దేశంపై ప్రేమతో!

‘నా’ అనుకున్నవాళ్లు లోకాన్ని వదిలిపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు... వాళ్లను తలచుకుంటూ జీవించేవారు కొందరైతే... వారి ఆశయాల్ని బతికించేవారు మరికొందరు. తండ్రి, భర్త కలల్ని నిజం చేయడం కోసం ఆర్మీ యూనిఫామ్‌ని ధరించారీ నారీమణులు.

Published : 12 Mar 2024 01:34 IST

‘నా’ అనుకున్నవాళ్లు లోకాన్ని వదిలిపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు... వాళ్లను తలచుకుంటూ జీవించేవారు కొందరైతే... వారి ఆశయాల్ని బతికించేవారు మరికొందరు. తండ్రి, భర్త కలల్ని నిజం చేయడం కోసం ఆర్మీ యూనిఫామ్‌ని ధరించారీ నారీమణులు. తాజాగా చెన్నై ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకున్న ఇనాయత్‌వత్స్‌, యశ్విని ధాకాలతో పాటు... ఊరికట్టుబాట్లని కాదని ఆర్మీలోకి వచ్చిన శరణ్యల  స్ఫూర్తికథలేంటో తెలుసుకుందాం... 


ఆశలు కూలిన చోటే..

తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదాన్ని అంత త్వరగా మర్చిపోలేం. త్రిదళాధిపతి బిపిన్‌సింగ్‌ రావత్‌తో పాటు మరికొందరు అధికారులు ప్రాణాలొదిలింది ఈ ప్రమాదంలోనే. వారిలో పైలట్ కుల్‌దీప్‌ సింగ్‌ కూడా ఒకరు. తన భర్త ఏ రాష్ట్రంలో ప్రాణాలొదిలారో అదే ప్రాంతంలో శిక్షణ పూర్తిచేసుకుని సైన్యంలో చేరారు యశ్విని ధాకా...

మీరట్కు చెందిన యశ్విని తన జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. జైపుర్‌లోని బనస్థలి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశాక ఓ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకురాలిగా చేరారు. 2019లో ఆమెకు జైపుర్‌కి చెందిన స్క్వాడ్రన్‌ లీడర్‌ కుల్‌దీప్‌ సింగ్‌తో పెళ్లయ్యింది. రెండేళ్లకే హెలికాప్టర్‌ ప్రమాదంలో భర్తని కోల్పోయారు యశ్విని. తన భర్త అంత్యక్రియల సమయంలోనే తానూ ఆర్మీలో చేరి భర్త కలల్ని సాకారం చేయాలనుకున్నారు. అందుకు తగ్గ శారీరక పటుత్వం లేకపోయినా గట్టి సంకల్పంతో పట్టుదలగా అడుగులు వేశారు. పరీక్ష రాసి చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీకి ఎంపికయ్యారు. అనేక సవాళ్లను అధిగమించారు. తనకన్నా చిన్నవయసు వారితో పోటీపడి మరీ తానేంటో నిరూపించుకున్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసి ఆఫీసర్‌ క్యాడెట్ హోదాలో ఆర్మీలో చేరారు. ఆమె ఎంచుకున్న మార్గానికి దేశం మొత్తం అభినందనలు తెలుపుతోందిప్పుడు. త్రిదళాల ఉన్నతాధికారులు సైతం ఆమెను అభినందిస్తున్నారు.


20ఏళ్లకే తండ్రి యూనిఫామ్‌తో..

ఉగ్రవాదుల్ని ఏరిపారేసేందుకు జరిగిన పోరాటంలో తండ్రి వీరమరణం పొందారు. ఆయన చనిపోయేనాటికి ఊహ కూడా తెలియని ఆయన కూతురు ఇనాయత్‌వత్స్‌... ఇప్పుడు ఆ తండ్రి కలని నిజం చేసేందుకు సైన్యంలో  చేరారు...

చండీగఢ్‌కు చెందిన ఇనాయత్‌ వత్స్‌ రెండున్నరేళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకున్నారు. ఆర్మీలో మేజర్‌గా ఉన్న నవనీత్‌ వత్స్‌ 2003లో శ్రీనగర్‌లో ఉగ్రవాదులతో తలబడ్డారు. ఆ భీకర పోరాటంలో ఉగ్రవాద తూటాలకు ప్రాణాలు వదిలారాయన. కాస్త ఊహవచ్చాక తండ్రి మరణానికి కారణం తెలుసుకున్న ఇనాయత్‌ ఆర్మీలో చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. నవనీత్‌వత్స్‌ వీరమరణాన్ని దృష్టిలో ఉంచుకుని హరియాణ ప్రభుత్వం ఆమెకు గెజిటెడ్‌ పోస్ట్‌ ఇస్తామని చెప్పింది. కానీ ఇనాయత్‌ సున్నితంగా తిరస్కరించారు. తండ్రిలా తనూ సైన్యంలో చేరాలనుకుంటున్నానని మనసులో మాట చెప్పారు. అనుకున్నట్లే ఆ దిశగా నడిచి చెన్నై ఓటీఏలో శిక్షణ పూర్తిచేసుకున్నారు. తన తండ్రి వేసుకున్న ఆలివ్‌ గ్రీన్‌ దుస్తుల్నే తానూ వేసుకుని మురిసిపోయారు. ఇప్పుడామె లెఫ్ట్‌నెంట్ హోదాలో సేవలందించబోతున్నారు. 


కట్టుబాటుని కాదని..

ఆడపిల్లకు పెద్ద చదువులు వద్దు. త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి. అదే ఆ ఊరి కట్టుబాటు. శరణ్య ఆ ఊరి కట్టుబాటుని ధిక్కరించి మొదటిసారి ఆర్మీలో అడుగుపెట్టింది శరణ్య...

నంజమడై కుట్టై తమిళనాడులోని ఓ కుగ్రామం. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఊళ్లలో ఆడపిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేసే సంస్కృతి ఉంది. శరణ్య దాన్ని పట్టించుకోకుండా కబడ్డీపై  దృష్టిపెట్టారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివి... ఐటీ ఉద్యోగం సాధించారు. అవేమీ కాదు... ఆర్మీలో చేరాలన్నది శరణ్య కల. ఇంట్లో చెబితే ‘ఇక చాలు పెళ్లి చేసుకో’ అన్నారు. దాంతో ఉద్యోగం చేస్తూనే నాలుగుసార్లు సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) పరీక్షలు రాసినా నిరాశే ఎదురైంది. ఐదో ప్రయత్నంలో విజయం సాధించారు. కానీ అమ్మానాన్నల్ని ఒప్పించడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందంటారు శరణ్య. ఇప్పుడు సైన్యంలో ఆమెకు దక్కుతున్న గౌరవాన్ని చూసి తల్లిదండ్రులూ కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆ కుటుంబంలో మొదటి గ్రాడ్యుయేట్ అయిన శరణ్య తెగింపు, ధైర్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తోంది.

 హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్