అందుకే ఈ అమ్మాయి వాళ్లందరికీ స్ఫూర్తి!

ఉత్తరప్రదేశ్‌లోని బదారా అనే గ్రామంలో ఎనిమిదో తరగతి వరకే పాఠశాల ఉంది. అందుకే ఆ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలకు వెంటనే పెళ్లి చేసి మెట్టినింటికి పంపిస్తారు అక్కడి తల్లిదండ్రులు. నిత్యం కరవుతో కొట్టుమిట్టాడే ఈ గ్రామంలో ఇది సర్వసాధారణం. అయితే ఈ పరిస్థితులు మారాలని, అందుకు చదువొక్కటే మార్గమంటోంది అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల అన్సూయ కుష్వాహా. ఓ దినసరి వ్యవసాయ కూలీ కూతురు అయిన ఈ అమ్మాయి... ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించింది.

Published : 03 Aug 2021 16:11 IST

(Image for Representation)

ఉత్తరప్రదేశ్‌లోని బదారా అనే గ్రామంలో ఎనిమిదో తరగతి వరకే పాఠశాల ఉంది. అందుకే ఆ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలకు వెంటనే పెళ్లి చేసి మెట్టినింటికి పంపిస్తారు అక్కడి తల్లిదండ్రులు. నిత్యం కరవుతో కొట్టుమిట్టాడే ఈ గ్రామంలో ఇది సర్వసాధారణం. అయితే ఈ పరిస్థితులు మారాలని, అందుకు చదువొక్కటే మార్గమంటోంది అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల అన్సూయ కుష్వాహా. ఓ దినసరి వ్యవసాయ కూలీ కూతురు అయిన ఈ అమ్మాయి... ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించింది. తనలాంటి ఆడపిల్లల చదువుకు స్ఫూర్తిగా నిలిచింది.

కొవిడ్‌ ఇబ్బందులను అధిగమించి!

గ్రామాల్లో అరకొర సౌకర్యాలతో సాగే పిల్లల చదువులు కరోనా రాకతో మరింత దిగజారిపోయాయి. నగరాలు, పట్టణాల్లో ఆన్‌లైన్‌ చదువులు కొనసాగుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఆ అవకాశం ఉండడం లేదు. దీంతో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక సమస్యలతో పాటు కొవిడ్‌ కష్టాలను ఎదిరించి మరీ చదువు కొనసాగించింది యూపీలోని బదేరా గ్రామానికి చెందిన అన్సూయ. పేద విద్యార్థుల కోసం బులంద్‌షహర్‌లో ఏర్పాటుచేసిన విద్యాజ్ఞాన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతోన్న ఈ అమ్మాయి ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ చూపింది. హ్యుమానిటీస్‌ స్ట్రీమ్‌ విభాగంలో ఇంగ్లిష్‌, హిస్టరీ, జియోగ్రఫీ, ఫైన్‌ ఆర్ట్స్‌, హిందీ సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు, పొలిటికల్‌ సైన్స్‌లో 99 మార్కులు సాధించిన అన్సూయ... మొత్తం మీద వంద శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

అన్సూయ తండ్రి ఓ దినసరి వ్యవసాయ కూలీ కాగా, తల్లి గృహిణి. వీరికి మొత్తం ఏడుగురు సంతానం. అన్సూయ ముగ్గురు అన్నలు ఎనిమిదో తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం తండ్రితో పాటు కూలి పనులకు వెళుతున్నారు. ఇద్దరు అక్కలైతే పాఠశాల ముఖమే చూడలేదు. కేవలం అన్సూయ, ఆమె తమ్ముడు మాత్రమే చదువుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉంటోన్న అన్సూయ 5వ తరగతి తర్వాత బులంద్‌షహర్‌ విద్యాజ్ఞాన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు ఎంపికైంది.

8వ తరగతి తర్వాత మూడు ముళ్లే!

అప్పటి నుంచి అక్కడే చదువుకుంటోన్న అన్సూయ పదో తరగతిలోనూ 98.2 శాతం మార్కులు సాధించింది. తాజాగా 12వ తరగతిలో ఏకంగా వంద శాతం సాధించింది. ‘మా ఊళ్లో ఎనిమిదో తరగతి వరకే పాఠశాల ఉంది. ఈ తరగతి తర్వాత అబ్బాయిలు పొలం పనులు, కూలి పనుల్లో చేరతారు. అదే అమ్మాయిలకైతే పెళ్లి చేసి అత్తారింటికి పంపుతారు పెద్దలు. మా అమ్మానాన్నలు కూడా అసలు చదువుకోలేదు. అందుకే ప్రస్తుతం నేనేం సాధించానో కూడా వారికి అర్థం కావడం లేదు. మా ఊరు, చుట్టుపక్కల గ్రామల్లో కొందరు నా గురించి మాట్లాడుకుంటుంటే విని సంతోషపడుతున్నారు...అంతే’ అని విచారం వ్యక్తం చేసిందీ యంగ్‌ గర్ల్.

వంద శాతం ఊహించలేదు!

‘ఇక నా చదువు విషయానికొస్తే... మా ఊళ్లో ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. విద్యుత్ సరఫరా కూడా అంతంతమాత్రమే. దీంతో ఆన్‌లైన్‌ విద్య నాకు చాలా కష్టమనిపించింది. నా వద్ద ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌ ఉండేది కాదు. మా టీచర్లు వాట్సప్‌లో పంపిన స్టడీ మెటీరియల్‌ను నెట్‌వర్క్‌ ఉన్నప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకునేదాన్ని. ప్రి-బోర్డ్స్‌ ఎగ్జామ్స్‌లో నాకు మంచి మార్కులు వచ్చాయి. దీంతో ఇందులోనూ మంచి స్కోర్‌ వస్తుందనుకున్నాను. అయితే వంద శాతం వస్తుందని మాత్రం ఊహించలేదు.’

ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుంది!

‘నాకు జియోగ్రఫీ, జర్నలిజం సబ్జెక్టులు అంటే బాగా ఇష్టం. బాగా చదువుకుని ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలనుకుంటున్నాను. తద్వారా ఇక్కడి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. చదువు సంగతి పక్కన పెడితే నాకు బాస్కెట్‌బాల్‌ అంటే చాలా ఇష్టం. మా పాఠశాల బాస్కెట్‌బాల్‌ టీం ప్లేయర్‌గా కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాను. వీటితో పాటు మ్యూజిక్‌, పెయింటింగ్స్‌పై కూడా ఆసక్తి ఉంది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది అన్సూయ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్