వయసు 83.. సైక్లింగ్‌, స్కిప్పింగ్‌, పుషప్స్‌.. ఏదైనా చేసేస్తా!

ఫిట్‌నెస్‌.. ఇది ఒక వయసుకే పరిమితమనుకుంటాం.. ఆ వయసులోనైతేనే విభిన్న వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరిస్తుందనుకుంటాం. కానీ ఇదే ప్రశ్న ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ మిలింద్‌ సోమన్‌ తల్లి ఉషా సోమన్‌ని అడిగితే ‘ఫిట్‌నెస్‌కి వయసుతో సంబంధమేముంది? దానిపై మనసు పెడితే చాలు.. ఏ వయసులోనైనా దీన్ని మన సొంతం....

Published : 30 Mar 2022 15:33 IST

(Photos: Instagram)

ఫిట్‌నెస్‌.. ఇది ఒక వయసుకే పరిమితమనుకుంటాం.. ఆ వయసులోనైతేనే విభిన్న వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరిస్తుందనుకుంటాం. కానీ ఇదే ప్రశ్న ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ మిలింద్‌ సోమన్‌ తల్లి ఉషా సోమన్‌ని అడిగితే ‘ఫిట్‌నెస్‌కి వయసుతో సంబంధమేముంది? దానిపై మనసు పెడితే చాలు.. ఏ వయసులోనైనా దీన్ని మన సొంతం చేసుకోవచ్చు..’ అని నిర్మొహమాటంగా చెబుతారామె. ‘వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే!’ అనే ఫిలాసఫీని నమ్మే ఈ ఫిట్‌నెస్‌ ఔత్సాహికురాలు.. 83 ఏళ్ల వయసులోనూ ఎలాంటి వ్యాయామమైనా అలవోకగా చేసేస్తుంటారు. ఇక, తాజాగా సైకిల్‌ తొక్కి ఆ విషయాన్ని మరోసారి నిరూపించారామె. ఇలా తన తల్లి సైక్లింగ్‌ ఫొటోలు, వీడియోల్ని మిలింద్‌ ఇన్‌స్టాలో పంచుకోగా.. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి. మరి, ‘తరిగేది వయసే కానీ ఉత్సాహం కాదు’ అనేంత చలాకీగా వ్యాయామాలు చేసేస్తోన్న ఈ ఫిట్టెస్ట్‌ మామ్‌ ఫిట్‌నెస్‌ మంత్ర ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఫిట్‌నెస్‌ కోసమే పుట్టారేమో అనిపిస్తుంది సోమన్‌ ఫ్యామిలీని చూస్తుంటే! ఇటు సోషల్‌ మీడియాలో, అటు మారథాన్‌లలో, మరోవైపు ఫిట్‌నెస్‌ ఈవెంట్లలో.. ఇలా ఎక్కడ చూసినా మిలింద్‌ సోమన్‌, ఆయన భార్య అంకితా కొన్వర్‌, తల్లి ఉషా సోమన్‌ లేనిదే ఆ ఈవెంట్‌ పూర్తి కాదంటే అది అతిశయోక్తి కాదు. బయటే కాదు.. ఇంట్లోనూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ వ్యాయామాలు చేస్తుంటారీ ఫిట్‌నెస్‌ త్రయం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేసే తమ ఫొటోలు, వీడియోలే! ఇక మిలింద్‌ తల్లి ఉషా సోమన్‌కు సంబంధించిన ఫిట్‌నెస్‌ అప్‌డేట్స్‌ను కొడుకు, కోడలు తరచూ తమ ఇన్‌స్టా ఖాతాల్లో పంచుకుంటుంటారు.

పాతికేళ్ల తర్వాత..!

ఇదే క్రమంలో మిలింద్‌ తన తల్లి బీచ్‌లో సైకిల్ తొక్కుతోన్న ఫొటోలు, వీడియోల్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ‘అమ్మ పాతికేళ్ల తర్వాత మళ్లీ సైకిల్‌ తొక్కింది. మొదట్లో బ్యాలన్స్‌ చేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడినా.. ఆ తర్వాత తనంతట తానే ముందుకు సాగింది. మనసు పెడితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అయితే ఏది ఎంచుకున్నా నిరంతరం సాధన చేయడం మాత్రం ముఖ్యం. అలాగే 83 ఏళ్ల వయసులో సైక్లింగ్‌ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు..’ అంటూ క్యాప్షన్‌ పెట్టారాయన. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. 83 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా సైక్లింగ్‌ చేస్తోన్న ఉష ఉత్సాహాన్ని చూసి అటు పలువురు ప్రముఖులు, ఇటు నెటిజన్లు స్ఫూర్తి పొందుతున్నారు. ఇక ఉష కోడలు, మిలింద్‌ భార్య అంకిత ఈ పోస్ట్‌కు ‘క్యూటీస్‌’ అని కామెంట్‌ పెట్టింది.

వండర్‌ ఉమన్‌ మనలోనూ ఉంది!

