ప్రియుడి కోసం చిన్న యుద్ధమే చేసింది!
ప్రేయసి కోసం ప్రియుడు చేసిన యుద్ధాల గురించి విన్నాం..ప్రియుడి కోసం రాచరికాన్ని తృణప్రాయంగా వదిలేసిన యువరాణుల గురించి చదివాం..
ప్రేయసి కోసం ప్రియుడు చేసిన యుద్ధాల గురించి విన్నాం..
ప్రియుడి కోసం రాచరికాన్ని తృణప్రాయంగా వదిలేసిన యువరాణుల గురించి చదివాం..
అయితే ఈ అమ్మాయి మాత్రం తన ఇష్టసఖుడి కోసం ఓ భీకర యుద్ధాన్నే దాటొచ్చింది. ప్రాణాలరచేత పట్టుకొని తానూ విధితో ఓ చిన్నసైజు యుద్ధమే చేసింది. ఎట్టకేలకు సరిహద్దులు దాటి ప్రియుడి చెంతకు చేరింది.. పనిలో పనిగా ఎయిర్‌పోర్ట్‌లోనే తన మనోహరుడితో వేలికి ఉంగరం కూడా తొడిగించుకుంది. ఇలా తమ పెళ్లికి అడ్డుగోడగా నిలిచిన ఉక్రెయిన్ - రష్యా యుద్ధాన్ని దాటుకొని ఒక్కటైన ఈ ప్రేమ జంట లవ్‌స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి, ఇంతకీ ఎవరా కపుల్? దేశాలు వేరైనా వాళ్లెలా కలిశారు? వాళ్ల ప్రేమ కబుర్లేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
ఉక్రెయిన్‌లోని కీవ్‌కు చెందిన అన్నా హొరొడెట్‌స్కా ఓ మేకప్ ఆర్టిస్ట్. దిల్లీ హైకోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నాడు అనుభవ్ భాసిన్. దేశాలు వేరైనా ఒకరికోసం ఒకరు హద్దులు దాటొచ్చి తమ ప్రేమను గెలిపించుకున్న జంటల్ని మనం ఇదివరకు చాలానే చూశాం. అన్నా-అభినవ్‌ల ప్రేమకథ కూడా అలాంటిదే!
ఒకసారి కలుసుకొని.. రెండోసారి ప్రేమించుకొని!
2019లో అన్నా కీవ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో వెకేషన్‌కని ఇండియాకు వచ్చింది. అప్పుడే అనుభవ్‌ను తొలిసారి కలిసింది. గడిపింది కాసేపే అయినా ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ అనిపించింది ఇద్దరికీ! దాంతో ఇద్దరూ మొబైల్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత అన్నా తిరిగి కీవ్ వెళ్లిపోయినా ఇద్దరి మధ్య ఫోన్లు, సందేశాలు కొనసాగాయి. మళ్లీ మరుసటి ఏడాది రాజస్థాన్ రోడ్ ట్రిప్ కోసం ఇండియా వచ్చింది అన్నా. తను రావడం, కరోనా దేశంలోకి అడుగుపెట్టడం దాదాపు ఒకేసారి జరిగిపోయాయి. దాంతో భారత్‌లో లాక్‌డౌన్ విధించారు. ఇక తిరిగి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. అన్నాకు అనుభవ్ వాళ్లింట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఇలా కొన్ని నెలల పాటు గడిపిన వాళ్లిద్దరి మధ్య క్రమంగా ప్రేమ చిగురించింది. మరోవైపు అన్నా సింప్లిసిటీ, ఆమె నడవడిక అనుభవ్ కుటుంబానికి కూడా చాలా నచ్చడంతో వాళ్ల ప్రేమకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ పడ్డట్లైంది.
కాబోయే అత్తగారి ప్రపోజల్‌తో..!
ఇక లాక్‌డౌన్ సడలింపులతో తిరిగి కీవ్ వెళ్లిపోయింది అన్నా. ఆ తర్వాత మరో రెండు సందర్భాల్లో ఈ ప్రేమికులిద్దరూ కలుసుకున్నారు. ఇదే క్రమంలో తనకు కాబోయే అత్తగారే తమ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారని చెబుతోంది అన్నా.
