మరో ‘దంగల్‌ గర్ల్’!

ఐదేళ్ల క్రితం వచ్చిన ‘దంగల్‌’ సినిమా గుర్తుంది కదూ.. భారతీయ రెజ్లింగ్‌ ముఖచిత్రాన్ని మార్చేసిన హరియాణా ‘ఫోగట్‌’ సిస్టర్స్‌దే ఈ సినిమా కథ. ఆడపిల్లలకు ఏ మాత్రం విలువ ఇవ్వని చోట వారు కుస్తీ పోటీల్లో అడుగుపెట్టడం, తండ్రి సహాయ సహకారాలతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించడాన్ని ఎంతో హృద్యంగా ఈ చిత్రంలో చూపించారు.

Updated : 13 Sep 2022 14:05 IST

(Photo: Twitter)

ఐదేళ్ల క్రితం వచ్చిన ‘దంగల్‌’ సినిమా గుర్తుంది కదూ.. భారతీయ రెజ్లింగ్‌ ముఖచిత్రాన్ని మార్చేసిన హరియాణా ‘ఫోగట్‌’ సిస్టర్స్‌దే ఈ సినిమా కథ. ఆడపిల్లలకు ఏ మాత్రం విలువ ఇవ్వని చోట వారు కుస్తీ పోటీల్లో అడుగుపెట్టడం, తండ్రి సహాయ సహకారాలతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించడాన్ని ఎంతో హృద్యంగా ఈ చిత్రంలో చూపించారు.

ఈమె మధ్యప్రదేశ్‌ ‘దంగల్‌’ గర్ల్!

మధ్యప్రదేశ్‌కు చెందిన పూజా జాట్‌ది కూడా అచ్చం ఇలాంటి కథే. పదేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన ఆ అమ్మాయి ఆటలపై ప్రేమ పెంచుకుంది. కుస్తీ పోటీల్లో రాణించాలనుకుంది. కానీ సమాజం ‘ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు నీకెందుకు?’ అంటూ ఆమెను వెనక్కు లాగేందుకు ప్రయత్నించింది. ఇక బంధువులైతే ‘ఆడపిల్లను ఎందుకు అలా బయటకు పంపిస్తున్నావు’ అని ఆమె తండ్రి ప్రేమ్‌ నారాయణ్‌ను ప్రశ్నించారు. అయితే ‘దంగల్‌’ సినిమాలో ఆమిర్ ఖాన్ లానే ఇక్కడ కూడా రాష్ట్రస్థాయి కబడ్డీ ఆటగాడైన ప్రేమ్‌ నారాయణ్‌ తన కూతురి అభిరుచిని అర్థం చేసుకున్నాడు. ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలిచాడు. ఫలితం... ఆ ఆడబిడ్డే ఇప్పుడు అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరుకుంది.

ప్రపంచ కుస్తీ పోటీల కోసం!

మధ్యప్రదేశ్‌కు చెందిన పూజ జాతీయ, అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో డజనుకు పైగా పతకాలు గెల్చుకుంది. కొన్ని నెలల క్రితం జరిగిన జూనియర్స్‌ ఆసియా, జూనియర్స్ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది. ఇప్పుడు ఆమె దృష్టంతా అక్టోబర్‌లో జరిగే వరల్డ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్ (సీనియర్స్) పైనే ఉంది. నార్వే రాజధాని ఓస్లో వేదికగా జరిగే ఈ టోర్నీలో ఆమె 53 కేజీల విభాగంలో పోటీపడనుంది.

ఇద్దరు సోదరులకు ‘అమ్మ’గా మారి!

మధ్యప్రదేశ్‌లోని బచ్చకల్‌ అనే ఓ మారుమూల కుగ్రామంలో పుట్టింది పూజ. పదేళ్లకే తల్లి ప్రేమకు దూరమైంది. ఇదే క్రమంలో తనకంటే చిన్నవాళ్లైన ఇద్దరు సోదరులకు తనే అమ్మగా మారింది. వారికి రోజూ వండి పెట్టిన తర్వాతే పాఠశాలకు వెళ్లేది. అక్కడ చదువుతో పాటు పరుగు పోటీలపై ఆసక్తి పెంచుకుంది. పాఠశాల తరఫున పలు టోర్నీల్లో కూడా పాల్గొంది. మరింత రాటుదేలడానికి సమీపంలోని మైదానానికి వెళ్లి రోజూ ప్రాక్టీస్‌ చేసింది. అయితే హైట్‌ తక్కువగా ఉండడం, దీనికి తోడు చీలమండ గాయం తరచూ ఇబ్బంది పెట్టడంతో పరుగు పోటీలకు సరిపడా లక్ష్యాలను చేరుకోలేకపోయింది.

‘ఇలాంటి ఆటలు నీకెందుకు?’ అన్నారు?

