బాల్య వివాహాన్ని తప్పించుకొని.. ‘గ్లోబల్‌ నర్స్‌’గా ఎదిగింది..!

కెన్యా అత్యంత పేద దేశాల్లో ఒకటి. అక్కడ విద్య, వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే! అమ్మాయిలకు జననేంద్రియ విచ్ఛేదనం చేయడం అక్కడ ఆచారంగా భావిస్తారు. ఇక బాల్య వివాహాలు అక్కడ సర్వ సాధారణం. అమ్మాయిలకు 18 ఏళ్ల వయసులో పెళ్లి చేయడాన్ని చాలా ఆలస్యంగా భావిస్తుంటారు. స్త్రీ సాధికారత కొరవడిన ఇలాంటి ప్రాంతానికి....

Updated : 24 May 2022 16:38 IST

(Photos: Facebook)

కెన్యా అత్యంత పేద దేశాల్లో ఒకటి. అక్కడ విద్య, వైద్య సదుపాయాలు అంతంతమాత్రమే! అమ్మాయిలకు జననేంద్రియ విచ్ఛేదనం చేయడం అక్కడ ఆచారంగా భావిస్తారు. ఇక బాల్య వివాహాలు అక్కడ సర్వ సాధారణం. అమ్మాయిలకు 18 ఏళ్ల వయసులో పెళ్లి చేయడాన్ని చాలా ఆలస్యంగా భావిస్తుంటారు. స్త్రీ సాధికారత కొరవడిన ఇలాంటి ప్రాంతానికి చెందిన అమ్మాయిలు తమ ప్రతిభతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కలలో మాట! కానీ కాదని నిరూపించింది 31 ఏళ్ల అన్నా ఖబాలే దుబా. తన వృత్తి, సమాజ సేవకు గుర్తింపుగా ఇటీవలే ప్రతిష్టాత్మక ‘గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డ్‌’ గెలుచుకుందామె. అంతకుముందు ‘మిస్‌ కెన్యా పీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అవార్డు’ను సైతం సొంతం చేసుకున్న ఆమె.. ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మహిళల్ని సాధికారత దిశగా నడిపిస్తోంది.

దుబాయ్‌కి చెందిన ‘ఆస్టర్‌ గార్డియన్స్‌’ అనే సంస్థ గతేడాది తొలిసారిగా ‘గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డ్స్‌’ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా నర్సులుగా పనిచేస్తూ సమాజ సేవ చేస్తోన్న సుమారు 24వేల మంది నర్సుల్ని ఫైనలిస్టులుగా ఎంపికచేసింది. ఇందులో కెన్యాకు చెందిన 31 ఏళ్ల అన్నా ఖబాలే దుబా విజయం సాధించి ‘గ్లోబల్‌ నర్స్‌ అవార్డ్‌’ను సొంతం చేసుకుంది. ఇందుకు గానూ ఆమె సుమారు రూ. 1.94 కోట్లను బహుమతిగా అందుకుంది. ఈ నేపథ్యంలో దుబా గురించి మరిన్ని విశేషాలు మీకోసం...

దుబానే మొదటి అమ్మాయి...

దుబా కెన్యాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించింది. ఆ కుటుంబంలో 19 మంది సంతానం. వారిలో దుబానే చిన్నమ్మాయి. అక్కడ అమ్మాయిలు చదువుకోవడం చాలా అరుదు. అయితే దుబా పుట్టిన సమయంలో అమ్మాయిలకూ చదువు అవసరమేనని ఆమె తల్లిదండ్రులు భావించారు. దాంతో ఆ కుటుంబం నుంచి పాఠశాలకు వెళ్లిన మొదటి అమ్మాయిగా నిలిచింది దుబా. ఇలా ప్రాథమిక విద్యాభ్యాసమేమో గానీ.. ఉన్నత చదువులు చదవడం మాత్రం అక్కడి అమ్మాయిలకు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే టీనేజీ వయసులోనే వాళ్లకు పెళ్లి చేసేస్తుంటారు తల్లిదండ్రులు. ఒకవేళ 18 ఏళ్లకు పెళ్లి చేశారంటే చాలా ఆలస్యంగా భావిస్తుంటారు. ఇక కౌమార దశలో అమ్మాయిలకు జననేంద్రియ విచ్ఛేదనం చేయడం ఆచారంగా పాటిస్తుంటారు. దుబాకి కూడా 12 ఏళ్ల వయసులోనే మ్యుటిలేషన్‌ చేశారు. 14 ఏళ్ల వయసులో పెళ్లి చేయాలని నిశ్చయించినప్పటికీ ఎలాగోలా తన తల్లి సహాయంతో బాల్య వివాహం నుంచి తప్పించుకుందామె. ఇక చిన్న వయసు నుంచే చదువుపై మక్కువ చూపే ఆమెకు.. దీంతో మహదవకాశం దొరికినట్లయింది. ఫలితంగా ‘కెన్యా మెథడిస్ట్ యూనివర్సిటీ’లో నర్సింగ్‌ పూర్తి చేసింది. దీంతో ఆ ఊరిలో డిగ్రీ చదివిన మొదటి అమ్మాయిగా పేరు సంపాదించుకుంది దుబా.

