ఈ బ్రేక్‌ఫాస్ట్‌తో బరువు తగ్గేద్దాం!

బరువు తగ్గాలని రకరకాల డైట్‌లను అనుసరిస్తూ.. కష్టపడి క్యాలరీలు కరిగించే వారి సంఖ్య ఈ రోజుల్లో కాస్త ఎక్కువగానే ఉంటోంది. అయితే తీరిక లేని కారణంగానో లేక త్వరగా బరువు తగ్గాలన్న ఆత్రంతోనో కొందరు ఉదయం పూట తీసుకునే అల్పాహారాన్ని అప్పుడప్పుడూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ....

Published : 26 Aug 2022 19:54 IST

బరువు తగ్గాలని రకరకాల డైట్‌లను అనుసరిస్తూ.. కష్టపడి క్యాలరీలు కరిగించే వారి సంఖ్య ఈ రోజుల్లో కాస్త ఎక్కువగానే ఉంటోంది. అయితే తీరిక లేని కారణంగానో లేక త్వరగా బరువు తగ్గాలన్న ఆత్రంతోనో కొందరు ఉదయం పూట తీసుకునే అల్పాహారాన్ని అప్పుడప్పుడూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు సరికదా.. మధ్యాహ్నం ఇంకాస్త ఎక్కువగా ఆకలి వేసి మనకు తెలియకుండానే అధికంగా ఆహారం తీసుకునే వీలు ఉంటుంది. అందుకే బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాలను ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే తీసుకోదగిన ఆ పదార్థాలేంటో ఒకసారి మనమూ చూసేద్దామా..

రోజంతా ఉత్సాహంగా ఉంటూ పని చేసుకోవడానికి సరిపడా శక్తి సమకూరాలంటే వివిధ పోషక విలువలతో కూడిన ఆరోగ్యవంతమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. అయితే బరువు తగ్గాలనుకునేవారు 'అల్పాహారం చేయకపోతే ఇంకా త్వరగా బరువు తగ్గచ్చు' అని అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ప్రొటీన్స్ అధికంగా ఉండే ఆహారపదార్థాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ద్వారా ఇంకా త్వరగా బరువు తగ్గే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

ఎలా అంటే..

సాధారణంగా ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకున్నప్పుడు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహారపదార్థాల పైకి అంత త్వరగా దృష్టి మళ్లదు. అదీకాకుండా మన శరీరంలో ప్రొటీన్స్‌ని జీర్ణం చేసుకునేందుకు అయ్యే క్యాలరీల ఖర్చు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే బరువు తగ్గాలని అనుకునే వారు కొవ్వులు, కార్బోహైడ్రేట్స్‌తో పోలిస్తే ప్రొటీన్స్ అధికంగా ఉండే పదార్థాలను తమ డైట్‌లో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తారు. ప్రొటీన్స్ పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా ఆకలిని నియంత్రించే విధంగా మెదడు నుంచి బలమైన సంకేతాలు వెలువడినట్లు ఎం.ఆర్.ఐ స్కాన్‌లో కూడా తేలిందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు నిరూపించాయి.

కోడిగుడ్లు..

ఉదయాన్నే పప్పు ధాన్యాలతో కూడిన ఆహారపదార్థాలకు బదులుగా గుడ్డుతో తయారుచేసిన పదార్థాలను అల్పాహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి తగిన శక్తి అందడమే కాకుండా తదుపరి భోజనంలో భాగంగా తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తారు. అందుకే కోడిగుడ్లను ఇతర కూరగాయలతో కలిపి వండుకోవడం లేదా కాటేజ్ చీజ్, పాలకూర ఉపయోగించి ఆమ్లెట్‌గా వేసుకోవడం.. వంటివి చేయాలి. గుడ్లతో పాటు చేపలు, మాంసం, పాలు, పాల సంబంధిత పదార్థాలు.. మొదలైనవి కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు.

ప్యాన్‌కేక్స్‌తో..

కోడిగుడ్లలోని తెల్లసొన అరకప్పు, ఓట్‌మీల్, కాటేజ్ చీజ్.. ఇవన్నీ ఒక గిన్నెలో వేసి అందులో చెంచా బేకింగ్ సోడా కూడా జత చేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్యాన్‌పై చిన్న చిన్న అట్లుగా పోసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న ప్యాన్ కేక్స్‌కి తాజా పండ్లు, తేనె జత చేసి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రొటీన్స్ పుష్కలంగా అందుతాయి. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయంటున్నారు నిపుణులు.

బీన్స్‌తో..

బీన్స్‌లో పీచుపదార్థాలే కాదు.. ప్రొటీన్స్ కూడా అధిక స్థాయిలోనే ఉంటాయి. పైగా వీటిలో ఉండే పీచుపదార్థాలు చాలా త్వరగా శరీరంలో కలిసిపోతాయి. అంతేకాదు.. పొట్ట దగ్గర ఉండే కొవ్వుని కరిగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకున్న తర్వాత అధిక సమయం కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. తద్వారా బరువు తగ్గడమే కాదు.. నాజూకైన శరీరాకృతినీ సొంతం చేసుకోవచ్చు.

పుచ్చకాయతో..

పుచ్చకాయలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయాన్నే తీసుకోకూడదని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ మితంగా తీసుకోవడం ద్వారా చక్కటి ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఉదయాన్నే దీనిని అల్పాహారంగా తీసుకునే వారిలో కొవ్వులు తక్కువ స్థాయిలో పేరుకున్నట్లు పలు అధ్యయనాల్లోనూ రుజువైంది.

ఇవి కూడా..

పీనట్ బటర్, ఆల్మండ్ బటర్, యాపిల్స్, అవకాడో, అరటిపండ్లు, ద్రాక్ష, బెర్రీస్, చిలగడ దుంప, బ్రకలీ, పాలకూర.. మొదలైనవి అల్పాహారంలో భాగం చేసుకోవచ్చు.

బ్రేక్‌ఫాస్ట్‌పై టాపింగ్స్‌గా మిరియాలు, వాల్‌నట్స్, అల్లం, దాల్చినచెక్క, అవిసె గింజలు, కొబ్బరినూనె.. మొదలైనవి ఉపయోగించడం ద్వారా కూడా సులభంగా బరువు తగ్గచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్