Mithali Retirement: ఈ పరుగుల రాణికి సాటెవ్వరు?!

క్రికెట్ ఆడడానికే పుట్టిందేమో అన్నట్లుగా క్రికెట్‌నే తన జీవిత పరమావధిగా మార్చుకుందామె. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం, నాయకురాలిగా సహచరులకు నైపుణ్యాల్ని....

Published : 09 Jun 2022 18:35 IST

క్రికెట్ ఆడడానికే పుట్టిందేమో అన్నట్లుగా క్రికెట్‌నే తన జీవిత పరమావధిగా మార్చుకుందామె. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం, నాయకురాలిగా సహచరులకు నైపుణ్యాల్ని నేర్పించడం, ప్రతికూల పరిస్థితుల్లో జట్టును విజయతీరాలకు చేర్చడం.. ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎన్నో రికార్డులు, అవార్డులు-రివార్డులు ఆమె సిగలో చేరి మురిశాయి. అలా భారత్‌లో మహిళల క్రికెట్‌కు వన్నెలద్దిన ఘనత ‘ది వన్ అండ్ ఓన్లీ’ మిథాలీ రాజ్‌కే దక్కుతుందనడం అతిశయోక్తి కాదు.

ఇప్పటికే మహిళల క్రికెట్లో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఈ స్టార్ క్రికెటర్.. తాజాగా తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. తాను అంతర్జాతీయ క్రికెట్‌ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ రూపంలో సింపుల్‌గా ప్రకటించి అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 23 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని, మరెన్నో విషయాలను నేర్చుకున్నానని భావోద్వేగానికి లోనైందీ హైదరాబాదీ. ఈ నేపథ్యంలో అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా తనకెదురైన ప్రతికూలతల్ని సానుకూలంగా మార్చుకుంటూ, ఒక్కో మెట్టూ ఎక్కుతూ సాగిన ఆమె సుదీర్ఘ క్రికెట్‌ ప్రయాణంలోని కొన్ని మలుపుల్ని ఓసారి నెమరువేసుకుందాం..

నా జర్నీ అలాంటిదే!

ప్రతి ప్రయాణానికీ ముగింపు ఉన్నట్లే.. తన 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందంటోంది మిథాలీ. అంతర్జాతీయంగా అన్ని క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ట్విట్టర్‌ వేదికగా ఓ సుదీర్ఘ లేఖ రూపంలో వెల్లడించిందీ స్టార్‌ బ్యాటర్.

‘చిన్న వయసులోనే క్రికెట్‌లోకి అడుగుపెట్టడం, దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. 23 ఏళ్ల ఈ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. ప్రతి ఈవెంట్‌ ప్రత్యేకమైనదే! వీటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇన్నేళ్లూ ఓవైపు సవాళ్లను ఎదుర్కొంటూ, మరోవైపు కలల్ని నెరవేర్చుకుంటూ ఎంతో సంతోషకరమైన జీవితం గడిపాను. ప్రతి ప్రయాణానికీ ఓ ముగింపు ఉంటుంది. అలాగే నా ఈ సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. ఈ రోజే నేను అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నా. నా జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యా.

మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ జట్టును/దేశాన్ని గెలిపించడానికి నా శాయశక్తులా ప్రయత్నించా. ఏళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించడం ఓ బృహత్తర బాధ్యత. ఈ సుదీర్ఘ కెరీర్‌ నన్ను ఓ వ్యక్తిలా తీర్చిదిద్దింది.. అలాగే భారత మహిళల క్రికెట్ స్వరూపాన్నీ మార్చిందని భావిస్తున్నా. ఓ క్రీడాకారిణిగా, కెప్టెన్‌గా నన్ను ముందు నుంచీ ప్రోత్సహించిన బీసీసీఐ సెక్రటరీ జయ్‌ షా సర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక ఇన్నేళ్ల పాటు నా వెంట ఉండి నడిపించిన, నాపై ప్రేమాభిమానాలు కురిపించిన అభిమానులకు ధన్యవాదాలు!’ అంటూ తన మనసులోని భావాల్ని అక్షరీకరించిందీ క్రికెట్‌ దిగ్గజం. ఇలా ఇంత సింపుల్‌గా, సడెన్‌గా మిథాలీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించేసరికి అటు ప్రముఖులు, ఇటు నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైనా.. ఇన్నేళ్ల పాటు భారత మహిళల క్రికెట్‌కు ఆమె అందించిన సేవల్ని నెమరువేసుకుంటూ ఆమెను కొనియాడుతున్నారు.

మహర్దశ వైపు నడిపించింది!

