Published : 24/10/2021 12:00 IST

అమ్మవ్వాలని ఐదుగురు అమ్మాయిల్ని దత్తత తీసుకుంది!

(Photo: Instagram)

ఆమె జీవితంలో అనుబంధం కలిసి రాలేదు.. అయినా తనకు నచ్చిన ఉద్యోగంలో స్థిరపడింది.. సింగిల్‌గా, నచ్చినట్లుగా జీవించడం మొదలుపెట్టింది. కానీ ఇంకా ఏదో మిస్సవుతున్నానన్న భావన అనుక్షణం ఆమెను వేధించేది. అది అమ్మతనమే అని అనతి కాలంలోనే గ్రహించింది. తల్లిగా మారాలంటే పెళ్లే చేసుకోనక్కర్లేదన్న భావనతో పిల్లల్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు అమ్మాయిల్ని దత్తత తీసుకొని అమ్మగా మారింది.  అయితే వాళ్లంతా ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, అదీ భారత్‌కు చెందిన వారు కావడం గమనార్హం.

చిన్నారులకు అనాథాశ్రమం కంటే అమ్మ ఒడే ఆత్మీయ నేస్తం.. ఇంటిని మించిన స్వర్గం లేదంటూ తనలోని మమకారాన్ని, మంచి మనసును చాటుకున్న ఆమే.. అమెరికాకు చెందిన క్రిస్టెన్ గ్రే విలియమ్స్. 12 ఏళ్లలో ఐదుగురు ఆడపిల్లల్ని దత్తత తీసుకొని తన కుటుంబాన్ని సంపూర్ణం చేసుకున్నానంటోన్న ఈ లవ్లీ మామ్‌.. ఈ క్రమంలో తనకెదురైన సవాళ్లు, తగిలిన ఎదురు దెబ్బల్ని ఓ ప్రముఖ సోషల్‌ మీడియా బ్లాగ్‌తో పంచుకుంది.

అమ్మ కావాలనేది ప్రతి మహిళ కల. అప్పుడే మహిళ జీవితం సంపూర్ణమవుతుంది. అయితే ఇందుకు పెళ్లే చేసుకోవాలంటే మాత్రం నేను దానికి అంగీకరించను. ఎందుకంటే పెళ్లి కాకపోయినా తల్లిగా మారాలంటే అందుకు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. దత్తత తీసుకోవడం అందులో ఒకటి. నేనూ అదే మార్గాన్ని ఎంచుకున్నా.

డేటింగ్‌-బ్రేకప్!

అప్పుడు నాకు 39 ఏళ్లు. ప్రేమ, డేటింగ్‌ నా జీవితంలో కలిసి రాలేదని అప్పుడే నేను గ్రహించాను. దాంతో సింగిల్‌గా ఉండడం అలవాటు చేసుకున్నా. అది నాకెంతో నచ్చింది. నేను చేసే టీచర్‌ ఉద్యోగం నాకు బోలెడంత సంతృప్తిని అందించింది. అయినా జీవితంలో ఇంకా పొందాల్సింది ఏదో ఉందన్న వెలితి మాత్రం నా మనసును మెలిపెట్టేది. అది అమ్మతనమే అని ఆ తర్వాత కానీ గ్రహించలేకపోయా. జీవిత భాగస్వామి లేనంత మాత్రాన అమ్మ ప్రేమను దూరం చేసుకోవాలనుకోలేదు. అందుకే పిల్లల్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ ‘సింగిల్‌ మదర్‌గా మేనేజ్‌ చేయగలనా?’ అన్న సందేహం అప్పుడప్పుడూ మెదిలేది. ఇలాంటి ఆలోచనలు నన్ను వెనక్కి లాగినప్పుడల్లా నా మనసుకు ఒకటే చెప్పుకునేదాన్ని. అదేంటంటే.. ‘అనాథాశ్రమంలో కంటే ఇంట్లోనే పిల్లలు సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతారు. వాళ్లకు ఇల్లే స్వర్గం..’ అని! ఈ సానుకూల ఆలోచనే నాతో తొలి అడుగు వేయించింది.

అప్పుడు నా గుండె పగిలింది!

అయితే సింగిల్‌గా ఉండడం వల్ల దత్తత విషయంలో నాకు కొన్ని ఆంక్షలు తప్పలేదు. అందుకే విదేశీ పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా. ఈ క్రమంలోనే నేపాల్‌ చిన్నారిని దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నా. ఇందుకోసం 28 వేల డాలర్లు కూడా చెల్లించా. కానీ అదే సమయంలో నేపాల్‌ నుంచి దత్తత తీసుకోవడాన్ని యూఎస్‌ నిలిపివేసింది. దాంతో నా గుండె పగిలినంత పనైంది. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన నాకు ఒక రోజు ఇండియన్‌ ఏజెన్సీ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీరు భారత్‌ నుంచి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి మార్గం సుగమమైంది. అయితే ప్రత్యేక అవసరాలున్న చిన్నారిని మాత్రమే దత్తత తీసుకోవాల్సి ఉంటుంది’ అనేది దాని సారాంశం! అది విని నా మనసు ఉప్పొంగిపోయింది. ప్రత్యేక అవసరాలున్న చిన్నారిని ఎలా చూసుకోవాలో తెలియకపోయినా.. అలాంటి బిడ్డకు అమ్మనవుతున్నానన్న ఆనందమే నాలో రెట్టించింది. ఇదే సంతోషాన్ని మా అమ్మతో పంచుకున్నా.

‘తెల్ల పిల్లను దత్తత తీసుకోవచ్చుగా..’ అన్నారు!

రెండు వారాల తర్వాత దత్తత గురించి ఇంటర్నెట్‌లో వెతుకుతుంటే ఐదేళ్ల మున్నీ ప్రొఫైల్‌ నా కంట పడింది. అంతకుముందు సంరక్షకుల చేతిలోనే ఆమె హింసకు గురైందని అమాయకంగా ఉన్న తన ముఖమే చెబుతోంది. తన ముఖకవళికల్లో ఒక రకమైన భయం కనిపించినా.. ఆమె నవ్వు మాత్రం నన్ను కట్టిపడేసింది. ఇక మున్నీనే నా కూతురు అని ఫిక్సైపోయా. కానీ ఈ విషయంలో మా నాన్న కాస్త వెనకా ముందూ అయ్యారు. ‘తెల్ల పిల్లను దత్తత తీసుకోవచ్చుగా?’ అన్నారు. అయినా ఈ క్రమంలో కొంత డబ్బు అవసరమైతే తనే సహాయపడ్డారు. ఆయన అందించిన చెక్‌ వెనుక ‘మున్నీ గ్రే’ అని రాసుండడం చూసి నా మనసు మేఘాల్లో తేలిపోయింది. ఎందుకంటే గ్రే అనేది మా ఇంటి పేరు. అంటే.. అప్పుడే ఆయన మున్నీని మా కుటుంబంలోకి ఆహ్వానించేశారన్నమాట!

ముహూర్తం అప్పుడు కుదిరింది!

ఆ తర్వాత పేపర్‌ వర్క్‌ అంతా పూర్తై మున్నీ మా ఇంట్లో అడుగు పెట్టడానికి కొన్ని నెలల సమయం పట్టింది. 2013 వేలంటైన్స్‌ డే రోజే మున్నీని మా ఇంటికి తెచ్చుకున్నాం. తొలిసారి తనను కౌగిలించుకున్నప్పుడు కలిగిన ఆనందం, అనుభూతిని మాటల్లో చెప్పలేను. తన గత జీవితంలోని చెడు జ్ఞాపకాల్ని దూరం చేయడానికి తనకు మరింత దగ్గరగా మెలిగేదాన్ని. ఈ క్రమంలో ఇద్దరం ఒకరికొకరు నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడం, కలిసే వాకింగ్‌కి వెళ్లడం.. ఇలా చేసే ప్రతి పనిలోనూ మమేకమయ్యేవాళ్లం. నేనంటే మున్నీ, మున్నీ అంటే నేను అన్నంతలా కలిసిపోయాం. అయితే తను ఇలా సింగిల్‌గా పెరగకూడదన్న ఆలోచన నా మనసులోకి వచ్చింది. అనుకున్నదే తడవుగా రెండో బిడ్డను దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే 22 నెలల పాప రడీగా ఉందన్న విషయం ఏజెన్సీ ద్వారా తెలిసింది. అయితే తనకు ముక్కు లేదని చెప్పారు.. అయినా అంగీకారమైతే ముందుకెళ్లమన్నారు.

మున్నీకి రూప తోడైంది!

ఆ పాపే రూప. వీధిలో ఒంటరిగా ఉన్నప్పుడు కుక్కల దాడిలో గాయపడిందని, తద్వారా ముక్కును కోల్పోయిందన్న విషయం తెలుసుకున్నా. వెంటనే రూప ఫొటోను మున్నీకి చూపించాను. ‘అమ్మా.. తనే నా చెల్లెలా?’ అంది మున్నీ. అవునని చెప్పా. తనను ఇంటికి తీసుకురావడానికి సుమారు ఏడాది పట్టింది. అయితే ఇంటికొచ్చాక వారం పాటు బాగానే ఉంది. ఆ తర్వాతే విపరీతంగా ఏడవడం మొదలుపెట్టింది. తనను నాతో తీసుకొచ్చి తప్పు చేశానేమో అని అప్పుడనిపించింది. కానీ ఒక రోజు హ్యాపీగా ఆడుకుంటూ కనిపించింది.. ఆ సమయంలో నేను, మున్నీ కూడా తనతో పాటు జాయినయ్యాం. ఆ తర్వాత్తర్వాత తను మా కుటుంబంలో కలిసిపోయింది. మరో రెండేళ్లలో మోహిని, సొనాలీ అనే ఇద్దరు పాపల్ని దత్తత తీసుకొని నా కుటుంబాన్ని మరింత విస్తరించుకున్నా.

అందమైన పజిల్‌లా కలిసిపోయాం!

పిల్లల్ని మరింత బాగా చూసుకునే క్రమంలో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టా. ఓ అమ్మగా వాళ్ల చిన్నతనాన్ని ఏమాత్రం మిస్సవకూడదనే ఆలోచనతో ఎక్కువ శాతం ఇంటి నుంచే పనిచేసేదాన్ని. ఆ సమయంలో అమ్మగా వాళ్ల ప్రతి అడుగూ ఆస్వాదించా. ఇలా ముందుకెళ్తున్న క్రమంలోనే ఈ ఏడాది స్నిగ్ధ అనే మరో అమ్మాయిని దత్తత తీసుకున్నా. ఆమె డౌన్ సిండ్రోమ్‌ చిన్నారి. తన రాకతో నా కుటుంబం పరిపూర్ణమైంది. ఇప్పుడిప్పుడే తను మా ఫ్యామిలీలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఇక తన పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసే బాధ్యతను తన నలుగురు అక్కలు భుజాన వేసుకున్నారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తోబుట్టువుల్లా కలిసిపోయిన వాళ్లను చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. ఈ ప్రేమే కలకాలం మీ వెంట ఉండాలని ప్రతిరోజూ వారికి చెబుతుంటా. నిజానికి మా ఆరుగురి నేపథ్యాలు వేరు.. అయినా ఒక అందమైన పజిల్‌లా ఇమిడిపోయాం. నా 39 ఏళ్ల వయసులో ప్రారంభమైన ఈ ప్రయాణం.. నాకు 51 ఏళ్లొచ్చే నాటికి పరిపూర్ణమైంది. ఈ పన్నెండేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో భావోద్వేగాలు..! ఇలా మా కథ కంచికి చేరింది..!’ అంటూ తన మదర్‌హుడ్ స్టోరీని పంచుకుంది విలియమ్స్.

అమ్మతనాన్ని పొందడానికి పెళ్లే చేసుకోనక్కర్లేదు.. దత్తత తీసుకొని సామాజిక స్పృహనూ చాటుకోవచ్చంటూ అందరిలో స్ఫూర్తి నింపుతోన్న ఈ యూఎస్‌ మామ్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘మీరు ఎంతోమందికి ఆదర్శం.. మీ ఐదుగురు అమ్మాయిలు ఎంతో అందంగా ఉన్నారు..’ అంటూ తమ స్పందనను తెలియజేస్తున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని