Political Equality: మహిళా నేతలను తయారుచేస్తోంది!

‘రాజకీయాలంటేనే రొంపి... ఇందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి. అవమానాలు, హేళనలు భరించాలి. అందుకే అతివలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’... ప్రస్తుత రాజకీయాల గురించి అడిగితే చాలామంది అమ్మాయిలు ఇదే చెబుతారు.

Updated : 29 Feb 2024 16:57 IST

(Photo: Facebook)

‘రాజకీయాలంటేనే రొంపి... ఇందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి. అవమానాలు, హేళనలు భరించాలి. అందుకే అతివలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’... ప్రస్తుత రాజకీయాల గురించి అడిగితే చాలామంది అమ్మాయిలు ఇదే చెబుతారు. అయితే ఇలాంటి అభిప్రాయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందంటోంది భోపాల్‌కు చెందిన కాంక్షి అగర్వాల్‌. అన్ని రంగాల్లో లాగానే పాలిటిక్స్‌లోనూ మహిళల ప్రాతినిథ్యం పెరగాలంటోంది. ఈ క్రమంలోనే ‘నేత్రి’ ఫౌండేషన్‌ ద్వారా వీలైనంత మంది మహిళలను రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

నా ఫౌండేషన్‌ లక్ష్యమిదే!

మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మహిళలు ఎక్కువగా వినియోగించే శానిటరీ న్యాప్‌కిన్లపై 18 శాతం జీఎస్‌టీ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఒకరిద్దరు తప్ప పెద్దగా దీనిని వ్యతిరేకించలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించనూ లేదు. దీంతో మహిళలందరూ నేటికీ అదనపు పన్ను చెల్లిస్తూ శానిటరీ ప్యాడ్లు కొనుగోలు చేస్తున్నారు. కానీ 28 ఏళ్ల కాంక్షీ అగర్వాల్‌ మాత్రం మౌనంగా ఉండలేకపోయింది. జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని తప్పు పట్టింది.

‘మహిళల శానిటరీ న్యాప్‌కిన్లపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే...అసలు నిజం తెలిసింది. అదేంటంటే... జీఎస్‌టీ శ్లాబులను నిర్ణయించడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన జీఎస్‌టీ కౌన్సిల్‌లో ఒక్క మహిళ కూడా లేదు. ఒకవేళ అందులో మహిళలు ఉంటే ఈ నిర్ణయాన్ని అడ్డుకునేవారు కదా? కనీసం ప్రశ్నించేవారు కదా? అక్కడే కాదు.. రాజకీయాల్లోనూ మహిళల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉంది. అందుకే కొన్ని ప్రభుత్వాలు తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలు మహిళలకు నష్టం కలిగిస్తున్నాయి. ఇలా జరగకూడదంటే మహిళలు కూడా రాజకీయాల్లోకి రావాలి. ఈ లక్ష్యంతోనే 2019లో ‘నేత్రి’  ఫౌండేషన్‌ను ప్రారంభించాను..’

ఒక్కరితో అసమానతలు తొలగిపోవు..!

‘మగవారు అసలు మాలా ఉండలేరు. మాలా దుస్తులు ధరించలేరు. అలాంటప్పుడు నెలసరి లాంటి సమస్యలను వారెలా అర్థం చేసుకుంటారు. అందుకే ప్రభుత్వాలు అమలు చేసే పాలసీలు, చట్టాల్లో మహిళల ప్రాతినిథ్యం ఉండాలంటాను. నేను ముంబయిలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్ సైన్సెస్‌ నుంచి ‘అర్బన్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌’ లో మాస్టర్స్  చేశాను. అదే సమయంలో ‘లెజిస్లేటివ్ ఎయిడ్‌ టు మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ (LAMP)’ ఫెలోషిప్‌ రూపంలో ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి పనిచేసే అవకాశం లభించింది. అప్పుడే రాజకీయాల్లో ఉన్న అసమానతలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. నేను కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నాను... కానీ ఎలా రావాలి? ఒకవేళ వచ్చినా నా ఒక్కదానితో ఈ అసమానతలన్నీ తొలగిపోవు కదా? అందుకే ‘నేత్రి ఫౌండేషన్‌’కు శ్రీకారం చుట్టాను..’

అందుకే రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకోవడం లేదు!

‘నేను కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోనే పుట్టాను. కానీ మా ఫ్యామిలీలో ఇప్పటికీ ఎవరూ నాకు సపోర్టు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ సమాజం అమ్మాయిలను కేవలం టీచర్లు, ఇంజినీర్లు, డాక్టర్ల గానే చూడాలనుకుంటోంది కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టమని ప్రోత్సహించదు. రాజకీయాలంటేనే రొంపి అనే భావన చాలామందిలో ఉంది. ఒకవేళ ధైర్యం చేసి అడుగుపెట్టినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండదు. అదేవిధంగా ‘పాలిటిక్స్ అంటేనే డబ్బుతో కూడిన వ్యవహారం... ఇందులోకి అడుగుపెడితే కుటుంబానికి సమయం కేటాయించలేం..’ ఇలా ఎన్నో కారణాలతో చాలామంది అమ్మాయిలు రాజకీయాలను కెరీర్‌గా ఎంచుకోలేకపోతున్నారు. ఇలా ‘నేత్రి’ని ఏర్పాటుచేసేముందు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఎంతో అధ్యయనం చేశాను..’

