ఇల్లాలు నవ్వితే ఇంటిల్లిపాదీ నవ్వినట్టే!

‘ఉదయం లేవడమే అదృష్టం... ఉన్నంతలో మూడు పూటలూ భోం చేస్తాం, భర్తాపిల్లలతో కలిసి ఉంటాం. మరి, సంతోషంగా ఉండొచ్చుగా... ఉండం. ఆఫీసులో పనీ, పిల్లల పరీక్షల ఫలితాలూ.. ఇలా ఏవేవో ఆలోచిస్తూ ఆందోళన పడతాం. సమస్యలు ఉండవని కాదు. అంతమాత్రాన ఆగిపోతామా’ అంటూ మహిళల్లో సానుకూల దృక్పథాన్ని నింపేందుకు కృషి చేస్తున్నారు డా.జీసీ కవిత. కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌గా లక్షల మందికి అవగాహన కల్పించిన ఆవిడ ఏం చెబుతున్నారంటే...

Updated : 29 Jun 2022 08:27 IST

‘ఉదయం లేవడమే అదృష్టం... ఉన్నంతలో మూడు పూటలూ భోం చేస్తాం, భర్తాపిల్లలతో కలిసి ఉంటాం. మరి, సంతోషంగా ఉండొచ్చుగా... ఉండం. ఆఫీసులో పనీ, పిల్లల పరీక్షల ఫలితాలూ.. ఇలా ఏవేవో ఆలోచిస్తూ ఆందోళన పడతాం. సమస్యలు ఉండవని కాదు. అంతమాత్రాన ఆగిపోతామా’ అంటూ మహిళల్లో సానుకూల దృక్పథాన్ని నింపేందుకు కృషి చేస్తున్నారు డా.జీసీ కవిత. కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌గా లక్షల మందికి అవగాహన కల్పించిన ఆవిడ ఏం చెబుతున్నారంటే...

నాన్న ఇస్రోలో విశ్రాంత శాస్త్రవేత్త. శ్రీహరికోటలో పనిచేసేవారు. డిగ్రీ వరకూ అక్కడే చదువుకున్నా. వృత్తి జీవితంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు చాలా ఉన్నాయి. అయినా ఎప్పుడూ ఆ ఒత్తిడి ఇంటి దాకా రానివ్వలేదు. ఎంత పెద్ద సమస్య అయినా ఆయనతో మాట్లాడాక ఇదీ ఓ సమస్యేనా అనిపిస్తుంది. ఆ సానుకూల దృక్పథం ఇంట్లో అందరికీ వచ్చింది. డిగ్రీ తర్వాత పెళ్లి కావడంతో హైదరాబాద్‌ వచ్చా.

ఆ సంఘటనే మార్చేసింది

పన్నెండేళ్ల కిందట ఓ మహిళ నెలల పాపతో భర్త నుంచి దూరమై మా ఇంటికి చేరింది. ఓ తల్లిగా ఆమె బాధని అర్థం చేసుకుని చేరదీశా. పనితోపాటు అన్ని వసతులూ కల్పించా. అయినా గతం గురించే ఆలోచిస్తూ నిరాశానిస్పృహల మధ్య బతికేది. అప్పటికే పాజిటివ్‌ సైకాలజీమీద అధ్యయనం చేస్తున్నా. తర్వాత ఈ అంశంమీద పీహెచ్‌డీ చేశా. దాంతో తనలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశా. తనే కాదు, ఇలా ఎందరో మహిళలు, యువతులూ ఆనందానికి దూరమవున్నారు. తద్వారా ఆ కుటుంబాల్లోనూ అదే పరిస్థితి. అప్పుడే అనిపించింది.. ఓ మహిళను మార్చితే ఆ ఇంటిని మార్చినట్టేనని, ఇల్లాలు ఆనందంగా ఉంటే ఇల్లు బావున్నట్టేనని. అప్పట్నుంచీ ‘పాజిటివ్‌ థింకింగ్‌’ గురించి ప్రచారం చేస్తున్నా. దీన్ని విస్తృతం చేయాలని 2015లో ‘సెంటర్‌ ఫర్‌ పాజిటివ్‌ లెర్నింగ్‌’ను ప్రారంభించా. ఈ సంస్థ ద్వారా ప్రసంగాలూ, రచనలూ, వర్క్‌షాపులు.. నిర్వహిస్తూ మార్పు  కోసం ప్రయత్నిస్తున్నా. పాఠశాలలూ, కళాశాలలూ, మహిళా సమావేశాలకు వెళ్లి ఉచితంగా తరగతులు చెబుతూ వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటివరకూ నాలుగు లక్షల మందికి ఉచితంగా కౌన్సెలింగ్‌ ఇచ్చా. ఎన్‌ఐటీ వరంగల్‌, ఐఐడీఎల్‌, అపోలో నర్సింగ్‌ కాలేజీ.. లాంటి చోట్ల కౌన్సెలర్‌గానూ పని చేస్తున్నా. కొవిడ్‌ సమయంలో నీతీ ఆయోగ్‌, జాతీయ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో ఐ- కెన్‌ (ఇండియా- కొవిన్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌)లో వెల్‌నెస్‌ విభాగానికి జాతీయ సమన్వయకర్తగా వ్యవహరించా. ఆ సమయంలో ‘సంవేదన’ పేరుతో టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి కౌన్సెలర్ల సాయంతో లక్షల మందికి కొవిడ్‌ భయాలని తట్టుకునే ధైర్యాన్ని, సానుకూల ఆలోచనల్ని నింపే ప్రయత్నం చేశా. దాదాపు 150కి పైగా వెబినార్లలో ప్రసంగించా. ఎక్కడైనా చెప్పేదేంటంటే.. జీవితం ఓ అద్భుత అవకాశం. ఆనందంగా, సంతోషంగా జీవిస్తేనే ఈ జన్మ సార్థకం. ఈ విషయం కనీసం పది లక్షల మందికి నేరుగా చెప్పి వాళ్లలో మార్పు తీసుకురావడమే నా లక్ష్యం.


