గాజు సీసాలతో అందాల అలంకరణ వస్తువులు..!
ఇటు పర్యావరణహితంగా ఉండడంతో పాటు, అటు ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకొస్తోన్న తన ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తులకు క్రమంగా ఆదరణ పెరుగుతుందంటోన్న రంజిని.. గ్లాస్ స్టార్టప్ జర్నీ ఎలా మొదలైందో తెలుసుకుందాం రండి..
(Photos: Instagram)
ఇంట్లో ఉండే గాజు సీసాలు, వస్తువులు అవసరం లేకపోయినా, పగిలిపోయినా చెత్తడబ్బాలో వేసేసి చేతులు దులుపుకొంటాం. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ మాదిరే గాజు సీసాల వల్ల సైతం పర్యావరణానికి కలిగే ముప్పు తక్కువేం కాదంటున్నారు పరిశోధకులు. ఈ ముప్పు తప్పించడానికి తన వంతుగా కృషి చేస్తోంది కేరళకు చెందిన రంజినీ థంపి. వాడి పడేసిన గాజు సీసాల్ని రీసైక్లింగ్ చేసి.. వాటితో అందమైన ఇంటి అలంకరణ వస్తువులు తయారుచేస్తోందామె. ఇటు పర్యావరణహితంగా ఉండడంతో పాటు, అటు ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకొస్తోన్న తన ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తులకు క్రమంగా ఆదరణ పెరుగుతుందంటోన్న రంజిని.. గ్లాస్ స్టార్టప్ జర్నీ ఎలా మొదలైందో తెలుసుకుందాం రండి..
కొచ్చిలో పుట్టిపెరిగిన రంజిని.. దుబాయ్‌లో చదువు పూర్తి చేసి, విభిన్న రంగాల్లో ఏడేళ్లకు పైగా పని చేసింది. చిన్న వయసు నుంచే కళలు, పెయింటింగ్‌పై ఆసక్తి కనబరిచిన ఆమె.. కేరళ మ్యూరల్ పెయింటింగ్స్, అక్రిలిక్ పెయింటింగ్స్‌పై శిక్షణ తీసుకుంది. తాను వేసిన పెయింటింగ్స్‌ని వివిధ ఎగ్జిబిషన్లలోనూ ప్రదర్శించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక పెళ్లి తర్వాత కెరీర్ నుంచి విరామం తీసుకున్న రంజిని.. తన భర్తతో కలిసి భారత్‌కు తిరిగొచ్చేసింది.
గాజు వ్యర్థాల గుట్టు తెలిశాక..!
‘దుబాయ్‌లో ఉన్నంత కాలం ఉద్యోగంతోనే సమయం సరిపోయేది.. కానీ ఇండియాకొచ్చాక, ఇక్కడ ఉత్పత్తయ్యే టన్నుల కొద్దీ వ్యర్థాలు చూశాక నా మనసు చలించిపోయింది. ఈ క్రమంలోనే ఏటా 3 మిలియన్ టన్నుల గాజు వ్యర్థాలు ఉత్పత్తవుతున్నట్లు.. అందులో కేవలం 45 శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నట్లు తెలుసుకున్నా. ఇంకాస్త శోధిస్తే.. ఈ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి చాలా ఏళ్లే పడుతుందన్న విషయం అర్థమైంది. అలాంటప్పుడు వీటిని రీసైక్లింగ్ చేసి అందమైన అలంకరణ వస్తువులుగా ఎందుకు మలచకూడదు? అన్న ఆలోచన వచ్చింది. ఇదే 2021లో ‘వాపసీ’ పేరుతో వ్యాపారం ప్రారంభించేందుకు దోహదం చేసింది. నాకే కాదు.. మావారికీ కళల్లో ప్రావీణ్యం ఉంది. తనకు సినిమాల కోసం విభిన్నమైన ధ్వనుల్ని ఉత్పత్తి చేసే స్టూడియో ఉంది. ఇందుకోసం తనకు వివిధ రకాల చెత్త/పాత సామగ్రి కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చెత్త సామగ్రిని అమ్మే డీలర్లను తరచూ సంప్రదించేవాళ్లం. వారి నుంచే నేను గాజు బాటిల్స్ సేకరిస్తున్నా..’ అంటోంది రంజిని.
ఎన్నెన్నో అలంకరణ వస్తువులు!
