మిద్దె చేపలు.. సాగు చేస్తున్నారు!

మిద్దె తోటల పెంపకం గురించి విన్నాం.. మరి మిద్దె చేపల పెంపకం గురించి విన్నారా?   కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనీ, పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలన్న తల్లుల తపన కామారెడ్డిలో కొత్త సంప్రదాయానికి తెరలేపింది. మిద్దె, చేనుల్లో చేపల పెంపకానికి నాంది పలికింది.

Updated : 09 Aug 2023 22:58 IST

మిద్దె తోటల పెంపకం గురించి విన్నాం.. మరి మిద్దె చేపల పెంపకం గురించి విన్నారా? కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనీ, పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలన్న తల్లుల తపన కామారెడ్డిలో కొత్త సంప్రదాయానికి తెరలేపింది. మిద్దె, చేనుల్లో చేపల పెంపకానికి నాంది పలికింది. ఈ ఆలోచన ఎలా వచ్చిందీ, కార్యాచరణ వాళ్ల మాటల్లోనే...

చేపల పెంపకం అంటే గుర్తొచ్చేవి... చెరువులే. ‘ముత్యాలనే పెరట్లో పెంచుతున్నప్పుడు.. చేపల్ని ఎందుకు పెంచలేం?’ అనే ఆలోచన చేశారు కామారెడ్డి జిల్లా స్వశక్తి సంఘాల మహిళలు. మిద్దెలు, పెరళ్లలో చేపలు పెంచుతూ తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. స్త్రీనిధి రుణాలతో మీనాల పెంపకం చేపడుతూ.. తమ ఇంట మత్స్యసిరులు సృష్టిస్తున్నారు. మొదట్లో అధికారులు చేపల పెంపకం గురించి చెప్పినప్పుడు అయ్యేపని కాదనుకున్నారు. సాధ్యాసాధ్యాలు వివరించి, రుణం ఇస్తామన్నా.. బెడిసి కొడితే పరిస్థితి ఏంటి? అనేదీ ఆలోచించారు. ఇలా అనేక అనుమానాల మధ్య మొదలైన వీరి మిద్దె చేపలసాగు ప్రయాణం ఇప్పుడు విజయవంతంగా నడుస్తోంది. మొదట లింగంపేటలో తర్వాత దోమకొండ, గాంధారి, సదాశివనగర్‌, రాజంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు చెందిన 53 మంది మహిళలు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మిద్దె చేపల పెంపకం మొదలుపెట్టారు.

యూట్యూబ్‌ ఇచ్చిన ఆలోచన..

‘గ్రూప్‌ సమావేశంలో చేలల్లో చేపల సాగు గురించి చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. నేనూ ప్రయత్నించాలనుకున్నా. అందరూ చేలల్లో షెడ్లు వేసుకుంటున్నారు. మాకేమో పొలం లేదు. వేరే దారుల గురించి వెతికితే.. చిన్న చిన్న ట్యాంకుల్లో చేపల్ని పెంచే బయోఫ్లాక్‌ విధానం గురించి తెలిసింది. అధికారులకు చెబితే ఆలోచన బాగుందన్నారు. కానీ సంరక్షణ సవాల్‌తో కూడుకున్న విషయం అన్నారు. నీటి వినియోగం, మార్పిడి అంశాలపై ప్రత్యేక తరగతులు చెప్పారు. పర్యవేక్షణ కాస్త కష్టంగానే ఉన్నా పట్టుదలగా ముందుకు వెళ్తున్నా’ అంటోంది మిద్దెపై చేపల్ని పెంచుతున్న చందాపురం రేణుక. ‘ఆసక్తి ఉన్నా అనువైన స్థలం లేదు. యూట్యూబ్లో మార్గాలు వెతికా. అప్పుడే ముత్యాలసాగు వీడియో కనిపించింది. ఆ పద్ధతిలో చేపలు పెంచితే? అన్న ఆలోచన వచ్చింది. రేణుకా ఇదే బాటలో వెళ్తున్నట్టు తెలుసుకున్నా. మిద్దెపై ట్యాంకుల నిర్మాణం చేయించా. ఇదేం కొత్త పద్ధతి కాదు. విదేశాల్లో అమలులో ఉన్నదే. అధికారులు ఎప్పటికప్పుడు మా సందేహాలను నివృత్తి చేస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల వారంతా మా ఆలోచన భేష్‌ అంటూ ప్రశంసించారు’ అని చెబుతోంది మరో పెంపకందారు నీల రాజ్యలక్ష్మి.

భయంగానే మొదలు..

‘మిద్దె చేపల పెంపకం జరుగుతున్న గ్రామాలని చూశా. చేపలు పట్టడమే మా జీవనాధారం. పడితేనే తిండి. లేదంటే పస్తులే. ప్రయోగాత్మకంగా అనిపించి, ప్రయత్నిస్తే బాగుండు అనిపించింది. మావారూ ఒప్పుకొన్నారు. స్త్రీనిధి కింద రుణం మంజూరైంది. షెడ్‌ల నిర్మాణానికి కొంత చేతిడబ్బును పెట్టుకున్నా. నెల రోజులు శ్రమించి ట్యాంకులు కట్టాం. దాదాపు రూ.16 లక్షలు ఖర్చయింది. అనుకున్నదాని కంటే మెరుగ్గానే చేపపిల్లల బరువు పెరిగింది. విక్రయ బాధ్యతలు కూడా విత్తన సరఫరా చేసిన సంస్థే తీసుకుంది. మొదట్లో భయంగా ప్రారంభించినా ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం వస్తుంది’ అంటున్నారు గాంధారి గ్రామానికి చెందిన శ్రావణి.

అప్పుడు భయపడ్డా..

‘మొదట్లో చేపలు చనిపోయాయి. ఆరా తీస్తే వాతావరణానికి సర్దుబాటు కావడానికి సమయం పడుతుందన్నారు. భయం వేసింది. కానీ సంస్థ ఇచ్చిన ధైర్యంతో మళ్లీ విత్తన చేపలు ట్యాంకుల్లోకి వదిలాం. ఈసారి బాగా పెరిగాయి. మూడు గంటలకోసారి దానా వేస్తుంటా. రోజులో 5 సార్లు తప్పనిసరిగా వెళ్లిచూస్తుంటా. పంటని, చిన్నపిల్లల్ని పెంచినట్టే అపురూపంగా వీటిని కూడా చూసుకుంటున్నాం’ అని చెబుతోంది మైలి శ్రీలత. మిగతా గ్రామాల వారూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో ముందుగా వేసిన ఆరుగురు మహిళలకు మంచి ఉత్పత్తి, ఆదాయం లభించాయి. రూ.30కి కొన్న చేపపిల్లలు కేజీ రూ.150 వరకూ అమ్ముడయ్యాయి. చేపరకం బట్టి మంచి ధర పలుకుతోంది. రూ.లక్ష పెట్టుబడి పెడితే రెండు, రెండున్నర లక్షల వరకూ ఆదాయం వచ్చింది. మరి మిగతా వారందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా.

- పులి అనిల్‌కుమార్‌, కామారెడ్డి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్