Water Warrior: మురుగు నీటిని మంచి నీరుగా మారుస్తోంది!

నిత్యావసరాలు, ఇతర పనుల రీత్యా రోజూ లీటర్ల కొద్దీ నీటిని వృథా చేస్తుంటాం.. కానీ ఇదే సమయంలో నీటి కరువు తాండవించే ప్రాంతాల గురించి ఆలోచించం..! ఇదిలాగే కొనసాగితే తర్వాతి తరాలకు ప్రతి నీటి బొట్టూ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని గణాంకాలు......

Published : 12 Apr 2022 19:55 IST

(Photo: Twitter)

నిత్యావసరాలు, ఇతర పనుల రీత్యా రోజూ లీటర్ల కొద్దీ నీటిని వృథా చేస్తుంటాం.. కానీ ఇదే సమయంలో నీటి కరువు తాండవించే ప్రాంతాల గురించి ఆలోచించం..! ఇదిలాగే కొనసాగితే తర్వాతి తరాలకు ప్రతి నీటి బొట్టూ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే మన తప్పిదాల మూలంగా తర్వాతి తరాలు బాధపడడం దిల్లీకి చెందిన స్మితా సింఘాల్‌కు ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఈ నీటి కరువుకు ఇక్కడే చెక్‌ పెట్టాలని నిర్ణయించుకుందామె. దాని ఫలితమే ‘Absolute Water Private Limited’. మురుగు నీటిని మంచినీరుగా మార్చే తన స్టార్టప్‌తో ప్రతి నీటి బొట్టునూ ఆదా చేస్తోన్న ఈ వాటర్‌ వారియర్‌ సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి..

దిల్లీకి చెందిన స్మితా సింఘాల్‌కు చిన్నతనం నుంచీ ఒక ఆలోచన ఉండేది. తాను ఏ పని చేసినా భిన్నంగా, ప్రత్యేకంగా, సంపూర్ణంగా ఉండాలనేది ఆమె కోరిక. ఇందుకు తగ్గట్లుగానే పెరిగి పెద్దయ్యే క్రమంలో ప్రతి విషయంలోనూ పరిణతితో ఆలోచించేదామె. దిల్లీ యూనివర్సిటీ నుంచి ‘కామర్స్‌, బిజినెస్‌ స్టడీస్‌’లో డిగ్రీ పూర్తి చేసిన స్మిత.. పలు కంపెనీల్లో పని చేసింది.

నీటి వృథా నచ్చక..!

స్మితకు పర్యావరణమన్నా మక్కువే! ఇందులో భాగంగానే చుట్టూ జరిగే విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టేదామె. ఇలా ఓ సందర్భంలో దేశంలోని నీటి ఎద్దడి గురించి తెలుసుకున్న ఆమె.. ఎలాగైనా ఈ సమస్యకు చెక్‌ పెట్టాలని నిర్ణయించుకుంది. ఇదే ఆలోచనను కెమికల్‌ ఇంజినీర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న తన తండ్రి ముందుంచింది. ఆయన ప్రోత్సహించడంతో 2019లో ‘Absolute Water Private Limited’ అనే సంస్థను నెలకొల్పింది స్మిత. ప్రపంచ ఆరోగ్య సంస్థ నాణ్యతా ప్రమాణాల ప్రకారం మురుగు నీటిని వివిధ పద్ధతుల ద్వారా శుద్ధి చేసి మంచి నీటిగా మార్చడమే దీని ముఖ్యోద్దేశం. దేశంలోనే వంద శాతం సహజసిద్ధంగా నీటిని శుద్ధి చేసే తొలి వ్యవస్థగా ఈ సంస్థ పేరు పొందింది. ఇందులో భాగంగా గృహావసరాలు, నిత్యావసరాలు, మురుగునీరు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, కొన్ని రకాల మెషీన్లను చల్లబరచడానికి వినియోగించిన నీరు.. ఇలా వ్యర్థం అంటూ వృథాగా వదిలేసే నీటిని సేకరించి.. శుద్ధ జలంగా మార్చి తిరిగి నిత్యావసరాల కోసం అందుబాటులో ఉంచుతోంది ఈ సంస్థ.

సౌరశక్తితో సహజసిద్ధంగా..!

మురుగునీటిని శుద్ధి చేయడానికి సౌరశక్తితో పనిచేసే పవర్‌ ప్లాంట్‌లను వినియోగిస్తోన్న స్మిత.. ఇందుకోసం అతి తక్కువ విద్యుత్‌ అవసరమవుతుందని చెబుతోంది. ‘నీటిని శుద్ధి చేసేందుకు మేం ఎలాంటి రసాయనాలూ ఉపయోగించం. సౌరశక్తితో పని చేసే మా ప్లాంట్లకు అతి తక్కువ విద్యుత్‌శక్తి అవసరమవుతుంది. ఇలా శుద్ధి చేసిన నీటిని నిత్యావసరాలు, తాగడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే మొదట్లో చాలామంది రీసైకిల్‌ చేసిన ఈ నీటిని వినియోగించుకోవడానికి ఇష్టపడకపోయేవారు. కానీ వారికి ప్రస్తుత నీటి సమస్యల్ని వివరించి, నీటిని శుద్ధి చేసే ప్రక్రియ గురించి వివరించాక చాలామందిలో మార్పొచ్చింది..’

అప్పటిదాకా అలుపు లేకుండా..!

‘మా వద్ద రీసైకిల్‌ చేసిన నీటిని నిత్యావసరాలకే కాదు.. యూపీలోని మెడికల్‌ కాలేజీలు, హాస్టళ్లలో లాండ్రీ కోసం.. దిల్లీ యూనివర్సిటీలో మొక్కల పెంపకానికి.. ఇలా పలు రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఈ పద్ధతిలో రోజుకు లక్ష లీటర్ల నీటిని శుద్ధి చేస్తున్నాం.. దీంతో పాటు త్వరలోనే ‘మొబైల్‌ వాటర్‌ రికవరీ సిస్టమ్‌’ను అందుబాటులోకి తేవాలనేది మా ఆశయం. అలాగే పరిశుభ్రమైన నీటిని కరువుతో అల్లాడుతోన్న ప్రాంతాలకు చేరువ చేయాలనుకుంటున్నాం. ప్రతి ఇంట్లో వృథా నీటిని ఎవరికి వారుగా శుద్ధి చేసుకునే రోజు వచ్చే దాకా నా ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది..’ అంటూ చెప్పుకొచ్చారీ వాటర్‌ వారియర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్