సృజనాత్మక నైపుణ్యాలుంటే.. ఏ వస్తువునైనా అందంగా మలచచ్చు. రంజిని కూడా ఇదే విషయం నిరూపిస్తోంది. వృథా అంటూ పడేసే గాజు సీసాల్ని సేకరించి.. వాటితో వాల్ హ్యాంగింగ్స్, గడియారాలు, ప్యాలెట్స్, బాటిల్ ల్యాంప్స్, టేబుల్ డెకరేటివ్ పీసెస్, సెంటెడ్ క్యాండిల్స్, విండ్‌చైమ్స్.. ఇలా ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసే అలంకరణ వస్తువులు, ఆర్ట్ పీసెస్ రూపొందిస్తోంది. ‘స్క్రాప్ డీలర్ల దగ్గర్నుంచి గాజు బాటిల్స్‌తో పాటు టైర్ రిమ్స్, బకెట్స్, టిన్ క్యాన్స్.. వంటివీ సేకరిస్తున్నా. వీటితో మొదట్లో మా ఇంటికి కావాల్సిన అలంకరణ వస్తువుల్ని తయారుచేసి అక్కడక్కడా అమర్చా. ఇవి చూసి మా బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. చెత్తతో తయారుచేసిన వస్తువులంటే వాళ్లు నమ్మలేదు. కానీ తర్వాత మాకూ కావాలంటూ అడిగారు. అలా నేను తయారుచేసే గ్లాస్ బాటిల్ డెకరేటివ్ పీసెస్ గురించి చాలామందికి తెలిసింది. దాంతో ఆర్డర్లూ పెరిగాయి. ఇలా ఈ రెండేళ్ల కాలంలో సుమారు 21 వేల గాజు బాటిల్స్‌తో వివిధ రకాల అలంకరణ వస్తువులు తయారుచేశా..’ అంటోన్న రంజిని వృథాగా పడేసే కొబ్బరి చిప్పలు, చెక్క, లోహపు వ్యర్థాల్నీ వివిధ రకాల అలంకరణ వస్తువులుగా మలుస్తోంది. అంతేకాదు.. వ్యాపారం ప్రారంభించడానికి ఏడాది ముందు ‘క్లైమేట్ కలెక్టివ్ లాంచ్ ప్యాడ్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఓ శిక్షణ కార్యక్రమంలో భాగమైన ఆమె.. ఈ వేదికగా వ్యాపార మెలకువలు, మార్కెటింగ్ నైపుణ్యాలు.. వంటివెన్నో నేర్చుకున్నానంటోంది.
ఓపిక, సృజనాత్మకత.. ముఖ్యం!
గాజు బాటిల్స్/వస్తువులు చాలా సున్నితంగా ఉంటాయి.. కాస్త బలమైన వస్తువు తాకితే ఇట్టే పగిలిపోతాయి. ఇలాంటి వస్తువుల్ని రీసైక్లింగ్ చేయడం ఓ సవాలంటోంది రంజిని.
‘గాజు వస్తువుల్ని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం.. వీటి సున్నితత్వం కారణంగా త్వరగా పగుళ్లు వస్తాయి. అందుకే వీటిని రీసైక్లింగ్ చేసేటప్పుడు ఎంతో ఓపికతో వ్యవహరించాలి. ఈ క్రమంలో కొంతమంది ఈ వృత్తిలో ఉన్న వారి దగ్గర్నుంచి పలు మెలకువలు నేర్చుకున్నా. ఎన్నో ప్రయత్నాలు, మరెన్నో వైఫల్యాల తర్వాత ఇప్పుడు పర్‌ఫెక్ట్‌గా రీసైక్లింగ్ చేయగలుగుతున్నా. ఇక నేను తయారుచేస్తోన్న ఈ అలంకరణ వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులిచ్చే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్.. నాకు మరింత ప్రేరణనిస్తోంది. ఈ ప్రోత్సాహంతోనే మరింత సృజనాత్మకంగా అలంకరణ వస్తువులు తయారుచేయగలుగుతున్నా..’ అంటోందామె. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పలు ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ ద్వారా తాను తయారుచేసే ఉత్పత్తుల్ని విక్రయిస్తోన్న రంజిని.. భవిష్యత్తులో మరిన్ని వృథా వస్తువుల్ని రీసైక్లింగ్ చేసి.. పర్యావరణాన్ని కాపాడడమే తన లక్ష్యమని చెబుతోంది. మరోవైపు తన కళను నలుగురికీ పంచడానికి రీసైక్లింగ్ వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.