వాటికి వ్యతిరేకంగా...

నర్సింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత దుబా ‘మార్సబిట్ కౌంటీ రిఫరల్ హాస్పిటల్‌’లో నర్సుగా చేరింది. ఈ క్రమంలో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో తరతరాలుగా ఆచరిస్తోన్న బాల్యవివాహాలు, అమ్మాయిలకు జననేంద్రియ విచ్ఛేదనం చేసే పద్ధతికి వ్యతిరేకంగా పోరాడింది. ‘మేము పితృస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చాం. ఇలాంటి విషయాల గురించి పబ్లిక్‌గా మాట్లాడడం అంత సులభం కాదు. కానీ, నా వంతుగా వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను..’ అని చెప్పుకొచ్చిందీ డేరింగ్‌ నర్సు.

ఖబాలే దుబా ఫౌండేషన్‌...

ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో దుబా ఎప్పుడూ ముందుంటుంది. అందుకే నర్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానంటోంది. ఈ క్రమంలో తన సొంతూళ్లో ‘ఖబాలే దుబా ఫౌండేషన్‌’ను స్థాపించింది. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా అమ్మాయిలకు, మహిళలకు.. విద్య, ఆరోగ్యం, సమాజ సేవ, ఆర్థిక సాధికారత.. వంటి విషయాల్లో అవగాహన పెంచుతోందామె. వీటితో పాటు అమ్మాయిలకు శాపంగా మారిన బాల్య వివాహాలు, జననేంద్రియ విచ్ఛేదనం.. వంటి మూఢవిశ్వాసాలపై అలుపెరుగని పోరాటం చేస్తోంది. అంతేకాదు.. అలాంటి వాటిని గణనీయంగా తగ్గించడంలోనూ సఫలీకృతురాలైందామె. ఇలా తన సేవలకు గుర్తింపుగా 2019లో ‘Waislitz Global Citizen Choice Award’ సైతం అందుకుంది. ఈ అవార్డులో భాగంగా 50 వేల డాలర్లను సొంతం చేసుకుంది దుబా. ఈ డబ్బుతో PAPA (ప్యాడ్స్‌, ప్యాంట్స్‌) కార్యక్రమం చేపట్టి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమ్మాయిలకు శ్యానిటరీ ప్యాడ్స్, ప్యాంట్స్ అందచేస్తోంది. ఇలా ఆమె చేస్తోన్న సమాజ సేవ, మహిళా సాధికారత కోసం తాను చేస్తోన్న కృషే ఇటీవల ఆమెను ప్రతిష్టాత్మక ‘గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డ్‌’ అందుకునేలా చేశాయి.

అన్నయ్య సహకారంతోనే...

దుబా ‘గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డ్‌’ గెలుచుకున్న తర్వాత తన ఫేస్‌బుక్‌ పేజీలో ఓ భావోద్వేగపూరిత పోస్టు పెట్టింది. ‘ఈ అవార్డును చనిపోయిన మా అన్నయ్య మలిచా దుబాకి అంకితమిస్తున్నా. అతను కూడబెట్టిన డబ్బుతోనే నేను నర్సింగ్‌ చదవగలిగాను. దురదృష్టవశాత్తూ నేను మొదటి సెమిస్టర్‌లో ఉండగానే అతను చనిపోయాడు. ఆ తర్వాత ప్రముఖ రాజకీయ నాయకురాలు లినా జెబి కిలిమో నాకు సహాయం చేశారు. నా నర్సింగ్‌ విద్యకు సంబంధించిన పూర్తి బాధ్యతలు ఆమే చూసుకున్నారు. ఎంతైనా మా అన్నయ్య లేని లోటు పూడ్చలేనిది. ఇప్పుడు నేను ఈ అవార్డు అందుకోవడం తను ప్రత్యక్షంగా చూసుంటే తన చెల్లెలు సాధించిన విజయానికి ఉప్పొంగిపోయేవాడు..’ అంటూ తన మనసులోని మాటల్ని అక్షరీకరించింది దుబా.

ప్రస్తుతం దుబా అటు నర్సుగా పనిచేస్తూనే, ఇటు సేవా కార్యక్రమాలూ కొనసాగిస్తోంది. మరోవైపు ఎపిడెమియాలజీ విభాగంలో మాస్టర్స్‌ చదువుతోంది. 2020లో ‘వంద మంది అత్యంత ప్రభావంతమైన యువ ఆఫ్రికన్ల’ జాబితాలో చోటు సంపాదించుకున్న దుబా.. నర్సింగ్‌ చదివే సమయంలో ‘మిస్‌ కెన్యా పీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ టైటిల్‌’నూ సొంతం చేసుకుంది. కెరీర్‌లో స్థిరపడ్డాక తన 26 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఆమె.. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్