‘రాయల్‌ సొసైటీ’లో మన శాస్త్రవేత్త

‘రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌’లో ఫెలోషిప్‌ సాధించడమంటే శాస్త్రవేత్తగా ప్రపంచస్థాయి గుర్తింపు లభించినట్లే. అలాంటి అరుదైన గుర్తింపుని సంపాదించారు దిల్లీకి చెందిన రసాయన శాస్త్రవేత్త డా. బిమ్లేష్‌ లోచబ్‌. 360 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సొసైటీలో స్థానం సంపాదించిన రెండో భారతీయ మహిళ ఈమె. ఇంతటి గొప్ప గౌరవం పొందడం ఆమెకు ఎలా సాధ్యమైందంటే...

Published : 11 Apr 2022 02:08 IST

‘రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌’లో ఫెలోషిప్‌ సాధించడమంటే శాస్త్రవేత్తగా ప్రపంచస్థాయి గుర్తింపు లభించినట్లే. అలాంటి అరుదైన గుర్తింపుని సంపాదించారు దిల్లీకి చెందిన రసాయన శాస్త్రవేత్త డా. బిమ్లేష్‌ లోచబ్‌. 360 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సొసైటీలో స్థానం సంపాదించిన రెండో భారతీయ మహిళ ఈమె. ఇంతటి గొప్ప గౌరవం పొందడం ఆమెకు ఎలా సాధ్యమైందంటే...

బిమ్లేష్‌ లోచబ్‌ పుట్టి పెరిగింది దిల్లీలో. చిన్నప్పట్నుంచీ ఆమెకు బ్యాటరీలంటే ప్రత్యేకమైన ఆసక్తి. గడియారాన్ని నడిపించే, టార్చ్‌లైట్‌ వెలిగించే ఆ బ్యాటరీల్లో ఏం దాగుందో చూడాలన్న ఉత్సుకతతో పాత బ్యాటరీలు పగలగొట్టేవారు. దాన్లోని నల్లటి పదార్థం గురించి టీచర్లని అడిగేవారు. ఆ ఆసక్తి అక్కడితో ఆగిపోలేదు. దాని లోగుట్టుని తెలుసుకోవాలని రసాయన శాస్త్రంపైన ఇష్టం పెంచుకున్నారామె. ఐఐటీ దిల్లీ నుంచి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంటెక్‌.. ఆపైన ఆక్స్‌ఫర్డ్‌ నుంచి పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం నోయిడాలోని శివ్‌ నాడార్‌ యూనివర్సిటీలో ఆచార్యురాలిగా పనిచేస్తున్న లోచబ్‌... బ్యాటరీలపైన పరిశోధనలు చేస్తున్నారు. రసాయనశాస్త్రంలో పరిశోధనలకుగానూ తాజాగా ‘రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ’ ఫెలోగా ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మ్యాథ్స్‌, బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.. విభాగాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల్లో ఏటా దాదాపు 50 మందికి ఈ సొసైటీలో సభ్యత్వం దొరుకుతుంది. మైక్రోబయాలజిస్ట్‌ గగన్‌దీప్‌ కంగ్‌ మనదేశం నుంచి ఈ సొసైటీలో స్థానం సంపాదించిన తొలి మహిళ(2019).

భారతీయ కోణంలో పరిశోధనలు..

గత 30 ఏళ్లుగా లిథియం- అయాన్‌ బ్యాటరీలనే పరిశ్రమలో అన్ని వర్గాలూ వాడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటి వినియోగం మరింత పెరుగుతోంది. అందుకే లిథియం బ్యాటరీల్ని పర్యావరణహితంగా, ఎక్కువ శక్తినిచ్చేలా తీర్చిదిద్దాలనుకున్నారు లోచబ్‌. తాను ఆక్స్‌ఫర్డ్‌లో పరిశోధనలు చేసినపుడు ఉపయోగించిన రసాయన పదార్థాలు ఖరీదైనవి. భారత్‌లాంటి దేశాల్లో అంత ఖరీదైన వాటితో పరిశోధనలు సాధ్యం కాదని గ్రహించి ప్రత్యామ్నాయాల కోసమూ ప్రయత్నించాలనుకున్నారు. ఎలక్ట్రో కెమిస్ట్‌ అయిన ఐఐటీ బోంబే ప్రొఫెసర్‌ సాగర్‌ మిత్రతో కలిసి ఆ దిశగా పరిశోధనలు చేస్తూ సఫలీకృతమయ్యారు. మనదేశంలో లిథియం నిల్వలు చాలా తక్కువ. వీటికి ప్రత్యామ్నాయంగా సోడియం, మెగ్నీషియం వినియోగించేందుకూ ప్రయోగాలు చేస్తున్నారామె. అలాగే పెట్రో కెమికల్స్‌ను శుద్ధి చేయగా వృథాగా వచ్చే సల్ఫర్‌కు జీడిమామిడి తొక్క నుంచి తీసే ద్రవం, లవంగం నూనెలను కలిపి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఖర్చు తక్కువ, పర్యావరణానికీ మేలు. వీటికి సంబంధించి లోచబ్‌ పరిశోధన వివరాలు పలు సైన్స్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. దాంతో ఈ బ్యాటరీలపైన ప్రపంచవ్యాప్తంగా ఆదరణ, ఆసక్తి కలిగింది. ఆ గుర్తింపే లోచబ్‌కు రాయల్‌ సొసైటీలో చోటు దక్కేలా చేసింది. ‘దేశవ్యాప్తంగా చాలా వినూత్నమైన పరిశోధనలు జరుగుతున్నాయిపుడు. ఆవిష్కరణల్ని మార్కెట్‌లోకి తేవాలంటే మాత్రం పరిశ్రమలూ, విద్యాసంస్థలూ, ప్రభుత్వం కలిసి పనిచేయాలి’ అని చెప్పే లోచబ్‌.. ‘స్టెమ్‌ రంగంలో కెరియర్‌ అంటే మగవాళ్లకే అన్న ధోరణి ఉంది. టీచర్లూ తల్లిదండ్రులూ చిన్నప్పట్నుంచే అమ్మాయిల సామర్థ్యాల్ని తక్కువగా చూస్తారు. దాంతో అబ్బాయిలతో పోలిస్తే వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఈ తీరు మారాలంటారామె. లోచబ్‌ లాంటి వాళ్లకి దక్కుతున్న గుర్తింపుతో ఈ విషయంలో కచ్చితంగా ఎంతో కొంత మార్పు వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్