అత్తా కోడలంటే వీరిలాగే ఉండాలేమో అనిపిస్తుంది అంకితా కొన్వర్‌ - ఉషా సోమన్‌ని చూస్తే! అంతటి అనురాగ బంధం వీరి మధ్య ఉంది. ఇంటా, బయటా అత్తగారితో కలిసి వ్యాయామాలు చేసే మిసెస్‌ సోమన్‌.. ఆ వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌తో షేర్‌ చేస్తుంటుంది. అంతేకాదు.. ఈ వయసులోనూ ఫిట్‌నెస్‌పై ఎంతో మక్కువ చూపే తన అత్తయ్యను ప్రతి విషయంలోనూ స్ఫూర్తిగా తీసుకుంటుందామె. ఈ క్రమంలోనే చీరకట్టులో స్కిప్పింగ్, పుషప్స్‌ ప్రాక్టీస్‌ చేస్తోన్న తన అత్తయ్య వీడియోను మొన్నామధ్య ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది అంకిత.

‘నేను పరిచయమున్న వారికి నాకు వండర్‌ ఉమన్‌ (డీసీ కామిక్స్‌లోని సూపర్‌ హీరో పాత్ర) అంటే ఎంతిష్టమో తెలిసే ఉంటుంది. అయితే నేను ఈ వండర్‌ ఉమన్‌ గురించి మా అత్తగారితో చెప్పినప్పుడు ‘మనలోనూ ఓ వండర్‌ ఉమన్‌ తప్పకుండా ఉంటుంది..’ అంటూ సమాధానమిచ్చారు..’ అంటూ తన అత్తయ్య మాటల్ని ఈ వీడియోకు క్యాప్షన్‌గా జోడించింది అంకిత. ఇలా మహిళ అంటేనే ఓ అద్భుతమంటూ తన మాటలతో మరోసారి మనందరిలో స్ఫూర్తి నింపిందీ ఫిట్టెస్ట్‌ గ్రానీ.

16 ఏళ్ల నుంచే..!

83 ఏళ్ల వయసులోనూ చురుగ్గా వ్యాయామాలు చేస్తూ అదరగొడుతోన్న ఉషా సోమన్‌ ఫిట్‌నెస్‌ జర్నీ 16 ఏళ్లకే మొదలైందని చెప్పచ్చు. ఆ వయసు నుంచే ట్రెక్కింగ్‌ చేయడం ప్రారంభించిన ఆమె.. ఎవరెస్ట్‌, కిలిమంజారో పర్వత శిఖరాల బేస్‌ క్యాంప్‌ వరకు వెళ్లొచ్చారు. బయోకెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత ఇక తన పూర్తి సమయాన్ని ఫిట్‌నెస్‌కే కేటాయించారామె. ఈ క్రమంలో 60 ఏళ్ల తర్వాత నడకను అతి ముఖ్యమైన వ్యాయామంగా మలచుకున్న ఆమె.. ఈ వర్కవుట్‌తోనే తనకు ఆనందం, ఆరోగ్యం సొంతమవుతాయని చెబుతున్నారు.

‘మొదట్లో నాకు ఫిట్‌నెస్‌ అంటే ఎలాంటి ఐడియా లేదు. నా దృష్టిలో శారీరకంగా చురుగ్గా ఉండడమే సంపూర్ణ ఫిట్‌నెస్‌. ఈ క్రమంలో నేను ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత నడకను నా రోజువారీ ప్రణాళికలో భాగం చేసుకున్నా. రోజుకు ఐదు కిలోమీటర్లు నడవడం అలవాటు చేసుకున్నా. మా కాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇప్పటిలా క్యాబ్‌లు, ఇంత టెక్నాలజీ అందుబాటులో లేవు. అలా నడక అలవాటైంది. ఇప్పుడు నేనింత ఉత్సాహంగా, హ్యాపీగా ఉన్నానంటే నడక వల్లే!’ అంటూ తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని ఓ సందర్భంలో బయటపెట్టారు ఉష.

నాకు తెలిసినవి ఆ మూడే!

ఫిట్‌గా ఉండడానికి ఇప్పుడు చాలామంది విభిన్న రకాల డైట్స్‌ని ఫాలో అవుతున్నారు. కానీ తను మాత్రం ఎలాంటి డైట్‌ ట్రెండ్‌ పాటించకుండానే ఇంత యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉంటున్నానని చెబుతున్నారు ఉష.

‘నానాటికీ కొత్త కొత్త డైట్‌ ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. నిజానికి అలాంటి వాటి మీద నాకు అంత నమ్మకం లేదు. మనం ఫిట్‌గా ఉండాలంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ మన శరీరానికి అందాలి. ఇవన్నీ మన సంప్రదాయ వంటకాల్లో లభిస్తాయి. కాబట్టి వీటిని బ్యాలన్స్‌ చేసినప్పుడే ఆరోగ్యంగా, దృఢంగా ఉండగలుగుతామన్నది నా అభిప్రాయం. అందుకే నేను ఫలానా ఆహారమే తీసుకోవాలన్న నియమమేమీ పెట్టుకోను. ఏదైనా సరే ఆరోగ్యకరంగా తీసుకోవడానికే మొగ్గు చూపుతా. ఇక ఫిట్‌నెస్‌ పేరుతో మన నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మనం చేసే వ్యాయామం కోసం మన శరీరాన్నే కాదు.. మనసునూ సిద్ధం చేసుకోవాలి.. అప్పుడే సంపూర్ణ ఫలితాన్ని పొందచ్చు.. ఇక ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రోజూ నడక, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఫిట్‌నెస్‌ అంటే నాకు తెలిసినవి ఈ మూడే!’ అంటారు ఉష.

ఫిట్‌నెస్‌తోనే సెలబ్రేషన్!

వయసుతో పాటే ఫిట్‌నెస్‌పై మక్కువను పెంచుకుంటోన్న ఉష.. తన ప్రతి సందర్భాన్నీ ఫిట్‌నెస్‌తోనే సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు.

* తన 81 వ పుట్టినరోజు సందర్భంగా చీరకట్టులో పుషప్స్‌ చేసి తనకు తానే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఉష. ఈ క్రమంలో తన తల్లి పుషప్స్‌ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న మిలింద్‌.. ‘15 పుషప్స్‌, అంకిత చేసిన బెల్లం-వెనీలా ఆల్మండ్‌ కేక్‌తో పుట్టినరోజు పార్టీ జరుపుకుంటోన్న మా ఫిట్టెస్ట్‌ మామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలమ్మా!’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు.

* ఇక లాక్‌డౌన్‌ తర్వాత ‘డార్జిలింగ్‌ పోలీస్‌ మారథాన్‌’లో తన కొడుకు, కోడలితో కలిసి పాల్గొన్నారు ఉష. పింక్‌ కుర్తీ, వైట్‌ సల్వార్‌, స్పోర్ట్స్‌ షూ ధరించి 10 కిలోమీటర్లు పరుగుపెట్టారామె. ఇందులో పతకం కూడా గెలుచుకున్నారీ ఫిట్టెస్ట్‌ గ్రాండ్‌ మా.

* కొన్నేళ్ల క్రితం ‘ముంబయి ఆక్స్‌ఫామ్‌ ట్రయల్ వాకర్‌’లో పాల్గొని 48 గంటల్లో వంద కిలోమీటర్లు నడక సాగించారు ఉష.

* ఇక తన కొడుకు మిలింద్‌తో కలిసి అహ్మదాబాద్-ముంబయి మధ్య రెండు వారాల పాటు నిర్వహించిన సుదీర్ఘ మారథాన్‌లోనూ భాగమయ్యారీ సూపర్‌ ఉమన్. ఇలా ఈ వయసులోనూ తనదైన వ్యాయామాలతో, ఫిట్‌నెస్‌ సాహసాలతో అందరిలోనూ స్ఫూర్తి రగిలిస్తున్నారీ వండర్‌ ఉమన్‌.

అమ్మ వల్లే ఇలా!

‘వయసనేది పేరుకే.. మనలో చేయాలన్న తపన ఉంటే అది ఎప్పుడూ అడ్డంకిగా మారదు..’ అంటూ మనందరిలో స్ఫూర్తి రగిలిస్తోన్న ఉష.. తననూ ఎంతగానో ప్రేరేపించిందంటాడు మిలింద్‌. ఫిట్‌నెస్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచే తనను ఈ దిశగా నడిపించింది అమ్మేనంటూ.. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలు, తన తల్లి తనను నడిపించిన తీరును వర్ణిస్తూ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా : ఎ మెమాయిర్‌’ అనే పుస్తకంలో పొందుపరిచాడీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్.

‘అమ్మ ఏదైనా అనుకుందంటే అది సాధించి తీరుతుంది. అస్సలు వెనక్కి తగ్గదు. ఒకసారి ట్రెక్కింగ్‌కి వెళ్లాం. నిజానికి మా కంటే అమ్మే ఎంతో త్వరగా ఈ ఫీట్‌ని పూర్తి చేసింది. అయితే ఒకవేళ ఈ క్రమంలో ఏదైనా సమస్య ఎదురైనా వెనక్కి తగ్గకపోయేది.. బహుశా.. ఈ గుణం నాకు అమ్మ నుంచే వచ్చిందేమో! ఇక తను మానసికంగా చాలా దృఢంగా ఉంటుంది. తక్కువగా మాట్లాడుతుంది. ఎవరినీ నొప్పించదు.. తను బాధపడదు.. తన పనేదో తాను చేసుకుపోతుంది. ఆమెలోని ఈ స్వతంత్రతే నాకు బాగా నచ్చిన అంశం. ఇక ఫిట్‌నెస్ పరంగా ఇంత శ్రద్ధ పెడుతున్నానంటే అది అమ్మ స్ఫూర్తితోనే!’ అంటాడీ ఫిట్‌నెస్‌ గురూ!!

80 దాటినా 20 ఏళ్ల అమ్మాయిలా ఉత్సాహంగా వ్యాయామాలు చేయడమంటే అది ఉషా సోమన్‌కే సాధ్యమేమో అనిపించకమానదు. అందుకే ఆమె వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు.. ‘మీ వ్యాయామాలతో మా అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ఫిట్టెస్ట్‌ గ్రానీ వర్కవుట్‌ వీడియోలు, ఫొటోలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్