ఆన్‌లైన్‌ యోగినులు!

ఇంటి పని పక్కనపెట్టి... ఉదయాన్నే జిమ్ము, జాగింగ్‌ అంటూ వ్యాయామాలు చేయగలిగే అవకాశం ఎంతమంది మహిళలకు ఉంటుంది? అలాగని నిర్లక్ష్యం చేస్తే థైరాయిడ్లు, పీసీఓడీలు! ఇలాంటి సమయంలో మీకు అండగా ఉంటాం అంటూ... నట్టింట్లోనే నేర్పేస్తున్నారీ ఆన్‌లైన్‌ యోగా గురువులు. తమ ఆరోగ్య పాఠాలతో దేశవిదేశాల్లో వేల మందికి మేలు చేస్తున్న ఆన్‌లైన్‌ యోగినుల గురించి చదవండి...

Updated : 21 Jun 2022 08:02 IST

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఇంటి పని పక్కనపెట్టి... ఉదయాన్నే జిమ్ము, జాగింగ్‌ అంటూ వ్యాయామాలు చేయగలిగే అవకాశం ఎంతమంది మహిళలకు ఉంటుంది? అలాగని నిర్లక్ష్యం చేస్తే థైరాయిడ్లు, పీసీఓడీలు! ఇలాంటి సమయంలో మీకు అండగా ఉంటాం అంటూ... నట్టింట్లోనే నేర్పేస్తున్నారీ ఆన్‌లైన్‌ యోగా గురువులు. తమ ఆరోగ్య పాఠాలతో దేశవిదేశాల్లో వేల మందికి మేలు చేస్తున్న ఆన్‌లైన్‌ యోగినుల గురించి చదవండి...


చైనా, కొరియా వాళ్లకూ నేర్పుతున్నా...

యోగాలో నాది 30 ఏళ్ల అనుభవం. మొదట్లో విదేశాల్లో ఉండే కొద్దిమంది మనవాళ్లకు మాత్రమే స్కైప్‌లో చెప్పేదాన్ని. కొవిడ్‌ తర్వాత మన దేశం లో వివిధ ప్రాంతాల నుంచీ కూడా చాలా మంది ఆన్‌లైన్‌లో యోగా నేర్పమని అడిగేవారు. ఇప్పటి దాకా కెనడా, రష్యా, జర్మనీ, సింగపూర్‌, అమెరికా, దక్షిణాఫ్రికా, చైనా, శ్రీలంక దేశాలకు చెందిన రెండువేలమందికి పైగా విదేశీయులకూ, మనవాళ్లకీ నేర్పాను. కొవిడ్‌ సమయంలో... గవర్నర్‌ తమిళిసై, సబితా ఇంద్రారెడ్డి, దత్తాత్రేయ, నటులు రాజశేఖర్‌, జగపతిబాబు వంటివారు ఆన్‌లైన్‌లోనే పాఠాలు వినేవారు. అమెరికాలో కొన్ని ఆసుపత్రుల సిబ్బందికీ పాఠాలు చెప్పాను. విదేశీయులకు నేర్పాలంటే చాలా ఓపిక, సమయం ఉండాలి. ఎందుకంటే వాళ్లు ప్రతి విషయాన్నీ శాస్త్రీయంగా తెలుసుకున్న తర్వాతే ఆచరిస్తారు. చైనా, కొరియా విద్యార్థులకు కొన్ని పదాలు ఉచ్చరించడం కష్టమే అయినా శ్రద్ధగా నేర్చుకుని ఆచరించడం సంతోషంగా ఉంటోంది. నా పాఠాలు చూశాక... కెనడా ప్రభుత్వం అక్కడ యోగా కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఎకరంన్నర స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది. వచ్చే నెలలో అది ప్రారంభమవుతుంది. మగవాళ్లలో ఎక్కువ మంది వ్యాధినిరోధక శక్తిని పెంచుకొనేందుకు ప్రాణాయామాలు నేర్చుకుంటే... మహిళల్లో అధికశాతం బరువు తగ్గడానికీ, పీసీఓడీ, థైరాయిడ్‌ సమస్యలను తగ్గించుకోవడానికి మార్గాలు చెప్పమంటున్నారు. మొదట్లో ఉచితంగానే చెప్పా. ప్రస్తుతం నెలకి రెండువేల వరకూ తీసుకుంటున్నా. అవసరం, ఆసక్తి ఉండి ఫీజు కట్టలేం అన్నవాళ్లకి ఉచితంగానే నేర్పిస్తున్నా. యోగా టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సునీ అందిస్తున్నా. దీన్ని నేర్చుకోవడానికి ఎంతోమంది మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్లలో చాలామంది ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతూ ఉపాధీ పొందుతున్నారు. ఈ విధానంలో ఇబ్బందులు ఉండవా అంటే... యోగాసనాలు వేసేటప్పుడు భంగిమల్లో తప్పుంటే గురువు దగ్గరుండి మార్చడానికి ఉండదు. అలాంటి కొన్ని ఇబ్బందులు తప్పవు మరి.

- కానుమిల్లి అరుణాదేవి, హైదరాబాద్‌


నా ఆరోగ్యం కోసం మొదలుపెడితే...