‘తమ ప్రేమను గెలిపించుకోవడానికి జంటలు ఇరు కుటుంబాలతో ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తారు. కానీ ఈ విషయంలో మేము చాలా అదృష్టవంతులం. దేశాలు వేరైనా మా ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక నాకు కాబోయే అత్తగారే ‘నా కొడుకును పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగేసరికి చెప్పలేనంత సంతోషంగా అనిపించింది..’ అంటూ మురిసిపోతోంది అన్నా.
మూడుసార్లు గొడవపడ్డాం!
మొత్తానికి ఈ ప్రేమికులిద్దరూ ఇంట్లో తమ ప్రేమను గెలిపించుకొని ఈ మార్చిలో పెళ్లి పెట్టుకుందామని అన్నీ రడీ చేసుకున్నారు. ‘ప్రత్యేక వివాహ చట్టం’ కింద దాని తాలూకు డాక్యుమెంట్లన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే అంతలోనే రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో అన్నా కీవ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈ క్రమంలో అనుభవ్‌కి, తనకు మూడుసార్లు గొడవైందంటోంది అన్నా. ‘రష్యా యుద్ధ ప్రకటన చేశాక అనుభవ్ నన్ను కీవ్ వదిలి వచ్చేయమన్నాడు. అయితే అలాంటిదేమీ ఉండదని నేను కొట్టిపడేశాను. ఇలా కాసేపు మా మధ్య ఓ చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇక యుద్ధం మొదలయ్యాక విమాన సౌకర్యం లేకపోవడంతో తను నన్ను రైలెక్కి వచ్చేయమన్నాడు. కానీ అప్పుడూ నేను నిరాకరించాను. ఇక యుద్ధం తీవ్రమవడంతో నన్ను బంకర్‌లోనే దాక్కోమన్నాడు. అయితే ఈసారి ఎలాగోలా దేశం దాటి అనుభవ్‌ను చేరుకోవాలని నిర్ణయించుకున్నా. నా నిర్ణయం తనకు చెప్పడంతో నాకేమవుతుందోనని మళ్లీ చీవాట్లు పెట్టాడు. అయినా ఆలస్యం చేయకుండా.. అమ్మతో కలిసి దేశం దాటాను..’ అని చెప్పుకొచ్చింది అన్నా.
ఏప్రిల్‌లో మా పెళ్లి..!
తల్లితో కలిసి దేశం దాటిన అన్నా.. ఆమెను తన తండ్రి వద్దకు మెక్సికో పంపించి.. తాను పోలండ్ చేరుకుంది. అయితే అక్కడ్నుంచి ఇండియా చేరుకోవడానికి వీసా సమస్య తలెత్తడంతో రెండు వారాల పాటు అక్కడే ఉండిపోయింది అన్నా. దీంతో తన ప్రియుడు, లాయర్ అయిన అనుభవ్ చొరవతో వీసా సంపాదించిన ఆమె.. ఇటీవలే దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. తన ప్రేయసికి ఏమవుతుందో ఏమోనని అనుక్షణం భయపడిపోయిన అనుభవ్.. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను చూడగానే ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. బాజాభజంత్రీలతో తన నెచ్చెలికి స్వాగతం పలికాడు. ప్రేమతో ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. పనిలో పనిగా విమానాశ్రయంలోనే అన్నా వేలికి ఉంగరం తొడిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగేశాడు. అయితే ఇదివరకే తమ మధ్య పెళ్లి ప్రతిపాదన జరిగిపోయినా.. ఈ ప్రపోజల్ మాత్రం తనకు ప్రత్యేకమంటోంది అన్నా. ఇక మరోవైపు దేశాన్ని దాటొచ్చిన కాబోయే కోడలికి పూలతో స్వాగతం పలికారు అనుభవ్ అమ్మగారు.
మొత్తానికి అన్నాకు తన బామ్మ ముందస్తు పెళ్లి కానుకగా ఓ కాఫీ మేకర్ కూడా అందించిందట! ఇక ఈ నెల 27న పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్న ఈ జంట.. ప్రస్తుతం తమ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక వివాహం తర్వాత తాను అనుభవ్‌తో కలిసి ఇండియాలోనే సెటిలవుతానంటోందీ కాబోయే పెళ్లికూతురు.
ఆల్ ది బెస్ట్ క్యూట్ కపుల్!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.