గ్రామ స్థాయి నుంచే మొదలుపెట్టాను!

‘నా దృష్టిలో మహిళలను నేరుగా రాజకీయాల్లోకి రమ్మనడం కూడా సరైనది కాదు. పాలిటిక్స్‌ గురించి వారికి పూర్తి అవగాహన ఉండాలి. అందుకే ఫౌండేషన్‌ ఏర్పాటు చేశాక గ్రామాల నుంచే నా పని మొదలుపెట్టాను. మొదటగా నా సొంత రాష్ట్రం భోపాల్‌నే ఎంచుకున్నాను. ఆ తర్వాత యూపీలోని బరేలీ, రాయ్‌బరేలీ, అమేథీ.. తదితర జిల్లాల్లో పర్యటించాను. మా బృందంతో అక్కడి సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ మహిళలను కలిశాను. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి రాజకీయాల్లోకి ఎలా రావాలి? బూత్‌ మేనేజ్‌మెంట్‌, నియోజక వర్గాల నిర్వహణ, నామినేషన్లు వేయడం, ఆర్గనైజింగ్‌ స్కిల్స్‌, సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణ తదితర విషయాలపై వారికి అవగాహన కల్పించాను. అదేవిధంగా న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శానససభల పని తీరు, ప్రభుత్వ పాలసీల అమలు గురించి శిక్షణ ఇప్పించాను.’

400 మందికి పైగా మహిళలకు!

‘తమ ఇళ్లను ఎంతో బాధ్యతగా చూసుకునే మహిళలు రాజకీయాల్లో కూడా అంతే బాధ్యతగా పని చేస్తారని నా నమ్మకం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. అన్నిటికన్నా మించి రాజకీయాల్లో ఓ పారదర్శకతను తీసుకొస్తారు. మా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గతేడాది నుంచి 400 మందికి పైగా మహిళలకు రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పించాం. ఇలా దేశంలో మహిళలకు పొలిటికల్‌ పాఠాలు చెప్పే ఏకైక సంస్థ మాదే. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను’ అంటోంది కాంక్షి!

అదే ‘మొదటి మెట్టు’!

తన ఫౌండేషన్‌ ద్వారా మహిళలకు రాజకీయాలపై అవగాహన పెంచడమే కాదు.. ఈ దిశగా ఇతర సంస్థలతో మమేకమై పనిచేస్తోంది కాంక్షి.  ఈ క్రమంలోనే ‘Suveeksha’ అనే ఎడ్‌టెక్‌ కంపెనీతో కలిసి ‘First Step To Politics’ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజకీయాల్లోకి రావాలని ఆరాటపడే మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ ప్రోగ్రామ్‌ ముఖ్యోద్దేశం. ఇటీవలే ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆరు వారాల పాటు కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు, కమ్యూనికేషన్‌ నిపుణులు, క్షేత్ర స్థాయి రాజకీయాల్లో విస్తృత అనుభవం ఉన్న వారితో వెబినార్లు/సెమినార్లు, క్యాంపెయిన్స్‌ నిర్వహించనున్నారు.

 

వక్తగా.. రచయిత్రిగా..!

* రాజకీయాల్లో మహిళా సాధికారత దిశగా వడివడిగా అడుగులేస్తోన్న కాంక్షి.. ప్రస్తుతం ‘సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌’లో సీనియర్‌ రీసెర్చర్‌గా కొనసాగుతోంది.

* గతంలో ‘ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ రీసెర్చ్‌ డిపార్ట్‌మెంట్‌’లో పనిచేసిన ఆమె.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ కోసం ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించే ప్రధాన పరిశోధన బృందంలో భాగమైంది.

* LAMP, Citizen for Public Leadership, Lead like a Girl - Shenomics.. వంటి ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌లనూ అందుకుంది.

*ఐక్యరాజ్యసమితి అందించే ‘కరమ్‌వీర్‌ చక్ర అవార్డు’ను రెండుసార్లు (2019లో రజతం, 2016లో కాంస్యం) అందుకుంది కాంక్షి.

* దేశవిదేశాలకు చెందిన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, సంస్థల నుంచి ప్రత్యేక వక్తగా పలుమార్లు ఆహ్వానం కూడా అందుకుందీ యంగ్‌ లేడీ.

* వివిధ డిజిటల్‌ కంటెంట్‌ వేదికలకు వ్యాసాలు సైతం రాసి తనలోని రచనా సామర్థ్యాన్ని బయటపెట్టింది.

Photos: Facebook/kanksshi.agarwal

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్