ఎంకాం, ఎంబీయే చేసి హైదరాబాద్‌ హుసేనీ ఆలం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశా. కొన్నాళ్లు బీమా సంస్థలో పనిచేశా. అక్కడ మంచి స్థానాన్నే అందుకున్నా. ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉన్నా... ఆ దారి నచ్చక ఉద్యోగాన్ని వదిలేశాను. 27 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడ్డా. థైరాయిడ్‌ వేధించేది. నెలసరులు సరిగా వచ్చేవి కావు. వైద్యం చేయించుకుంటే మందుల మోతాదు ఎక్కువై... కీళ్లలో విపరీతమైన నొప్పి, స్లిప్‌డిస్క్‌ వంటి సమస్యలు ఎదురయ్యాయి. సరిగా కూర్చోలేకపోయేదాన్ని. డైట్‌ మారిస్తే లాభం ఉంటుందేమో అనుకొన్నా. సరైన అవగాహన లేక దాంతోనూ ఇబ్బందులే. తెలిసిన వాళ్లు యోగా ప్రయత్నించమని సూచించారు. మంచి గురువుని సంప్రదించి పరిజ్ఞానాన్ని పెంచుకున్నా. కైవల్యథామ్‌ వంటి చోట్లా యోగా నేర్చుకున్నా. ఉత్తరాఖండ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి యోగాలో ఎమ్మే చేశా. నెమ్మదిగా నా ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం యోగాలో పీహెచ్‌డీ కోసం సిద్ధం అవుతున్నా. 2017 నుంచీ యోగా పాఠాలు చెబుతున్నా.. కొవిడ్‌ నుంచీ ఆన్‌లైన్‌లో నేర్పుతున్నా. మొదట్లో కొంత ఇబ్బంది ఉన్నా యోగా అవసరం ఉన్న ఎంతోమంది స్త్రీలను చూశాక ఓపిక పెరిగింది. న్యూయార్క్‌, న్యూజెర్సీ, ఆస్ట్రేలియా, సింగపూర్‌, కెనడాల నుంచి మాత్రమే కాదు బాపట్ల వంటి గ్రామాల నుంచి రైతులు కూడా నేర్చుకుంటున్నారు. స్త్రీల బాధలని తోటి మహిళలే అర్థం చేసుకోగలరు. అవి ఇంట్లో వాళ్లకి చెప్పినా అర్థం కావు. మెదడులో ట్యూమర్‌ ఉన్న ఒకావిడ నా దగ్గర యోగా నేర్చుకుంటున్నారు. ఆమె అనారోగ్యంతో భర్త విసిగిపోయాడు. నాకు మాత్రం యోగాకున్న శక్తి ఇటువంటప్పుడే తెలుస్తుందనిపించింది. అటువంటి వారిలో యోగా సాయంతో సమస్యలని ఎదిరించే శక్తిని పెంచుతున్నా. చెల్లించలేని వాళ్ల దగ్గర ఫీజు తీసుకోను. ఎంతిస్తే అంతే. ఇప్పటివరకూ ఏడొందలమందికి పైగా ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పాను.

- తాటికొండ మనోజ్ఞ, హైదరాబాద్‌


ఐటీ వదిలి...

మా సొంతూరు విజయనగరం జిల్లా సాలూరు. ఎంబీయే చేశా. ఐటీ ఉద్యోగినిగా విజయవాడ, బెంగళూరు, జైపూర్‌, అమెరికా వంటి చోట్ల ఇరవైఏళ్లకు పైగా పని చేశా. సేంద్రియ వ్యవసాయంపై ఇష్టంతో... అమెరికా నుంచి వచ్చేశా. సాలూరు దగ్గరో పల్లెటూరులో పది ఎకరాలు తీసుకుని అందులో మొక్కజొన్న, అరటి, కాయగూరల్ని పండించాను. తర్వాత నెమ్మదిగా ఐటీ ఉద్యోగం నుంచి యోగా వైపు అడుగులు వేశాను. నాకు చిన్నప్పటి నుంచీ యోగా అంటే ఇష్టం. అమ్మనాన్నలూ ప్రోత్సహించారు. సిద్ధసమాధి యోగా వంటివీ సాధన చేశా. మధ్యలో అమెరికా వెళ్లినప్పుడు కాస్త దూరమైనా తిరిగొచ్చాక.. వ్యవసాయం చేస్తూనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి యోగాలో పీజీ డిప్లొమా చేశాను. భీమిలిలో ఉన్న యోగా కాన్షస్‌నెస్‌ ట్రస్ట్‌లో చేరి మరిన్ని విషయాలు తెలుసుకున్నా. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచీ ఎమ్మెస్సీ యోగా చేశాను. ప్రస్తుతం అమ్మానాన్నల కోసం తెనాలిలో ఉంటూ ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నా. అమెరికా, స్వీడన్‌, డెన్మార్క్‌, యూకే, దక్షిణాఫ్రికాలో ఉంటున్న వారికి యోగాపాఠాలు నేర్పుతున్నా. నా దగ్గర నేర్చుకొనే వారిలో స్త్రీలే ఎక్కువ. ఆడవాళ్లకి ఒత్తిడి ఎక్కువ. జాగింగ్‌, జిమ్‌లకి వెళ్లలేని వారికి, స్త్రీలకు ఇది సౌకర్యవంతం కూడా. డెబ్భై, ఎనభైల్లో ఉన్న వాళ్లు కూడా ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.

- ఈడ్పుగంటి యామిని, తెనాలి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్