Updated : 30/05/2022 18:26 IST

ఆ పిల్లల జీవితాల్లో ‘విద్యా’ కుసుమాలు పూయిస్తోంది!

(Photos: Instagram)

చదువుకోవడం మన హక్కు.. కానీ పేదరికం కారణంగా చాలామంది పిల్లలు దీనికి దూరమవుతున్నారు.. చేసేది లేక బాల కార్మికులుగా వాళ్ల వయసుకు మించిన పనులు చేస్తూ బతుకీడుస్తున్నారు. మరికొంతమంది యాచకులుగా మారుతున్నారు. మురికివాడలు, రైల్వే స్టేషన్లలో ఇలాంటి చిన్నారులెంతోమంది తారసపడుతుంటారు. ముంబయికి చెందిన పాతికేళ్ల హైమంతీ సేన్‌ ఈ పిల్లల దుస్థితి చూసి చలించిపోయింది. ఎలాగైనా వీళ్ల తలరాతలు మార్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. ఈ వేదికగా ఎంతోమంది పేద చిన్నారులకు విద్యా దానం చేస్తోంది. ‘విద్య మన హక్కు.. మన తలరాతలు మార్చే శక్తి దీనికి ఉంది.. అయితే పరిస్థితుల వల్ల దానికి దూరం కావద్దు..’ అంటోన్న ఈ యంగ్‌ టీచర్‌ తన మనసును సేవ వైపు ఎలా మళ్లించిందో తెలుసుకుందాం రండి..

హైమంతీకి చిన్న వయసు నుంచే సామాజిక స్పృహ ఎక్కువ. పైగా చదువులోనూ ముందుండేది. ముంబయి యూనివర్సిటీ నుంచి సోషియాలజీ, సైకాలజీ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఆఫీస్‌కి వెళ్తూ, వస్తూ ఉన్న క్రమంలోనే.. అక్కడి వీధుల్లో, రద్దీ రోడ్లపై, రైల్వే స్టేషన్‌ మెట్లపై వస్తువులు అమ్ముతూ, బిచ్చమెత్తుకుంటూ బతుకీడుస్తోన్న ఎంతోమంది పిల్లల్ని చూసిందామె.

అదొక్కటే పరిష్కారం!

సాధారణంగా ఎవరికైనా ఇలాంటి పిల్లల్ని చూసినప్పుడు జాలి కలుగుతుంటుంది. వాళ్ల దుస్థితి చూసి ఎంతో కొంత సహాయం చేస్తుంటాం. మనలాగే హైమంతీకీ ఈ పిల్లల్ని చూశాక మనసు మనసులో లేదు. అయితే డబ్బు సహాయంతో తాత్కాలికంగా వారి బాధల్ని దూరం చేయచ్చు.. కానీ దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కుంటేనే వాళ్ల జీవితాలు బాగుపడతాయని అనుకుందామె. ఈ క్రమంలోనే విద్య ఒక్కటే వీళ్ల పరిస్థితుల్ని మార్చగలదని బలంగా నమ్మిన ఆమె.. ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే.. ముందుగా పిల్లల తల్లిదండ్రుల్ని కలిసింది. వీరిలో చాలామంది తమ పిల్లల్ని బడికి పంపడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే.. ‘చదువు వల్ల కోల్పోయిన సమయం తిరిగిరాదు.. పైగా ఈ సమయాన్ని యాచించడానికి, ఇతర వస్తువులు అమ్ముకోవడానికి వినియోగిస్తే నాలుగు రాళ్లైనా సంపాదించుకోవచ్చు..’ అన్నారు. మరికొంతమంది.. ‘పిల్లలకు చదువు చెప్పించే స్థోమత లేదు..’ అని తేల్చి చెప్పేశారు.

‘ఇలాంటి పిల్లల్ని చేర్చుకోం’ అన్నారు!

అయితే ఇలా ఎవరెన్ని చెప్పినా హైమంతీ మాత్రం వెనక్కి తగ్గలేదు. చదువుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో వాళ్ల తల్లిదండ్రులకు వివరించింది. విద్య వల్ల ఈ కష్టాలన్నీ తీరిపోతాయని వాళ్లకు నచ్చజెప్పింది. ఇవన్నీ విన్న కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపించడానికి ఒప్పుకున్నారు. ఇక మరోవైపు.. స్కూల్‌ యాజమాన్యాలను ఒప్పిద్దామని.. స్థానికంగా ఉన్న కొన్ని పాఠశాలలకు వెళ్లిందామె. ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌ని కలిసింది. పిల్లల పరిస్థితి ఇదీ.. వాళ్లను చేర్చుకొని విద్యనందించమని కోరింది. అయితే ఆ పేద పిల్లల వేషభాషలు, ఆహార్యం చూసి చాలామంది ‘ఇలాంటి పిల్లల్ని మేం చేర్చుకోం.. వీళ్ల వల్ల ఇతర పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది..’ అన్నారు. ఇలా ఈ పిల్లల్ని సమాజం చిన్న చూపు చూడడం తట్టుకోలేకపోయిందామె. దాంతో తానే ‘జునూన్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. పిల్లలకు ప్రాథమిక విద్యనందించడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. 2018లో ప్రారంభమైన ఈ సంస్థ సేవలు నేటికీ నిర్విరామంగా కొనసాగుతున్నాయి.

ప్లాట్‌ఫామే పాఠశాల!

అయితే అప్పటిదాకా రద్దీ ప్రదేశాలు, రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై గడిపిన పిల్లల్ని తీసుకెళ్లి నాలుగ్గోడల మధ్య కూర్చోబెడితే నిర్బంధించినట్లు ఫీలవుతారు.. ఈ అసౌకర్యంతో చెప్పే అంశాలపై దృష్టి పెట్టలేరు. హైమంతీ కూడా ఇదే ఆలోచించింది. అందుకే వాళ్లు నిత్యం గడిపే రైల్వే ప్లాట్‌ఫామ్‌, రైల్వే స్టేషన్లలోని స్కైవేలనే తరగతి గదిగా ఎంచుకుందామె. ఇక పిల్లల కోరిక మేరకు ఇంగ్లిష్‌లోనే పాఠాలు బోధిస్తోంది హైమంతీ. ఆరుగురు బృంద సభ్యులతో కలిసి ఆ పిల్లలకు గణితం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌.. వంటి అంశాల్ని నేర్పిస్తున్నారు.

‘విద్య.. మన రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు. వెనకబడిన వర్గాలకు చెందిన పిల్లలు కూడా అందరు పిల్లల్లాగే సమానంగా విద్యను అభ్యసించాలన్నదే మా సంస్థ ముఖ్యోద్దేశం. అందుకే మా వద్దకొచ్చే చిన్నారులకు పాఠాలతో పాటు ఆర్ట్‌, సంగీతం, డ్యాన్స్‌, ఆటలు.. వంటి ఇతర వ్యాపకాలనూ నేర్పిస్తున్నాం. చదువుకుంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అధిగమించచ్చు. విద్యతోనే ఉన్నతి సాధ్యం..!’ అంటోంది హైమంతీ.

పేద పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలన్న ముఖ్యోద్దేశంతో ముందుకు సాగుతోన్న హైమంతీ.. ఇందుకోసం తన ఉద్యోగాన్ని కూడా వదులుకొని తన పూర్తి సమయాన్ని సేవా కార్యక్రమాలకే కేటాయిస్తోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని