‘నాగా’ నుంచి రాజ్యసభకు తొలి మహిళ!

నాగాలాండ్‌ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన ఫంగ్నోన్‌ కొన్యాక్‌... ఆ రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి, సేవా

Published : 02 Apr 2022 03:05 IST

నాగాలాండ్‌ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన ఫంగ్నోన్‌ కొన్యాక్‌... ఆ రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి, సేవా కార్యక్రమాలతో నాయకురాలిగా ఎదిగి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందిన ఫంగ్నోన్‌ ప్రయాణమిది...

నాగాలాండ్‌ రాష్ట్రం ఏర్పడి 60 ఏళ్లు కావస్తోంది. 13సార్లు శాసనసభకు ఎన్నికలు జరిగినా... ఇప్పటివరకూ అక్కణ్నుంచి ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యే కాలేదు. అలాగని అక్కడ మహిళల్లో రాజకీయ చైతన్యం లేదని కాదు. ఓటర్లలో మహిళలే ఎక్కువ. ఓటింగ్‌ శాతం కూడా వాళ్లదే ఎక్కువ. అయినా కండబలం, ధనబలం విషయంలో వాళ్లు మగవాళ్లతో ఎన్నికల బరిలో పోటీ పడలేకపోతున్నారు. దాంతో రాజకీయ నాయకుల్లో మహిళలూ తక్కువే. రాజ్యసభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ తప్పనిసరి అంటూ ఇటీవల నాగాలాండ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో ఈ మధ్యనే ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు మహిళని బరిలోకి దించక తప్పలేదక్కడ పార్టీలకు. అధికార భారతీయ జనతా పార్టీ ఫంగ్నోన్‌ పేరును ప్రతిపాదించగా.. మిత్రపక్షాలూ మద్దతు తెలిపాయి. ప్రతిపక్షంలో ఆమెకు సరితూగే అభ్యర్థి లేకపోవడంతో మార్చి 23న రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైంది ఫంగ్నోన్‌. 2017లో భాజపాలో చేరిన ఫంగ్నోన్‌ ప్రసుతం రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు. ‘పార్లమెంటులో నాగాలాండ్‌ సమస్యలను చర్చించడానికి ఈ అవకాశాన్ని 100 శాతం ఉపయోగించుకుంటా’ అని చెబుతోన్న ఫంగ్నోన్‌కు సామాజిక సేవకురాలిగా మంచి పేరుంది.

తల్లిదండ్రుల నుంచి..
ఫంగ్నోన్‌ పుట్టి పెరిగింది ఆ రాష్ట్ర రాజధాని నగరం కొహిమాలోనే. ఎంత పెద్ద సమస్యనైనా ప్రశాంతంగా ఆలోచించడం ఉపాధ్యాయురాలిగా పని చేసిన తన తల్లినుంచి నేర్చుకుంది. తండ్రి విశ్రాంత ప్రభుత్వాధికారి. ఆయన నుంచి ప్రజా సేవను వారసత్వంగా తీసుకుంది. రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు ‘వాలో ఆర్గనైజేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున 16 ఏళ్లు పని చేసింది. ఆ సంస్థలో ఉంటూ... మహిళల ఆరోగ్యం, లింగవివక్ష, చిన్నారుల విద్య, ఆరోగ్యం మొదలైన అంశాలపైన దృష్టి పెట్టి పనిచేసింది. ఈ అనుభవం ఈమెకు రాష్ట్ర సామాజిక అంశాలు, ప్రజల స్థితిగతులపైన అవగాహననిచ్చాయి. దిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో మాస్టర్స్‌ చేసింది ఫంగ్నోన్‌. ఆ సమయంలో ‘ట్యూన్సంగ్‌ మన్‌ స్టూడెంట్స్‌’ యూనియన్‌ దిల్లీ విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉండేది. అప్పుడే రాజకీయాలతోనూ పరిచయమైంది. ఆ తర్వాత కొన్యాక్‌ విద్యార్థుల సంఘానికి సలహాదారురాలిగా, నాగాలాండ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు బోర్డు సభ్యురాలిగా, జువనైల్‌ జస్టిస్‌ బోర్డు సభ్యురాలిగా రాష్ట్ర స్థాయిలో పలు బాధ్యతలు నిర్వర్తిస్తూ విభిన్న రంగాల్లోని సమస్యలపైన అవగాహన కల్పించుకుంది. రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆమెలోని సహజమైన నాయకత్వ లక్షణాలు అటువైపు అడుగులు పడేలా చేశాయి. 2017లో భాజపాలో చేరింది ఫంగ్నోన్‌. ‘జాతీయస్థాయి రాజకీయ పార్టీలో చేరాలనుకున్నా. నా ఆసక్తి భాజపాలో సభ్యత్వం తీసుకునేలా చేసింది. ఎంపీగా మహిళా సంక్షేమం, సాధికారత కోసం కృషి చేస్తా. సామాజిక, రాజకీయ, ఆర్థికపరంగా నాగాలాండ్‌లో ప్రతి మహిళా ఎదిగేలా చేయాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పే ఫంగ్నోన్‌ రాష్ట్రం నుంచి పార్లమెంటులో అడుగుపెడుతున్న రెండో మహిళ మాత్రమే. 1977లో నాగాలాండ్‌ నుంచి రానో ఎం షాయిజా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఫంగ్నోన్‌ రాకతో అయినా అక్కడ మార్పు వస్తుందేమో చూడాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్