సైకిల్‌ తొక్కుతూ ప్రసవానికి వెళ్లింది
close
Updated : 29/11/2021 18:46 IST

సైకిల్‌ తొక్కుతూ ప్రసవానికి వెళ్లింది!

(Photo: Instagram)

నెలలు నిండి నొప్పులొస్తుంటే ఆదుర్దా పడతాం. ఎలాగోలా ఆస్పత్రికి చేరితే చాలనుకుంటాం. కానీ న్యూజిలాండ్‌ ఎంపీ జూలీ అన్నే జెంటర్‌ మాత్రం తాపీగా సైకిల్‌ తొక్కుతూ ప్రసవానికి వెళ్లింది. క్షేమంగా పండంటి పాపాయికి జన్మనిచ్చింది. సైక్లింగ్‌ అంటే ఇష్టపడే ఆమె.. ఇలా సైకిల్‌పై ప్రసవానికి వెళ్లడం ఇది రెండోసారి. తన ఫిట్‌నెస్‌కు, ఆరోగ్యానికి సైక్లింగే కారణమంటోన్న ఆమె.. ఈ సందర్భంగా తన ఫొటోలను, అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి.
జూలీ అన్నే జెంటర్‌.. న్యూజిలాండ్‌లోని గ్రీన్‌ పార్టీకి చెందిన ఆమె.. ఆ దేశ మహిళా వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో మహిళా సాధికారతకు కృషి చేస్తూ.. అన్ని విషయాల్లో వారికి అండగా నిలుస్తున్నారు. సాధారణంగానే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ అంటే మక్కువ చూపే ఆమె.. ఈ విషయాల్లో అక్కడి మహిళలకు తానే ఉదాహరణగా నిలుస్తుంటారు.

ఈసారీ సైకిల్ పైనే..!

జూలీకి సైక్లింగ్‌ అంటే మహా ఇష్టం. తానెప్పుడూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడానికి సైక్లింగ్‌నే ఆయుధంగా చేసుకుంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారామె. అంతేకాదు.. తన సైక్లింగ్‌ ఫొటోల్ని సైతం సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మహిళలకు ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతుంటారు. గర్భం ధరించినా ఈ వ్యాయామాన్ని వీడలేదామె. అంతెందుకు.. తన ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లేందుకూ సైకిల్‌నే ఉపయోగించి తాజాగా వార్తల్లోకెక్కారు జూలీ. ఓవైపు నొప్పులు మొదలైనా.. మరోవైపు తాపీగా సైకిల్‌ తొక్కుతూ హాస్పిటల్‌కి వెళ్తూ, ప్రసవమయ్యాక తన బిడ్డను ఎత్తుకున్న ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయారీ న్యూమామ్.

అదలా జరిగిపోయిందంతే..!

‘ఆదివారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో నొప్పులు మొదలయ్యాయి. మరీ అంత తీవ్ర అసౌకర్యం లేకపోవడంతో సైకిల్‌ తొక్కుతూ మాకు దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లాను. నిజానికి సైకిల్‌పై వెళ్లాలని ముందుగా ప్లాన్ చేసుకోలేదు. కానీ అప్పుడు అదలా జరిగిపోయిందంతే! ఆపై 3 గంటల సమయంలో పండంటి పాపాయి పుట్టింది. ప్రసవ సమయంలోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు..’ అంటూ తన సైక్లింగ్‌ స్టోరీని పంచుకుంది జూలీ. కేవలం ఇప్పుడే కాదు.. మొదటి సంతానంగా బాబుకు జన్మనిచ్చిన ఆమె.. ఆ సమయంలోనూ సైకిల్ పైనే ఆస్పత్రికి వెళ్లి వార్తల్లో నిలిచారు.

ఇలా జూలీ పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన చాలామంది ఆమె ధైర్యాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ‘సుఖ ప్రసవానికి సైక్లింగే చక్కటి వ్యాయామం! జూలీ ఎంతోమంది మహిళలకు ఆదర్శం!’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

డేరింగ్‌.. అండ్‌ డ్యాషింగ్!

తన వృత్తిలో ఎంతో నిబద్ధతతో ఉండే జూలీ.. తన వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడానికీ ఏమాత్రం మొహమాటపడరు. ఈ క్రమంలోనే తనకు బాబు పుట్టకముందు పలుమార్లు అబార్షన్లయ్యాయంటూ బహిరంగంగా పంచుకొని తన పారదర్శకతను చాటుకున్నారు. ఇలా ఆరోగ్యం విషయంలో మహిళలందరిలో స్ఫూర్తి నింపుతోన్న ఈ లేడీ పొలిటీషియన్.. స్త్రీలు తమ వృత్తిగత జీవితంలోనూ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలంటారు.

‘మహిళలు నాయకులైతే సంస్థకు సంబంధించిన ప్రతి వ్యవహారంలో చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇది పరోక్షంగా కంపెనీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. తద్వారా మహిళలకు అవకాశాలూ పెరుగుతాయి. ఇలా జరిగితే సమాజం అభివృద్ధికి దారులు తెరుచుకున్నట్లే!’ అంటూ తన మాటలతోనూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు జూలీ. ప్రస్తుతం ఓ మహిళా మంత్రిగా అక్కడి ప్రభుత్వ రంగ సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి, వేతన సమానత్వం సాధించడానికి కృషి చేస్తున్నారు జూలీ.

గమనిక: అయితే నొప్పులొస్తున్నా సైకిల్‌ తొక్కుతూ ప్రసవానికి వెళ్లడమంటే సవాలనే చెప్పాలి. ఇది వరకే వ్యాయామానికి అలవాటు పడిన వారికి, గర్భిణిగా ఉన్నప్పుడు సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు సాధన చేసిన వారికి ఇదంత అసౌకర్యంగా ఏమీ అనిపించకపోవచ్చు. ఈ క్రమంలో- గతంలో అలవాటున్నా సరే.. లేదా కొత్తగా అయినా సరే ఇలాంటి సాహసాలు.. అదీ ప్రసవ సమయంలో అంటే.. ప్రయత్నించకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి ఈ విషయంలో ఎవరి ఆరోగ్యంపై వాళ్లు శ్రద్ధ పెడుతూ, డాక్టర్‌ సలహాలు పాటించడం అత్యుత్తమం అని గుర్తు పెట్టుకోండి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని