మహీంద్రా మెచ్చిన అనుష్క..

పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో మగవాళ్లలా మహిళలు రాణించలేరనేది పాతుకుపోయిన భావన. ఒక వేళ మీకూ ఆ అభిప్రాయం ఉంటే ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన అనుష్క పాటిల్‌ గురించి తెలుసుకోండి. ఆ అభిప్రాయాన్ని తక్షణమే మార్చుకుంటారు..

Published : 04 May 2022 01:16 IST

పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో మగవాళ్లలా మహిళలు రాణించలేరనేది పాతుకుపోయిన భావన. ఒక వేళ మీకూ ఆ అభిప్రాయం ఉంటే ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన అనుష్క పాటిల్‌ గురించి తెలుసుకోండి. ఆ అభిప్రాయాన్ని తక్షణమే మార్చుకుంటారు..

12 ఏళ్ల క్రితం.. ఔరంగాబాద్‌ ఎమ్‌ఐటీలో చదువు పూర్తవ్వగానే, నాసిక్‌లోని మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థలో ఉద్యోగం సంపాదించింది అనుష్క. తన స్నేహితురాళ్లు ఎంచుకున్న వృత్తులకంటే భిన్నమైన పనిని ఎంచుకుంది. ఆ సంస్థలో మొదటి మహిళా ఇండస్ట్రియల్‌ ఇంజినీర్‌గా అడుగుపెట్టిందామె. చుట్టూ మగవాళ్లే ఉన్నా... తన సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచుకుంటూ, కొన్నిరోజులకే ఫ్లోర్‌మేనేజర్‌గా ఎదిగింది. అక్కడితో ఆగలేదు. నాలుగేళ్ల నుంచీ మహారాష్ట్రలోని చకన్‌ యూనిట్‌లో ఎక్స్‌యూవీ-700 కార్ల తయారీ విభాగానికి ప్రాసెస్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. 700 మంది ఇంజినీర్లు, ఇతర సిబ్బంది ఆమె ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఏమాత్రం అలక్ష్యం చేసినా ఆ ప్రభావం బ్రాండ్‌ ప్రతిష్ఠపైనా, అమ్మకాలపైనా పడుతుంది. అంతటి సవాల్‌తో కూడుకున్న పనిని చేస్తూ, ప్రశంసలు అందుకుంటోంది అనుష్క. ‘ఇద్దరాడపిల్లలకు తల్లి. అటు కుటుంబాన్ని చూసుకుంటూనే, టీమ్‌లీడ్‌గా సంస్థలోని వందల మంది సిబ్బందిని ఏకతాటిపై నడిపించడం అంటే మామూలు విషయం కాదు’ అంటూ ట్విటర్‌ ద్వారా ప్రశంసించారు అదే సంస్థ చీఫ్‌ కస్టమర్‌, బ్రాండ్‌ ఆఫీసర్‌ ఆషాఖర్గా. ఆ పోస్టుని చదివిన ఆనంద్‌ మహీంద్ర అనుష్కని స్ఫూర్తిదాయక వ్యక్తిగా అందరికీ పరిచయం చేశారు. ‘పనిచేసే చోట స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించాలని అనుకుంటున్నాం. దాన్ని వేగంగా చేస్తే మంచిది. లేకపోతే అనుష్కలాంటి వాళ్ల నైపుణ్యాలని మిస్‌ అవుతాం’ అన్న ఆయన ట్వీట్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది. ‘అరె నా అభిమాన ఎక్స్‌యూవీ-700 వెనుక ఓ మహిళ ఉందా?’ అని కొందరు ఆశ్చర్యపోతుంటే...‘ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తారడానికి మీరే స్ఫూర్తి. మా ఆడపిల్లల్నీ వారు కోరింది చదివిస్తాం’ అంటూ నెటిజన్ల నుంచి సానుకూల స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్