ఆమె పోరాటం.. అక్కడి అత్యాచార చట్టాన్నే మార్చేసింది!

అత్యాచార బాధితులు శారీరకంగా, మానసికంగా కుంగిపోతుంటారు. అటు గతాన్ని మర్చిపోలేరు.. ఇటు నలుగురిలోకి రాలేరు. ఇందుకు సమాజం వారిని చిన్న చూపు చూడడమూ ఓ కారణమే! అయితే కాలేజీ రోజుల్లో అత్యాచారానికి గురైన అమండా న్గుయెన్‌ మాత్రం ఇలా భయపడలేదు.

Updated : 18 Apr 2024 14:10 IST

(Photos: Instagram)

అత్యాచార బాధితులు శారీరకంగా, మానసికంగా కుంగిపోతుంటారు. అటు గతాన్ని మర్చిపోలేరు.. ఇటు నలుగురిలోకి రాలేరు. ఇందుకు సమాజం వారిని చిన్న చూపు చూడడమూ ఓ కారణమే! అయితే కాలేజీ రోజుల్లో అత్యాచారానికి గురైన అమండా న్గుయెన్‌ మాత్రం ఇలా భయపడలేదు. తప్పు తనది కానప్పుడు ఒంటరిగా నాలుగ్గోడలకే ఎందుకు పరిమితమవ్వాలనుకున్న ఆమె.. న్యాయం కోసం పోరాడింది.. ఈ క్రమంలోనే అత్యాచార బాధితుల హక్కుల్ని కాలరాసేలా, సాక్ష్యాల్ని కనుమరుగు చేసేలా అక్కడి చట్టాలున్నట్లు గుర్తించింది అమండా. బాధితులకు న్యాయం జరిగేలా ఆ ఆ చట్టంలో పలు మార్పులు, చేర్పులు చేసేందుకు కృషి చేసింది. ఈ ప్రయత్నం ఫలించడంతో ప్రపంచవ్యాప్తంగా పాపులరైన ఆమె.. తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కింది. త్వరలో ఆమె అంతరిక్ష యాత్ర చేయనుండడమే ఇందుకు కారణం! బ్లూ ఆరిజిన్‌ సంస్థ చేపట్టబోయే న్యూ షెపర్డ్‌ రాకెట్‌లో అంతరిక్ష యాత్రకు బయల్దేరనున్న అమండా.. తద్వారా రోదసీలోకి వెళ్లనున్న తొలి వియత్నాం మహిళగా చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఈ సోషల్‌ యాక్టివిస్ట్‌ స్ఫూర్తి గాథ మీకోసం!

వియత్నాంకు చెందిన అమండా అమెరికాలోని క్యాలిఫోర్నియాలో స్థిరపడింది. వ్యోమగామి కావాలనేది ఆమె చిన్ననాటి కల. ఈ క్రమంలోనే తన చదువు కొనసాగించిన ఆమె.. 2013లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’ పూర్తిచేసింది. మరోవైపు నాసాలో వ్యోమగామిగా శిక్షణ కూడా తీసుకుంది. చదువు పూర్తయ్యాక ‘హార్వర్డ్‌-స్మిత్సోనియన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌’లో కొంతకాలం పనిచేసిన ఆమె.. అమెరికా ప్రభుత్వంలో ‘డిప్యూటీ వైట్‌ హౌస్‌ అనుసంధాన కర్త’గా మరికొన్నాళ్లు విధులు నిర్వర్తించింది.

రేప్‌ కిట్‌ నాశనం చేయాలన్నారు!

అయితే హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకొనే సమయంలోనే అత్యాచారానికి గురైంది అమండా. ఈ సమయంలో ఓ బాధితురాలిగా నాలుగ్గోడలకే పరిమితం కాకుండా.. న్యాయం కోసం పోరాడాలనుకుందామె.

