Mom Influencers : అందుకే ఈ అమ్మలకు అంత ఫాలోయింగ్‌!

పిల్లల పెంపకం అనేది ఒక అంతులేని అంశం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది బోలెడుంటుంది. అందులోనూ కొత్తగా తల్లైన మహిళల మనసు నిండా ఎన్నో సందేహాలు! చిన్నారుల సంరక్షణ, ఏ వయసులో ఎలాంటి....

Updated : 15 May 2023 19:04 IST

(Photos: Instagram)

పిల్లల పెంపకం అనేది ఒక అంతులేని అంశం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది బోలెడుంటుంది. అందులోనూ కొత్తగా తల్లైన మహిళల మనసు నిండా ఎన్నో సందేహాలు! చిన్నారుల సంరక్షణ, ఏ వయసులో ఎలాంటి ఆహారమివ్వాలి? ఒక్కో మైలురాయి దాటే క్రమంలో ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి? ఒక్కో అంశాన్ని ఎలా నేర్పించాలి? ఇలా ప్రతిదీ వారికి సవాలుగానే అనిపిస్తుంటుంది. ఇలాంటి సవాళ్లనే సులభతరం చేస్తున్నారు కొందరు అమ్మలు. అమ్మతనంలో తామెదుర్కొన్న అనుభవాలను గుదిగుచ్చి.. ఈ కాలం తల్లులకు పేరెంటింగ్‌ పాఠాలు నేర్పుతున్నారు. ఇందుకు సామాజిక మాధ్యమాల్ని వేదికగా చేసుకున్నారు.. తమ సలహాలు, సూచనలతో బోలెడంత ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొని ‘ఇన్ఫ్లుయెన్సర్లు’గా రాణిస్తున్నారు. అలాంటి కొందరు సోషల్‌ మామ్స్‌ గురించి ఈ ‘మాతృ దినోత్సవం’ ప్రత్యేకంగా మీకోసం..!

మాన్సీ పయెట్‌, మామ్‌కామ్‌ ఇండియా

గర్భం ధరించినప్పట్నుంచి మహిళల్లో ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ఇంట్లో వాళ్ల సలహాతో వాటిని నివృత్తి చేసుకుంటారు చాలామంది. మరి, ఆ అవకాశం లేని వారి పరిస్థితేంటి? ఈ విషయం దృష్టిలో పెట్టుకొనే 2017లో ‘మామ్‌ కామ్‌ ఇండియా’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించింది దిల్లీకి చెందిన మాన్సీ పయెట్‌. అప్పుడు తాను ఆరు నెలల గర్భవతి. ఆ సమయంలో కొత్తగా తల్లైన మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల సంరక్షణకు సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్‌లో పూర్తి సమాచారం లేదని తెలుసుకున్న ఆమె.. ఈ లోటును పూడ్చడానికే తన యూట్యూబ్‌ వేదికను ప్రారంభించానంటోంది మాన్సీ.

‘33 ఏళ్ల వయసులో నేను తల్లినయ్యాను. గర్భిణిగా మూడో త్రైమాసికంలో ఉన్నప్పట్నుంచే.. ప్రసవానంతరం పిల్లల సంరక్షణ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపాను. కానీ ఆ సమయంలో నెట్‌ నుంచి పూర్తి సమాచారం పొందలేకపోయా. ఇదే ‘మామ్‌ కామ్‌ ఇండియా’ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించడానికి దోహదం చేసింది. గర్భిణిగా ఉన్నప్పట్నుంచి.. ఆయా త్రైమాసికాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల మైలురాళ్లు, ఫీడింగ్‌, వారి సంరక్షణ, టాయిలెట్‌ ట్రైనింగ్‌, ఏ వయసులో ఎలాంటి ఆహారం అందించాలి?, పిల్లల్ని స్కూల్లో చేర్పించే క్రమంలో పేరెంట్స్‌ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు.. ఇలా పిల్లల పెంపకానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ వీడియోలుగా రూపొందించి అందిస్తున్నా. ఇందులో చాలా అంశాలకు నా స్వీయానుభవాలే స్ఫూర్తి.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక తల్లి తన అనుభవపూర్వకంగా కొత్తగా తల్లిదండ్రులైన వారికిచ్చే పూర్తిస్థాయి గైడెన్స్‌ ఈ యూట్యూబ్‌ ఛానల్‌..’ అంటూ చెప్పుకొచ్చింది మాన్సీ. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు 10.3 లక్షల సబ్‌స్క్రైబర్లున్నారు. ఇన్‌స్టాలో మాన్సీని 1.41 లక్షల మంది ఫాలో అవుతున్నారు.


కోమల్‌ నారంగ్‌, మై హ్యాపీనెస్

కొత్తగా తల్లైన మహిళల్లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటిని అంగీకరించి సాధారణ జీవనశైలిని అలవాటు చేసుకోవడం ఓ సవాలు లాంటిది. తన సలహాలతో ఈ దశను సులభతరం చేస్తోంది కోమల్‌ నారంగ్‌. కొత్తగా తల్లైన మహిళల్లో ఎదురయ్యే యాంగ్జైటీ, ప్రసవానంతర ఒత్తిడి, అందం-ఆరోగ్యం విషయాల్లో వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా అమ్మల జీవనశైలిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే ముఖ్యోద్దేశంతో ‘మై హ్యాపీనెస్’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌, ఇన్‌స్టా పేజీని ప్రారంభించిందామె.

‘‘మనం సంతోషంగా ఉన్నప్పుడే చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచగలం’ అన్న ఫిలాసఫీని నమ్ముతాను నేను. నా దృష్టిలో మహిళలు ఏదైనా చేయగల సమర్థులు. అందుకే వాళ్లు ప్రతి దశలోనూ పాజిటివిటీతో ముందుకెళ్లేలా ప్రోత్సహిస్తున్నా. కొత్తగా తల్లైన మహిళల్లో.. ప్రసవానంతర ఒత్తిళ్లు, పెరిగిన బరువు విషయంలో ఆందోళన చెందడం, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యలు వారి సంతోషాన్ని దూరం చేస్తుంటాయి. నా కొడుకు ఇవాన్‌ పుట్టాక నేనూ పలు సమస్యలతో సతమతమయ్యా. ఈ స్ఫూర్తితోనే 2013లో ‘మై హ్యాపీనెస్’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌, ఇన్‌స్టా పేజీ ప్రారంభించా. ఈ వేదికగా తల్లీపిల్లల ఆరోగ్యం, ప్రసవానంతరం సమస్యల్ని ఎదుర్కొని మహిళలు సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలు, స్వీయ ప్రేమ, బాడీ షేమింగ్‌.. తదితర అంశాలపై ఈతరం అమ్మలకు, మహిళలకు సలహాలిస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది కోమల్‌. ప్రస్తుతం ఇన్‌స్టా పేజీని మాత్రమే నడుపుతోన్న ఆమె ఖాతాను 4.4 లక్షల మంది ఫాలో అవుతున్నారు.


శిఖా సింగ్‌

చిన్నారుల సంరక్షణ, ఈ క్రమంలో ఉపయోగించే ఉత్పత్తుల విషయాల్లో కొత్తగా తల్లైన మహిళలకు చాలా సందేహాలుంటాయి. ఏ బ్రాండ్‌ మంచిది, ఏది మంచిది కాదో వాళ్లు తేల్చుకోలేకపోతారు. దీనికి తోడు తమ చుట్టూ ఉన్న వారు తలా మాట చెప్పడంతో వారిలో మరింత సందిగ్ధత నెలకొంటుంది. ఇలాంటి సందేహాల్ని నివృత్తి చేసి కొత్తగా తల్లైన మహిళలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు యూట్యూబ్‌ మామ్‌, టీవీ నటి శిఖా సింగ్‌. ఇందుకోసం ‘శిఖా సింగ్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన ఆమె.. ఓ తల్లిగా తనకెదురయ్యే అనుభవాలు, తన కూతురు అలైనా జీవనశైలి, ఆమెకు అందించే ఆహారం.. వంటి అంశాలతో పాటు పిల్లల విషయంలో తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంరక్షణ ఉత్పత్తులపై వీడియోల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు 4.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.


కిరణ్‌ రాజ్‌ సింగ్‌, ఇండియన్‌ మామ్‌ ఆన్‌ డ్యూటీ

చిన్నారులు తమ తోటి పిల్లల్ని చూసి బోలెడన్ని విషయాలు నేర్చుకుంటారు. ఈ ఆలోచనతోనే తన కూతురు అనైకాతో కలిసి పలు అంశాలపై వీడియోలు రూపొందిస్తున్నారు మరో సోషల్‌ మామ్‌ కిరణ్‌ రాజ్‌ సింగ్‌. తన చిన్నారికి సంబంధించి తాను వాడే చర్మ, ఆరోగ్య ఉత్పత్తులు.. రోజువారీ దినచర్య, తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలు.. ఇలా బోలెడన్ని అంశాలపై యూట్యూబ్‌ వీడియోలు రూపొందించారామె. తద్వారా తల్లీపిల్లల్లో అవగాహన పెంచుతున్నారు కిరణ్‌. ఇవే కాదు.. మహిళల కోసం నెలసరికి సంబంధించిన అంశాలు, మెన్‌స్ట్రువల్‌ కప్‌ వాడకం, DIY చిట్కాలు, ఫ్యాషన్‌-బ్యూటీ టిప్స్‌, ఆఫీస్‌ టిప్స్‌.. వంటివెన్నో అందిస్తున్నారామె. ‘మహిళలు ఇటు తల్లిగా, ఇల్లాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. అటు తమ కెరీర్‌నూ బ్యాలన్స్‌ చేసుకోవచ్చని చెప్పడమే ముఖ్యోద్దేశం’గా తన ఛానల్‌ను ప్రారంభించానంటోన్న కిరణ్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ప్రస్తుతం 7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.

వీరితో పాటు దివ్య రాజ్‌గురు (మామ్‌ ఎన్‌ మీ), రీమా (ఇండియన్‌ మామ్‌ స్టూడియో), ప్రాచీ ఓజా (డెయిరీ ఆఫ్‌ యాన్‌ ఇండియన్‌ మామ్‌), శిఖా (మామ్‌హుడ్‌ అండ్‌ బియాండ్‌).. వంటి మహిళలు కూడా పేరెంటింగ్‌కు సంబంధించిన అంశాలపై వీడియోలు రూపొందిస్తూ.. సోషల్‌ ఇన్ఫ్లుయెన్సర్లుగా, యూట్యూబ్‌ మామ్స్‌గా పేరుతెచ్చుకున్నారు.

మీ అమ్మ నుంచి అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాల గురించి, మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోవడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్