అప్పుడే యోగేష్‌ అనే ఓ స్పోర్ట్స్‌ టీచర్ ‘జాట్‌ జాతికి చెందిన అమ్మాయిలు పుట్టుకతోనే బలంగా ఉంటారు. కుస్తీ పోటీలకు అవసరమైన శక్తి, సామర్థ్యాలు వారికి సహజంగా ఉంటాయి. నువ్వు కూడా రెజ్లింగ్‌లో ట్రై చేయచ్చు కదా’ అని పూజకు సలహా ఇచ్చాడు. దీంతో అతడి దగ్గరే శిష్యురాలిగా చేరిన ఆమె కుస్తీ పోటీలకు సంబంధించిన ఓనమాలు నేర్చుకుంది. అయితే కుస్తీ పోటీలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. శిక్షణ సంగతి పక్కన పెడితే శారీరకంగా బలంగా ఉండేందుకు పోషకాహారం కూడా బాగా తీసుకోవాలి. అయితే ఆ ఖర్చు భరించే స్థోమత పూజ కుటుంబానికి ఉండేది కాదు. ఇల్లు, రెండెకరాల పొలం తప్పితే వారికి పెద్దగా ఆస్తులేమీ ఉండేవి కావు. వీటికి తోడు సమాజం నుంచి ఎదురైన చీదరింపులు, ఛీత్కారాలు పూజ కుస్తీ ప్రయాణానికి అవరోధాలుగా పరిణమించాయి. ‘కుస్తీ లాంటి ప్రమాదకరమైన ఆటలు నీకెందుకు?’, ‘దెబ్బలు తగిలితే ఎవరు చూసుకుంటారు?’ అని ఆమెను విమర్శించారు. ఇక బంధువులైతే ‘నీ కూతురును ఇంట్లో నుంచి బయటకు పంపకు’ అని ఉచిత సలహాలిచ్చారు.

ఉదయం 4 గంటలకు నిద్ర లేచి!

అయితే స్వతహాగా స్టేట్‌ లెవెల్‌ కబడ్డీ ప్లేయరైన తండ్రి, సోదరులు పూజకు పూర్తి మద్దతిచ్చారు. ఇక శిక్షణలో భాగంగా రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేచేది పూజ. తండ్రి, సోదరులకు భోజనం వండి పెట్టేది. ఆ తర్వాత 2 కిలోమీటర్ల పాటు నడిచి మెయిన్‌ రోడ్డుకు చేరుకుని అక్కడ బస్సు ఎక్కి ఖాటేగావ్‌ మైదానానికి చేరుకునేది. పూజలో కష్టపడే తత్వాన్ని గమనించిన గ్రామ సర్పంచ్‌ ఆమె ప్రయాణ ఖర్చులతో పాటు శిక్షణకు అవసరమయ్యే డబ్బును సమకూర్చారు. అదేవిధంగా ప్రఖ్యాత రెజ్లర్లు శిక్షణ పొందిన హరియాణాలోని సుభాష్‌ చంద్రబోస్‌ అకాడమీలో ఆమెను చేర్చించాడు.

మొదటి మ్యాచ్‌లోనే!

ఉజ్జయినిలో జరిగిన ఓ టోర్నీతో తన కుస్తీ ప్రయాణం ప్రారంభించింది పూజ. మొదటి మ్యాచ్‌లోనే నేషనల్‌ ఛాంపియన్‌ శివంగీ పన్వార్‌తో పోటాపోటీగా తలపడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ ప్రతిభతోనే భోపాల్‌ రెజ్లింగ్‌ అకాడమీలో అడుగుపెట్టింది. ఇక అప్పటి నుంచి తనకు తిరుగులేకుండా పోయింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో డజనుకు పైగా పతకాలు సాధించింది. జూనియర్స్‌ ఆసియా, జూనియర్స్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లలోనూ కాంస్య పతకాలు గెల్చుకుంది. ఇటీవల దిల్లీలో జరిగిన ప్రపంచ కుస్తీ ఛాంపియన్‌షిప్‌ అర్హత పోటీల్లోనూ సత్తా చాటింది.

అందుకే బ్యాంక్‌ ఉద్యోగం కూడా చేస్తున్నా!

ఇక పూజ వ్యక్తిగత విషయాలకు వస్తే... హరియాణాకు చెందిన రెజ్లింగ్‌ కోచ్‌ వీరేంద్ర గులియాను ఆమె వివాహం చేసుకుంది. అతడికి ఉజ్జయినిలో ఓ అకాడమీ కూడా ఉంది. దిల్లీకి వెళ్లే ముందు కొన్ని రోజులు ఇక్కడే సాధన చేసింది పూజ. దీంతో పాటు ఓ బ్యాంక్‌లోనూ ఉద్యోగం చేస్తోంది. ‘రెజ్లింగ్‌ ఖర్చుతో కూడుకున్నది. హెల్దీ డైట్‌, ట్రావెలింగ్‌ తదితర అవసరాల కోసం నెలకు కనీసం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. ఒలింపిక్స్‌లో పతకం గెలవాలన్నదే నా లక్ష్యం’ అని అంటోందీ రెజ్లింగ్‌ క్వీన్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్