ఎవరూ మమ్మల్ని నమ్మలేదు..

ఆ దంపతులకు విదేశంలో అయిదంకెల జీతం. మాతృదేశ మహిళలకు ఉపాధినివ్వాలని కొలువు వదిలేసి వచ్చారు. ఇరవై మందికి హస్తకళల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించి.. నేడు వేలమంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు రష్మి దంపతులు.

Published : 25 Jan 2023 00:20 IST

ఆ దంపతులకు విదేశంలో అయిదంకెల జీతం. మాతృదేశ మహిళలకు ఉపాధినివ్వాలని కొలువు వదిలేసి వచ్చారు. ఇరవై మందికి హస్తకళల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించి.. నేడు వేలమంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు రష్మి దంపతులు.

ద్యోగరీత్యా ఇండియా నుంచి పలురకాల ఉత్పత్తులను హరీష్‌, రష్మి కొనుగోలు చేసేవారు. వీటి కోసం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఏటా కర్ణాటక, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు వచ్చేవారు. ఆ సమయంలో గ్రామీణ మహిళల దుస్థితిని దగ్గర్నుంచి చూశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ కుటుంబాల్లోని స్త్రీల నైపుణ్యాలకు తగిన చేయూతనిచ్చి ఆర్థిక భరోసా కల్పించాలనుకున్నారు. అలా  మొదట కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో 20 మందికి హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ ఫ్లవర్స్‌ తయారుచేయడం నేర్పాలనుకున్నారు. అయితే అక్కడివారెవరూ వారిని నమ్మలేదు. అంతకుముందు కూడా ఎవరో ఇలాగే వచ్చి మోసం చేసి వెళ్లారట. దాంతో వారిని ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. చివరికి స్థానిక ఎన్జీవోలను కలిసి వాళ్లేం చేయాలనుకుంటున్నది చెప్పించారు. ఆ తర్వాత శిక్షణ అందించారు  

అనుకోకుండా.. ఓ సారి రష్మి కూతురికి స్కూల్లో క్రాఫ్ట్‌ వర్క్‌ చేయడం కోసం దుకాణాలెన్ని తిరిగినా.. అవసరమైన వస్తువులు దొరకలేదు. అప్పుడే ప్రాజెక్ట్‌ వర్క్‌లకు మెటీరియల్స్‌, క్రాఫ్ట్‌ ఉత్పత్తులను అందించాలనే ఆలోచన వచ్చింది. దాంతో 2007లో ‘ఇట్సీ బిట్సీ’ మొదలుపెట్టారు. ఆయా స్క్రాప్‌బుక్‌ ప్రొడక్ట్స్‌ తయారీలో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీటికి మొత్తం అవసరమయ్యే హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ తయారీ అంతా మహిళలదే. తమిళనాడు తిరుపూరులోని వృథా వస్త్రాన్ని రాజస్థాన్‌ మహిళలకు పంపిస్తే, వారు దాన్ని పేపర్‌గా తయారుచేసి అందిస్తున్నారు.‘మొదటి క్రాఫ్ట్‌స్టోర్‌ను బనశంకరిలో తెరిచాం. స్క్రాప్‌బుకింగ్‌పై అవగాహన కలిగించడానికి మావారితో కలిసి వర్క్‌షాపులు నిర్వహించా. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వీరు తయారుచేసే ఉత్పత్తులు విక్రయమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు 36 స్టోర్స్‌ ఉన్నాయి. దేశంలోనే ఇదే అతిపెద్ద స్క్రాప్‌బుకింగ్‌ సంస్థ. కాగితం పూలు సహా క్యాలెండర్లు, గ్రీటింగ్స్‌ వంటి రకరకాల ఉత్పత్తులు అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తదితర 30 విదేశాలకు ఎగుమతి చేస్తుండగా, మా వార్షికాదాయం రూ.100 కోట్లు. 3 వేలమంది గ్రామీణమహిళలకు ఉపాధినివ్వడం సంతోషంగా ఉంది’ అని చెప్పుకొస్తున్నారు రష్మి. ఈ మహిళలిప్పుడు ఆర్థిక స్వావలంబన పొందుతూ తమ పిల్లలను చదివిస్తున్నారు. మరికొందరు తాము తయారుచేస్తున్న ఉత్పత్తులను వెబ్‌సైట్స్‌ ద్వారా విక్రయించి ఆదాయం పొందుతున్నారు. రానున్న అయిదేళ్లలో మరో 500 స్టోర్స్‌ తెరిచి మరెందరికో అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ఉన్న ఈ జంట ప్రస్థానం స్ఫూర్తిదాయకం కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్