్నవారికి శిక్షణనిస్తున్నారు. ‘సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ’ స్థాపించి పదేళ్లలో వందల మందికి శిక్షణనందించారు. ఈమె శిష్యుల్లో 30 మంది అమ్మాయిలు సహా దాదాపు 100 మంది సివిల్స్‌కు ఎంపికై ఐఏఎస్‌, ఐపీఎస్‌ కలను నెరవేర్చుకున్నారు. బాలలత తొలిసారి సివిల్స్‌ రాసిన 12 ఏళ్ల తర్వాత రెండోసారి సివిల్స్‌ రాసి 167వ ర్యాంకును సాధించి తనలో చేవ తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారు.

నచ్చినదాంట్లో..  సాధారణంగా కెరియర్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చే వయసులో ఆ రంగంలో అడుగుపెట్టి తామేంటో నిరూపిస్తున్నారెందరో మహిళలు. వడోదరాకు చెందిన 82 ఏళ్ల డాక్టర్‌ భగవతీ ఓజా వీరిలో ఒకరు. వైద్యవృత్తి నుంచి విరమించిన తరువాత క్రీడలు, సాహసయాత్రలను ఎంచుకున్నారు. ఈమెకు ఈత, స్కూబా డైవింగ్‌ హాబీలు కాగా, పర్వతారోహణలో శిక్షణ పొంది హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కూ వెళ్లారు. కోల్‌కతా నుంచి కన్యాకుమారి, వడోదరా నుంచి వాఘా సరిహద్దు వరకు సైకిల్‌పై చుట్టి వచ్చారు. ఈ సాహసాలకుగాను ‘ఓల్డర్‌ పర్సన్స్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ అడ్వంచర్‌’ విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

వయసు అంటే కేవలం ఒక సంఖ్య మాత్రమే.. విజయసాధనకు వయసుతో పనిలేదు అంటున్న వీరంతా మహిళాశక్తికి నిర్వచనమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్