నేను ట్రెండ్‌ ఫాలో అవను..

కొందరు ఎవరేమనుకున్నా సరే.. నచ్చింది చేస్తూ నలుగురికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఆ కోవకే చెందుతుంది రవనీత్‌ కౌర్‌. ప్రకృతిపై ఉన్న ప్రేమనే ఆదాయమార్గంగా మలుచుకుంది.

Updated : 01 Nov 2023 14:10 IST

కొందరు ఎవరేమనుకున్నా సరే.. నచ్చింది చేస్తూ నలుగురికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఆ కోవకే చెందుతుంది రవనీత్‌ కౌర్‌. ప్రకృతిపై ఉన్న ప్రేమనే ఆదాయమార్గంగా మలుచుకుంది. సేంద్రియ పద్ధతిలో మిద్దెతోట సాగుచేస్తూ.. ఆ మెలకువలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుతోంది. లక్షల ఫాలోయర్లనూ సొంతం చేసుకుంది. ఆ స్ఫూర్తిదాయక ప్రయాణం మనమూ తెలుసుకుందామా!

రవనీత్‌ కౌర్‌ స్వస్థలం పంజాబ్‌లోని లుధియానా. చిన్నతనం నుంచీ తను పెరిగిన వాతావరణం ఆమెను ప్రకృతి ప్రేమికురాలిగా మార్చింది. చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి పాఠశాల, కాలేజీ ఆవరణలో మెుక్కలు పెంచేది. అందుకు ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలూ అందుకునేది. చదువు పూర్తయ్యాక రవనీత్‌ అమ్మానాన్నలు కూడా చాలామంది తల్లిదండ్రుల్లానే ఆమెను ఉద్యోగం చేసుకొమ్మనే అన్నారు. అది ఇష్టం లేని తను ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలనుకుంది.

కొవిడ్‌ ఇచ్చిన ఆలోచన..

2019లో రవనీత్‌ వాళ్ల నాన్న ఆరోగ్యం దెబ్బతింది. ఆయన కోసం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గోధుమ గడ్డిని తనే సొంతంగా పెంచేది. అంతలోనే కొవిడ్‌ రావడంతో అందరిలాగే ఆమె కూడా ఇంటికే పరిమితం అయ్యింది. ఖాళీగా ఉండే  కంటే ఇష్టమైన వ్యాపకానికి పదును పెడితే బాగుంటుందనుకుంది రవనీత్‌. అనుకుందే తడవుగా తన ఇంటి మిద్దెపై కాయగూర మెుక్కల్ని పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేసింది. మొదట పాలకూర, వంకాయ లాంటి సులువుగా పెరిగే మొక్కలతో ప్రారంభించి, తర్వాత కాలానుగుణంగా పండే బ్రొకలి, క్యాబేజి, ముల్లంగి, పుచ్చకాయ వంటి అనేక రకాల కూరగాయలు, పండ్ల మొక్కల్ని సాగు చేసింది. వంటింటి వ్యర్థాలతో సొంతంగా ఎరువునీ తయారు చేసుకుంది. తన 2 వేల చదరపు అడుగుల మిద్దెపై 200 రకాలకు పైగా మొక్కల్ని పెంచుతూ ఇంటి పరిసరాల్ని ప్రకృతి వనంలా మార్చేసింది. ఈ క్రమంలోనే సాగులోని మెలకువలను అందరికీ తెలియజేయాలనుకుంది. అందుకోసం ‘హర్యాలీ బై చెరి’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్టు చేస్తోంది. ప్రస్తుతం 1.7 లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు. ఆ వీడియోల్లో పక్షుల నుంచి, వాతావరణ మార్పులకు అనుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి మొక్కలను సంరక్షించుకోవడం వంటి సూచనలిస్తోంది. పంట మార్పిడి విధానాలపైనా రైతులకు అవగాహన కల్పిస్తోంది రవనీత్‌. ‘నేను నమ్మిన దాన్ని చేయటానికి ఎప్పుడూ వెనకాడను. అది మిద్దెతోట పెంచటం కావొచ్చు..సేంద్రియ ఉత్పత్తులను వాడటం అవొచ్చు. నేను ట్రెండ్స్‌ను ఫాలో అవను. నా మనసు ఏం చెప్తే అదే చేస్తాను. నలుగురిలో మీరు విభిన్నంగా నిలవాలనుకుంటే మీరూ మీ మనసుకు నచ్చింది మాత్రమే చేయండి’ అంటున్న రవనీత్‌ కౌర్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్