ఎలా మార్పు తెచ్చుకోవాలి...

ఒకప్పుడు సమస్యల్ని ఎదుర్కోడానికి తోడుగా కుటుంబంలో పెద్దవాళ్లు ఉండేవారు. ఇప్పుడలాంటి అవకాశం లేకపోవడమే ప్రధాన సమస్య. అలాగని సంతోషాన్ని దూరం చేసుకోలేం కదా! ఎవరైనా ప్రయత్నంతో సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవచ్చు.

* ఏరోజుకారోజు మీకు అనుభవమైన 5 సంతోషకరమైన అంశాల్ని రాసుకోండి. అలా 15 రోజులు చేయండి. ప్రకృతి దృశ్యాలు, పనిలో తృప్తి, రుచికరమైన వంట.. ఏదైనా కావొచ్చు.

* డబ్బు, హోదా, పేరు.. వీటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉన్నవాటితో సంతృప్తి చెందండి.

* విజయమంటే పెద్ద చదువులూ, పెద్ద ఉద్యోగం... ఇవి కాదు. సమస్యల్ని సమర్థంగా ఎదుర్కోవడమే.

* సమస్య ఎదురైతే కుంగిపోవద్దు. గతంలో ఎదుర్కొన్న సవాళ్లనీ, వాటిని అధిగమించిన విధానాన్నీ గుర్తు చేసుకోండి. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లండి.

* పెద్ద పెద్ద సాయాలే చేయాలి అని కాదు.. వృద్ధుల్ని దారి దాటించడం, ఒక నిరుపేద ఆకలి తీర్చడం లాంటివీ ఆనందాన్ని కలిగిస్తాయి.

* మహిళలు పని ఒత్తిడి కారణంగా ఎక్కువగా నిరాశకు గురవుతారు. మీకంటూ కొంత సమయం కేటాయించుకోండి. పాటలూ, సినిమాలూ, సరదాలూ ఏం కోల్పుతున్నామనుకుంటున్నారో అవి చేయండి. విరక్తి చెందే వరకూ వెళ్లొద్దు.

* ఇల్లు, ఉద్యోగం.. వీటి సమన్వయంలో కంగారొద్దు. ఆఫీసు టైమ్‌లో పనే ముఖ్యం. అందుకు తగ్గట్టు ముందే ఇంట్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

* అమ్మాయిలూ... ముందు చాలా అందమైన జీవితం ఉంది. చిన్న కష్టానికి కుంగిపోవద్దు. బాగా విజయవంతమైన వ్యక్తులంతా జీవితంలో పరాజయాన్ని చూసినవాళ్లే. తర్వాతే వారిలో కసి పెరిగి అనుకున్నది సాధించారు.

- తలారి నరేందర్‌, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని