ఇప్పుడూ న్యాయ పోరాటంతోనే సాధించారు!

భారత సైన్యంలో సాధికారత దిశగా మరికొంతమంది మహిళా అధికారులు విజయం సాధించారు. తాజాగా మరో 39 మంది అధికారిణులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కనుంది. న్యాయ పోరాటం చేసి మరీ ఈ అధికారిణులు ఈ విజయం సాధించడం విశేషం.

Updated : 22 Oct 2021 21:04 IST

భారత సైన్యంలో సాధికారత దిశగా మరికొంతమంది మహిళా అధికారులు విజయం సాధించారు. తాజాగా మరో 39 మంది అధికారిణులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కనుంది. న్యాయ పోరాటం చేసి మరీ ఈ అధికారిణులు ఈ విజయం సాధించడం విశేషం.

సుప్రీంకోర్టు జోక్యంతో..

శారీరక కారణాలను సాకుగా చూపుతూ సైనిక దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలికే దిశగా గత ఏడాదిలోనే ముందడుగు పడిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యంతో సైన్యంలో మహిళల నియామకానికి సంబంధించిన షార్ట్‌ సర్వీస్‌ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) స్థానంలో ‘శాశ్వత కమిషన్’ ఏర్పాటైంది. దీంతో శారీరక కారణాలతో చాలా రోజులుగా సైనిక సవాళ్లకు దూరమైన మహిళలు పురుషులతో సమానంగా పదవీ విరమణ వయసు వరకూ సేవలందించే అవకాశం లభించింది.

గత ఏడాది సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంతవరకు- ఎస్‌ఎస్‌సీ కమిషన్‌ ద్వారానే ఆర్మీలోకి అడుగుపెట్టిన మహిళలు 14 ఏళ్లకు మించి సైన్యంలో సేవలందించలేకపోయారు. ఇదేక్రమంలో ‘సర్వీస్‌ ఎక్స్‌టెన్షన్‌’ కింద 14 ఏళ్లకు మించి సేవలందించిన మహిళలు పురుషుల్లా శాశ్వత కమిషన్‌ తరహా ప్రయోజనాలు పొందలేకపోయారు.

ఇప్పుడూ న్యాయ పోరాటంతోనే..

ఈ నేపథ్యంలోనే సుప్రీం ఆదేశాల మేరకు అప్పటివరకు ఎస్‌ఎస్‌సీ కింద ఉన్న మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌ కిందకు తీసుకువచ్చేలా భారత ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సైన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసి 400 మందికి పైగా మహిళా అధికారులకు ఈ హోదా కల్పించింది. వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్‌) సమీక్షను ఆధారంగా చేసుకుని కొందరికి ఈ హోదా ఇచ్చింది. అయితే ఈ క్రమంలో -71 మంది అధికారిణులు శాశ్వత కమిషన్ తిరస్కరణకు గురయ్యారు. వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్‌లో చేర్చే విధానం ఏకపక్షంగా, అన్యాయంగా ఉందని ఆరోపిస్తూ పలు అంశాలను తమ పిటిషన్లో పేర్కొన్నారు.

దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏసీఆర్‌ విధానాన్ని అనుసరించడం వివక్షాపూరితమే అని అభిప్రాయపడింది. దీనిపై కేంద్రం స్పందనను  అడిగిన న్యాయస్థానం.. అప్పటిదాకా ఈ 71 మంది మహిళా అధికారులను సర్వీసు నుంచి తొలగించొద్దని ఆదేశించింది. దీంతో కేంద్రం ఈ అంశంపై తాజాగా తమ స్పందన తెలియజేసింది. ఈ 71 మందిలో 39 మంది మహిళా అధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులుగా గుర్తించినట్లు తెలిపింది. మరో ఏడుగురు వైద్యపరంగా ఫిట్‌గా లేరని, ఇక మిగతా 25 మందిపై తీవ్రమైన క్రమశిక్షణారాహిత్య అభియోగాలున్నాయని పేర్కొంది.

ఈ క్రమంలో- కేంద్రం నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆ 39 మందికి వారం పని దినాల్లో శాశ్వత కమిషన్‌ హోదా కల్పించాలని ఆదేశించడం గమనార్హం. అంతేగాక, మిగతా 25 మంది అధికారిణులు శాశ్వత కమిషన్‌కు ఎందుకు అనర్హులో కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది.

17 ఏళ్ల న్యాయ పోరాటంతో..!

రక్షణ రంగానికి సంబంధించి ఎయిర్‌ఫోర్స్‌, నేవీల్లో పనిచేస్తున్న మహిళలకు గతంలోనే శాశ్వత కమిషన్‌ ఏర్పాటైంది. దీంతో అక్కడి మహిళలు పురుషులతో సమానంగా పదవీ విరమణ వయసు వరకూ సేవలందిస్తున్నారు. ఉన్నత పదవులు అలంకరిస్తున్నారు. అయితే సైన్యంలో మాత్రం సమాన హక్కులు సాధించుకోవడానికి 17 ఏళ్ల న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సైనిక దళాల్లో కూడా లింగ వివక్షకు ముగింపు పలికే దిశగా 2020 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అతివల శారీరక పరమైన పరిమితుల కారణంగా కమాండ్‌ హోదా ఇవ్వడం లేదన్న వాదనలను తప్పుపట్టింది. మహిళలందరికీ శాశ్వత కమిషన్‌ ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో- ఇప్పుడు తాజాగా మరో ౩౯ మంది అధికారిణులు న్యాయపోరాటం చేసి మరీ శాశ్వత కమిషన్ కు ఎంపికవడం చెప్పుకోదగిన విషయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్