1999లో మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పుడు అటు ఐసీసీకి, ఇటు బీసీసీఐకి మహిళల క్రికెట్‌తో సంబంధమే లేదు. స్పాన్సర్లు లేకపోవడంతో విదేశీ పర్యటనలకు వెళ్లలేని పరిస్థితి. ఎప్పుడో ఆర్నెళ్లకో సిరీస్, ఏడాదికో పర్యటన అన్నట్లుగా ఉండేది మహిళల క్రికెట్ జట్టు పరిస్థితి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ దృఢచిత్తంతో నిలబడిందీ క్రికెట్ దిగ్గజం. మేటి ఇన్నింగ్స్‌లు, సరికొత్త రికార్డులతో మహిళల క్రికెట్‌కు ప్రాణం పోసింది.. సారథిగా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. ఐసీసీ ఆదేశాలతో మిగతా బోర్డులు మహిళల క్రికెట్‌ను విలీనం చేసుకున్నా.. బీసీసీఐ మాత్రం మొదట్లో అందుకు ఒప్పుకోలేదు. అయినా స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాలనందిస్తూ విలీనం చేయక తప్పని పరిస్థితిని కల్పించింది మిథాలీ. అలా 2006లో బీసీసీఐలో విలీనం మహిళల క్రికెట్‌ను పూర్తిగా మార్చేసింది. దీంతో తరచూ క్రికెట్ సిరీస్‌లు, విదేశీ పర్యటనలు, ప్రత్యక్ష ప్రసారాలు, మ్యాచ్ ఫీజులు, పురుష క్రికెటర్లతో సమానంగా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణాలు, సెంట్రల్ కాంట్రాక్టులతో మహిళల క్రికెట్లో మహర్దశ మొదలైంది. ఇలా మహిళల క్రికెట్కు ఇన్ని పేరు ప్రఖ్యాతులొచ్చాయంటే అందులో మిథాలీ పాత్ర, ఆమె ఆటతీరు, పట్టుదలే కీలకం అని చెప్పడంలో సందేహం లేదు.

ఎందరికో స్ఫూర్తిగా..

2003లో మిథాలీ భారత జట్టు పగ్గాలు చేపట్టినప్పుడు జట్టులో అంతా ఆమె కంటే సీనియర్లే. ప్రస్తుతం జట్టులో అందరూ ఆమె కంటే జూనియర్లే. ఒకప్పుడు అస్థిత్వమే లేని అమ్మాయిల క్రికెట్ ఇప్పుడు దేశంలో మహిళల క్రీడల్లో ముందుంది. ఆదాయం, ప్రచారం, పేరులో మహిళల క్రికెట్ మంచి స్థితికి చేరుకుంది. మిథాలీ స్ఫూర్తితో ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. స్మృతీ మంధాన, పూనమ్ రౌత్, దీప్తి శర్మ అలా వచ్చినవాళ్లే. 2017 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనతో దేశంలో ఆటకు మరింత ఆదరణ పెరిగింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా క్రికెట్ నేర్పించాలనుకునే తల్లిదండ్రుల సంఖ్య ఎక్కువైంది. ఇలా అమ్మాయిలందరికీ స్ఫూర్తి ప్రదాతగా మారిందీ క్రికెట్ మహారాణి.

అదొక్కటే లోటు!

వన్డే క్రికెట్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తిరుగన్నదే లేని మిథాలీకి దేశానికి ప్రపంచకప్ అందించాలన్న కల మాత్రం అలాగే మిగిలిపోయింది. గతేడాది జరిగిన ప్రపంచకప్‌తోనైనా అది నెరవేరుతుందేమో అనుకుంటే.. అప్పుడూ సాధ్యం కాలేదు. ఏదేమైనా తన జీవితంలో ఇదో లోటుగా ఉండిపోతుందంటోంది మిథాలీ.

గాయాల కారణంగా మిథాలీ పదేళ్ల క్రితమే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంది. అదే జరిగి ఉంటే ఇన్ని రికార్డులు, ఘనతలు ఆమె మిస్సవడమే కాదు.. దేశమూ అంత గొప్ప క్రీడాకారిణిని మిస్సయ్యేదేమో! కానీ ఆ సమయంలో మరింత శక్తిని కూడగట్టుకొని తాను కోల్పోయిన ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించి మళ్లీ తనదైన శైలిలో చెలరేగి ఆడింది.

తనదైన కెప్టెన్సీతో భారత మహిళల క్రికెట్‌కు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి.. అస్థిత్వమంటూ లేని భారత మహిళల క్రికెట్‌ను శిఖరాగ్రాన నిలిపిన ఘనత మిథాలీకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆమె మహిళల క్రికెట్‌కే మహారాణి! క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు సిద్ధమైన ఈ క్రికెట్‌ క్వీన్‌కు ఆల్‌ ది బెస్ట్!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్