నీటి ఏటీఎంలతో... పేదల దాహార్తిని తీరుస్తోంది!

పేదవారికి అన్నం పెట్టడం, దుస్తులివ్వడం, చదువు చెప్పించడం లాంటివి అందరూ చేస్తారు. మరి అంతకంటే ఎక్కువ అవసరమైన నీటి విషయంలో ఎవరూ సాయం చేయరెందుకు? ఈ ప్రశ్నే చిన్మయీ ప్రవీణ్‌ని తొలిచేది. అందుకు ఆమె కనుక్కొన్న పరిష్కారమే మంచినీటి ఏటీఎంలు! కర్ణాటక వ్యాప్తంగా 900 నీటి ఏటీఎంలు ప్రారంభించి ప్రాణాధారమైన నీటిని అందరికీ అందిస్తున్నారు..

Updated : 06 May 2022 02:58 IST

పేదవారికి అన్నం పెట్టడం, దుస్తులివ్వడం, చదువు చెప్పించడం లాంటివి అందరూ చేస్తారు. మరి అంతకంటే ఎక్కువ అవసరమైన నీటి విషయంలో ఎవరూ సాయం చేయరెందుకు? ఈ ప్రశ్నే చిన్మయీ ప్రవీణ్‌ని తొలిచేది. అందుకు ఆమె కనుక్కొన్న పరిష్కారమే మంచినీటి ఏటీఎంలు! కర్ణాటక వ్యాప్తంగా 900 నీటి ఏటీఎంలు ప్రారంభించి ప్రాణాధారమైన నీటిని అందరికీ అందిస్తున్నారు..

చిన్నతనం నుంచీ చిన్మయి మార్కులను చూసి నవ్వేవారందరూ! అంతటి సాధారణ విద్యార్థి ఆమె. వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడూ అవే ఆటంకాలయ్యాయి. ఈమెది కర్ణాటకలో చిన్న పల్లెటూరు. వేసవి వస్తే ప్రజలు పడే నీటికష్టాలు ఆమెకి సుపరిచితమే. పెళ్లయ్యాక బెంగళూరు వచ్చింది. భర్త, పాప.. ఆనందంగా సాగే జీవితం. కానీ తనకు ఓ గృహిణిగానే మిగిలిపోవాలని లేదు. నలుగురికీ సాయం చేసేలా.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలనుండేది. అదే విషయాన్ని భర్త ప్రవీణ్‌తో పంచుకోగా.. ‘నువ్వేది చేయాలనుకున్నా నీ వెనక నేనుంటా’ అని వెన్నుతట్టాడు. అప్పుడే కలుషిత నీటితో జబ్బులకు గురవుతున్న వారి కథనాలను చూసింది. వాళ్లకేదైనా సాయం చేయాలనుకుంది.

‘కొన్నాళ్లపాటు దగ్గర్లోని మురికివాడల వాళ్లకి ఉచితంగా తాగునీరు పంపిణీ చేశాం. కొద్దిరోజులు చేస్తే ఉపయోగమేముంటుంది? పైగా చాలా మారుమూల గ్రామాల్లో ఇదే పరిస్థితి అని అర్థమైంది. దీంతో 2019లో గెవిన్‌ వాచ్‌స్టమ్‌ (జర్మన్‌ భాషలో ఏ ఆటంకాల్లేకుండా ఎదుగు అనర్థం) పేరుతో సంస్థను ప్రారంభించా. దీని ద్వారా నామమాత్ర ధరకు మంచినీటిని అందివ్వడం ఉద్దేశం. ఈ ఆలోచనతో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులను కలిశా. బయోడేటాలో డిగ్రీ వరకూ నా మార్కులు చూసి నొసలు చిట్లించేవారు. ఇక అవకాశమెలా ఇస్తారు? కానీ మావారు నన్ను నమ్మి అండగా నిలిచారు. అలా సొంత ఖర్చుతో పుణె నుంచి యంత్రాలను తెప్పించి శ్రీరాంపురలో 24 గంటలూ అందుబాటులో ఉండే వాటర్‌ ఏటీఎం ఏర్పాటు చేశాం. లీటర్‌ నీటికి 25 పైసలు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఏదైనా ఉన్నతంగా సాధించడానికి డిగ్రీలొక్కటే చాలవు. లక్ష్యం, దాన్ని చేరుకోవాలన్న తపన ఉండాలని నమ్ముతాన్నేను. నేను చదువులో వెనకే కావొచ్చు! కానీ ప్రతి తరగతినీ దాటడానికి ఎవరి సాయం తీసుకోవాలి? వాళ్లని ఎలా సంప్రదించాలన్న అవగాహన ఉండేది. అదే ఈ వ్యాపారంలో నెట్‌వర్కింగ్‌కి సాయపడింది’ అని చెబుతుంది చిన్మయి.

యంత్రాల కోసం పుణె, జర్మనీ సంస్థలతో ఒప్పందం చేసుకుందీమె. చిన్న, మధ్యతరహా సంస్థల విభాగమూ సాయమందించడంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా ఈమె ఎటీఎంలు ప్రారంభమయ్యాయి. 16 జిల్లాల్లో 900కుపైగా ఏర్పాటు చేసింది. ఏడు దశల్లో శుభ్రత, రోజంతా నీరు అందుబాటులో ఉండటం, సమస్య వస్తే వెంటనే సాయమందించేలా కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌.. సంస్థ ప్రత్యేకత. వీటిల్లో మహిళలకే ఎక్కువ అవకాశమిచ్చింది. నిర్వహణ నుంచి సర్వీసింగ్‌ వరకు పూర్తిగా ఆడవాళ్లే చూసుకునే ప్లాంట్లూ ఉన్నాయి. ప్రతి బుధవారం ఉచితంగా అందిస్తుంది. త్వరలో దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ మూడేళ్లలో ఉత్తమ వ్యాపారవేత్త సహా ఎన్నో అవార్డులనూ అందుకుంది. పిల్లల్లో సామాజిక నైపుణ్యాలపై శిక్షణన్వివడంతోపాటు మానసిక ఆరోగ్యంపైనా అవగాహన కల్పిస్తోంది.


ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని తాగే హక్కు ఉంది. ఆ లక్ష్యంతో ఈ సామాజిక వ్యాపారాన్ని విస్తరించిన చిన్మయి రాష్ట్రవ్యాప్తంగా 900 ఎటీఎంలని ఏర్పాటుచేశారు. విస్తారా ఫౌండేషన్‌ని స్థాపించి... చదువు మానేసిన పిల్లలని తిరిగి బడుల్లో చేరుస్తూ, నీటి వినియోగంపై చైతన్యం తెస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్