‘అత్యాచారం తర్వాత మానసికంగా కుంగిపోయా. ఒకానొక సమయంలో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆసుపత్రిలో చికిత్స తీసుకొని బయటికొచ్చాక ఎక్కడికెళ్లాలో తోచలేదు. ఈ క్రమంలోనే స్థానిక సహాయ కేంద్రానికి (హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు) చేరుకోవడం, అక్కడ నాలాంటి బాధితుల క్యూ లైన్‌ చూశాక.. నేను ఒంటరిని కాదన్న ధైర్యం వచ్చింది. ఈ సమాజంలో అత్యాచార బాధితుల హక్కుల కోసం పోరాడాలనిపించింది. ఈ ఆత్మవిశ్వాసంతోనే నేరస్థులపై కేసు నమోదు చేశా. రేప్‌ కిట్‌ (అత్యాచారం జరిగిందనడానికి తగిన సాక్ష్యాధారాలతో కూడిన కిట్‌)నూ కోర్టుకు సమర్పించా. కోర్టులో వాదోపవాదాలు విన్నాక.. ఇక్కడి ‘లైంగిక వేధింపుల బాధితుల హక్కుల చట్టం’లోని పలు నియమాలు బాధితులకు ఏ కోశానా న్యాయం జరిగేలా లేవనిపించింది. ముఖ్యంగా నేరం రుజువు కాకపోయినా, కేసు పొడిగింపు అభ్యర్థనను దాఖలు చేయకపోయినా ఆరు నెలల తర్వాత రేప్‌ కిట్‌ సాక్ష్యాధారాలు చెల్లవని, కిట్‌ను నాశనం చేయాలని ఈ చట్టంలో ఉంది. పైగా ఈ కేసు పొడిగింపును ఎలా ఫైల్‌ చేయాలో కూడా అధికారులు నాకు సూచించలేదు. ఇలా ఓ బాధితురాలికి అండగా నిలవాల్సిన చట్టాలే.. వారికి న్యాయం చేకూర్చేలా లేవనిపించింది. అందుకే ఈ చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చే దిశగా నా వంతు ప్రయత్నం చేయాలనుకున్నా. ఇదే 2014లో ‘రైజ్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించేందుకు దోహదం చేసింది..’ అంటోంది అమండా.

ప్రయత్నం ఫలించింది!

లైంగిక వేధింపులు, అత్యాచార బాధితుల హక్కుల్ని కాపాడే లక్ష్యంతో ఈ ఎన్జీవోను స్థాపించింది అమండా. ఈ వేదికగానే అక్కడి ‘లైంగిక వేధింపుల బాధితుల హక్కుల చట్టం’లో మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు చేసిందామె. ఇందులో భాగంగా.. ఆరు నెలల్లోపే రేప్‌ కిట్‌ని నాశనం చేయకుండా.. నేరం రుజువయ్యేంత వరకు వాటిని భద్రపరిచేలా మార్పులు చేయాలని కోరుతూ ఓ నివేదికను రూపొందించింది అమండా. ఈ నివేదికను తన ప్రొఫెసర్లు, గతంలో తాను పనిచేసిన సంస్థల సహోద్యోగులు, ఉన్నతాధికారులు, స్నేహితులు.. ఇలా తనకు తెలిసిన వాళ్లందరికీ ఈ-మెయిల్‌ చేసి వారి మద్దతును కోరిందామె. మరోవైపు ‘ఛేంజ్‌.ఆర్గ్‌’లోనూ తన పిటిషన్‌ను పొందుపరిచి లక్ష సంతకాల సేకరణ చేపట్టిందామె. ఇలా తన పిటిషన్‌కు భారీ మద్దతు రావడంతో.. ఉన్న చట్టంలో ఆయా మార్పులు అవసరమన్న విషయాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. ఈ క్రమంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఈ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేయడంతో.. సవరణలతో కూడిన ఈ చట్టాన్ని ‘లైంగిక వేధింపుల బాధితుల హక్కుల చట్టం-2016’గా పేరు మార్చారు.

అమండా.. అంతరిక్ష యానం!

ఇలా అత్యాచార బాధితుల కోసమే కాదు.. తన ఎన్జీవో వేదికగా జాతి, లింగ వివక్షపైనా పోరాటం చేస్తోంది అమండా. ఈ క్రమంలోనే ‘స్టాప్‌ ఏషియన్‌ హేట్‌ ఉద్యమా’న్నీ లేవనెత్తిందామె. ఇలా తన ఉద్యమాలు, పోరాటాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సోషల్‌ యాక్టివిస్ట్‌.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం.. త్వరలో ఆమె అంతరిక్ష యాత్రకు వెళ్లనుండడమే! ప్రముఖ ఏరోస్పేస్‌ సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’ తన న్యూ షెపర్డ్‌ రాకెట్‌లో త్వరలో చేపట్టబోయే అంతరిక్ష యాత్రలో తానూ భాగం కానుంది అమండా. తద్వారా రోదసీలోకి వెళ్లనున్న తొలి వియత్నాం మహిళగా చరిత్ర సృష్టించనుంది. వ్యోమగామి కావాలన్న తన చిన్ననాటి కలను ఇలా సాకారం చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటోన్న అమండా చేస్తోన్న సమాజ సేవ, ఉద్యమ పోరాటాలకు గుర్తింపుగా 2019లో ‘నోబెల్‌ శాంతి బహుమతి’కి నామినేట్‌ అయింది. 2022లో ‘టైమ్‌ ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గానూ నిలిచింది. వీటితో పాటు మరెన్నో అవార్డులు, రివార్డులు ఆమె సొంతమయ్యాయి. ప్రస్తుతం పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా ఆయా సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపిస్తోంది అమండా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్